ఆంధ్రప్రదేశ్‌ అధికారుల్లో అలజడి
x

ఆంధ్రప్రదేశ్‌ అధికారుల్లో అలజడి

అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలుడటం, ఊహించిన దాని కంటే బంబర్‌ మెజారిటీ బాబుకు రావడం కొంత మంది అధికారుల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.


ఎన్నికల ఫలితాల అనంతరం ఐపీఎస్, ఐఏఎస్, సెంట్రల్‌ సర్వీసు అధికారుల్లో గుబులు మొదలైంది. గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన కొంత మంది అధికారులు తాజా ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో మూటా.. ముల్లె సర్థుకునే పనిలో పడ్డారు. వీలైతే తమను తమ సొంత శాఖలకు పంపించాలని, లేదంటే సెలవులుపై వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రదక్షిణలు చేస్తున్నారు.

జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక వెలుగు వెలిగిన డాక్టర్‌ జవహర్‌రెడ్డి ఇటీవల సెలవులపై వెళ్లారు. తొలుత ఆయనకు కూడా సెలవు ఇవ్వకూడదని భావించిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం, తర్వాత జాలి చూపించింది. కొంత మంది పెద్దలే జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఊపరి పీల్చుకున్న జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు.
ఇదే బాటలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్‌ఎస్‌ రావత్‌ కూడా సెలవు మంజూరు కావడంతో ఎగిరి గంతేసిన రావత్‌ సెలవుపై వెళ్లారు. రావత్‌ ఎప్పటి నుంచో తెలంగాణకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఆ మేరకు గత ఏడాది క్రితం దరఖాస్తులు కూడా చేసుకున్నారు. కానీ నాటి పాలకులు పట్టించుకోలేదు. ఇదే అంశం ఇటీవల తెరపైకి తెచ్చారు రావత్‌. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కౌంటింగ్‌కు ముందు తనను తెలంగాణకు పంపాలని సీఎస్‌ను మరో సారి కలిసి రిక్వెస్ట్‌ చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందు వల్ల అది సాధ్యం కాలేదు. ఈ లోగా ఫలితాలు రావడం, అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ కూటమికి పట్టం గట్టటం జరిగి పోయాయి. తెలంగాణకు వెళ్లడం అటుంచితే రావత్‌కు మాత్రం సెలవు దొరకడం విశేషం.
ఇదే వరుసలో మరి కొంత మంది అధికారులు ఉన్నారు. ఇదే ఆర్థిక శాఖలో కీ రోల్‌ పోషించిన సత్యనారాయణ కూడా సెలవు కానీ, డిప్యూటేషన్‌ రద్దు చేసి తనను సొంత రైల్వే శాఖకు పంపాలని కోరుతున్నారు. అయితే ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది కాంట్రాక్టర్లు ఈయనపై కేసు నమోదు చేయాలని కూడా అధికారులను కలిసినట్లు తెలిసింది.
గనుల శాఖ ఎండీగా ఉన్న వీజీ వెంకటరెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నారు. తన డిప్యూటేషన్‌ను రద్దు చేసి తనను రిలీవ్‌ చేయలని ఇది వరకే సీఎస్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్‌ చిలకల రాజేశ్వరరెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నారు. తమను రిలీవ్‌ చేయాలని ఇది వరకు సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందు వల్ల వీరికి అనుకూలంగా ఎలాంటి చర్యలు చేపట్టేందుకు అవకాశం లేMýంండా పోయింది. ఈ లోగా కూటమి ప్రభుత్వం తెరపైకి రావడం, ఎన్నికల కోడ్‌ రద్దు కావడం చకచక జరిగి పోవడంతో దరఖాస్తులకు ఫుల్‌ స్టాప్‌ పడింది.
ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు తీరనున్న ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారులకు ఎలాంటి సెలవులు ఇవ్వకూడదని నిర్ణయించింది. ప్రత్యేకించి డిప్యూటేషన్‌పై ఉన్న అధికారుల విషయంలో వారిని బరిలీ చేయడం కానీ, సెలవులు ఇవ్వడం కానీ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో పిడుగు పడ్డటై్టంది. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏమి జరుగుతుందో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని వణికి పోతున్నట్లు అధికార వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
సీనియర్‌ ఐపీఎస్‌ అదికారుల్లో కూడా ఇలాంటి భయాందోళనలే వెంటాడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పని చేసిన ఎస్పీ స్థాయి అధికారులు నుంచి డీఐజీ, ఐజీ, డీజీ స్థాయి అధికారుల వరకు ఇదే వరుసలో ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ప్రభుత్వానికి వత్తాసుగాను, ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా పని చేశారనే ఆరోపణలు వీరిపైన ఉన్నాయి. ఈ జాబితా కూడా పెద్దదిగా ఉందనే టాక్‌ నడుస్తోంది. ఇలాంటి వారిలో కొంత మందిని ఎన్నికల సమయంలో బదిలీలు చేపట్టారు. మరో వైపు సీనీయర్‌ ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కొల్లు రఘురామిరెడ్డిలు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా అప్పాయింట్‌మెంట్‌ లేదని వెనక్కు పంపేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్‌ సర్వీసెస్‌ అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రతిపక్షాల పట్ల అమానుషంగా వ్యవహరించిన అధికారుల పట్ల కఠినంగానే చర్యలు ఉంటాయనే టాక్‌ అధికార వర్గాల్లో సాగుతోంది.
Read More
Next Story