
ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారే ప్రమాదం ఉంది
రాయలసీమ సాగునీటి సాధని సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి మండిపడ్డారు.
2023 సార్వత్రిక ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికై బిజెపి ఆధ్వర్యంలోని కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ విరుద్దమైన క్యాబినెట్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాల సాగునీటి హక్కులకు షరాఘాతమైనప్పటికి, అప్పుడు అధికారంలో వున్న వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కు జరిగే తీవ్ర నష్టాన్ని పట్టించుకోకుండా ఉదాసీనంగానే వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాయని రాయలసీమ సాగునీటి సాధని సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి మండిపడ్డారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం కెసి కెనాల్ నీటి వాటాపై వినిపిస్తోన్న వాదనలపై బొజ్జా స్పందిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. శనివారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ..
ప్రపంచ వారసత్వ సాగునీటి సంపదగా గుర్తింపు పొందిన అత్యంత పురాతనమైన కేసి కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 39.9 టి ఎం సి ల నీటి వాటాను 18.51 టి ఎం సి లకు తగ్గించి, ఆదా అయిన నీటిని తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ముందు వాదనలో వినిపిస్తోందనీ ఇది కేవలం కేసీ కెనాల్ నీటి హక్కులకు తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే కాదనీ ఇలాంటి వాదనలనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాజెక్టుల మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ వలన ఇలాంటి అసంబద్ధమైన వాదనలను తెలంగాణ ప్రభుత్వం చేయడానికి అవకాశమిచ్చిందనీ.. కొత్త టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి వాటాలను కేటాయిస్తే రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కేవలం ‘‘స్మారక చిహ్నాలు’’గా మిగిలడమే గాక ఎడారి ప్రాంతంగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో రాజ్యాంగబద్దంగా ఏర్పడిన అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసారనీ..అదే బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై ఆధారపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అన్నింటికీ నీటి కేటాయింపులు కల్పించిందనీ... ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నీటిని ఆ ప్రాజెక్టులకే కొనసాగించే విధంగా బ్రిజేష్ కుమార్ కు ‘టరమ్స్ ఆఫ్ రెఫరెన్స్‘ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా పొందుపరిచిన విషయాన్ని బొజ్జా గుర్తు చేసారు.
ఈ విధంగా హక్కులు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల నీటి హక్కులను తగ్గించి, ఆ విధంగా ఆదా అయిన నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించుకునే అవకాశం కల్పించే లాగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ‘‘కొత్త టరమ్స్ ఆఫ్ రెఫెరెన్సు’’ను ఇస్తూ కేంద్రంలో ఉన్న బిజెపి ఆధ్వర్యంలోనీ ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు అక్టోబర్ 4, 2023 న క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం తలపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవాలని పాలకుల దృష్టికి తీసుకొచ్చినా నేటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
రాష్ట్ర విభజన అంశాలను త్వరగా పూర్తిచేసి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఏర్పాటు చేయవలసిన బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జుట్లకు ముడివేసి లాభం పొందాలని ఎదురుచూస్తున్నదనీ ఇలాంటి దిగజారుడు బిజెపి పార్టీ చర్యలను ఆంధ్రప్రదేశ్ సమాజం ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తమ అధినాయకులను గుడ్డిగా నమ్ముతూ జరుగుతున్న పరిణామాల పట్ల నిర్లిప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం మేల్కొనాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మన నీటి హక్కులపై ప్రజా ప్రతినిధుల ఇప్పటికైనా దృష్టి పెట్టిలాగా సమాజం ఒత్తిడి పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించి కొత్త టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను రద్దు చెయ్యాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడానికి ప్రజాప్రతినిధుల బాధ్యత చేపట్టాలని బొజ్జా విజ్ఞప్తి చేశారు.
Next Story