
ఆంధ్రాలో కూడా ‘మాదిగ’ పేరు మార్చాలా?
కర్నాటకలో మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. అవును, పాత పేర్లు గతించిపోవాల్సిందే అంటున్నారు ప్రముఖ రచయిత జాన్సన్ చోరగుడి
ఎస్సీ వర్గీకరణపై గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దక్షణాదిన ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏకసభ్య కమీషన్ ఏర్పాటు చేసి, వాటి నివేదిక మేరకు ఎస్సీ వర్గీకరణను అమలు చేశాయి. కర్ణాటకలో కూడా జస్టిస్ హెచ్.ఎన్. నాగమోహన్ దాస్ కమీషన్ ఆగస్టు మొదటి వారంలో నివేదికను ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు అందచేసింది. ఈ నివేదిక కూడా స్థూలంగా తెలుగు రాష్ట్రాల నమూనాకు దగ్గరగా ఉంది. అయితే ఈ నివేదికలో ‘రిజర్వేషన్’ శాతం గురించి మాత్రమే కాకుండా, కమీషన్ ముందుకు వచ్చిన ‘ఎస్సీ’ కులాల ఆత్మ గౌరవ సంబంధిత అంశాలపై తమ దృష్టికి వచ్చిన డిమాండ్లను తగు చర్య నిమిత్తం కమీషన్ ప్రభుత్వం ముందు ఉంచింది.
తెలుగు రాష్ట్రాలకు భిన్నంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో అభివృద్ది చెందుతున్న ఎస్సీ కులాల గొంతుకు మొదటి నుంచి బలమైన సాంస్కృతిక నేపధ్యం ఉంది. రాజకీయ ప్రాతినిధ్యంలో ఆ కులాలు తమ వాటాను కైవశం చేసుకోవడంలో కూడా వారి క్రియాశీలత మనకంటే ఎప్పుడు ముందుగా ఉంటుంది. అక్కడి ఎస్సీ సమూహాల ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్ర, వారికి తమ వ్యవస్థపై బలమైన పట్టు బిగించడానికి దోహదపడింది. ఈ ఆధ్యాత్మిక ఛాయలు సరిహద్దున ఉన్న రాయలసీమ జిల్లాలలోని మఠ సాంప్రదాయాలలో కొంతమేర ఇప్పటికీ కనిపిస్తాయి. తమదైన ఆరాధనా విధానాలు, ఆచారాలు, పండగలు అలా ఒనగూడిన వారి ఆత్మనిబ్బరం వారి కుల వృత్తులను గౌరవించుకోవడంలోనూ కనిపిస్తుంది.
ఇందుకు తాజా ఉదాహరణ ఉత్తర కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో ‘కొల్హాపూర్’ చెప్పులు తయారు చేసే ‘చమర్’ (మాదిగ) కులస్తుల ఉదంతం. ఈ చెప్పులకు జులై 2019 నుంచి ‘జీఐ’ (‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’) హోదా ఉంది. అటువంటిది ఆ నమూనాను ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ‘ప్రాడా’ మన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గాని, ఇక్కడి చర్మకార సంఘాల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా, ఆ చెప్పులను ప్రపంచ ఫ్యాషన్ షోలలో తన బ్రాండ్లగా మార్కెటింగ్ చేసుకోవడానికి పూనుకుంది. మన ‘చమర్’ సంఘాలు దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తే, చివరికి ఆ కంపెనీ ప్రతినిధులు ఆగస్టు 8న ఇండియా వచ్చి మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను చర్మకార సంఘాలను కలిసి ఒక పరస్పర అంగీకారానికి వచ్చేంతవరకు అక్కడి ‘చమర్’ సంఘాలు దీన్ని వదలలేదు.
అలాగే ఇప్పుడు కర్ణాటకలో ఈ కులాలలో కొందరు తమ కులాల పేర్లు మార్చాలని, పిలుపులో అవి అమర్యాదకరంగా ఉండడంతో ఇకముందు ఆ పేర్లతో పిలిపించుకోవడానికి తాము సిద్దంగా లేమని అభ్యంతరం చెప్పడంతో, ఈ కమీషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కులాల పేర్ల మార్పుపై నిర్ణయం కేంద్రప్రభుత్వం తీసుకోవాలసి ఉంటుందని, కనుక దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాయాలని తన నివేదికలో కోరింది. ఇందులో ‘మాదిగ’ కూడా ఉండడంతో, ఎంతో కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరు వాడకంపై ఉన్న అభ్యంతరం మరోమారు తెరమీదికి వచ్చింది.
గతంలోనే కొందరు దీన్ని లేవనెత్తినప్పుడు, దీనికంటే ముఖ్యమైన ఎస్సీ‘వర్గీకరణ’ అపరిష్కృతంగా ఉండగా, కులం పేరు గురించి ఈ దశలో మాట్లాడం సరికాదని దాన్ని ఆపారు. ఇదే విషయంపై విజయవాడకు చెందిన రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, రచయిత ‘కాలమిస్ట్’ కోట బిపిన్ పాల్ చంద్ర మాట్లాడుతూ ‘తాను 15 ఏళ్ల క్రితం మంద కృష్ణ మాదిగతో కులం పేరు మార్పు విషయమై నేను అడినప్పుడు, విని మౌనంగా ఉన్నారని’ ఈ వ్యాస రచయితతో చెప్పారు. ఎందుకు పేరు విషయంలో వీరికి ఇటువంటి ఆక్షేపణ అని చూసినప్పుడు, కుల వృత్తులే అందుకు కారణంగా కనిపిస్తున్నాయి. మాగాణి భూముల విస్తీర్ణం ఎక్కువగా ఉండే కోస్తాంధ్రలో భూస్వామ్య కులాలకు పాడి-పశువులు పంటల సాగుతో సమానమైన ఆదాయం వనరు. అయితే, మృతపశు విసర్జనకు (వేస్ట్ మేనేజ్మెంట్) వారికి ఒక సేవక వర్గం అవసరమయింది. అలా అది- ‘మాదిగ’ కులం అయింది.
కులం పేరులో గౌరవం అన్నప్పుడు, కోస్తాంధ్రలో వీరి నివాస ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాల దస్తావేజుల్లో ‘డాక్యుమెంట్ రైటర్లు’ వీరి పేర్లు ఉదా: వెంకయ్య అయితే వెంకడు అని, కోటయ్య అయితే కోటడు; కులం హరిజనులు అని రాసేవారు. అదే ఆధిపత్యకులం అయితే వృత్తి: ‘వ్యవసాయం’ అని రాసి, కులం వద్ద ఉదా: కమ్మ అయితే ‘కమ్మవారు’ అని రాసేవారు. అయితే ఇందులో మాదిగల గౌరవం తగ్గడం ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. క్షురకులు ఇప్పటికే తమను మంగలి అని పిలవొద్దని ‘నాయీ బ్రాహ్మణులు’ అని, కంసాలి వడ్రంగి పని చేసేవారు ‘విశ్వ బ్రాహ్మణులు’ అని, కుండలు చేసే కుమ్మర్లు ‘శాలివాహన’ అని మార్చుకున్నారు. కర్ణాటకలో జరిగే ‘మాదిగ’ పేరు మార్పు రేపు మనవద్ద కూడా జరిగితే, రెండు తరాలు మారాక పాత పేర్లు ఎటూ గతించిపోతాయి.