Andhrapradesh | ఏపీలో హ్యాపీ, పర్యాటక రంగాభివృద్ధికి చర్యలు
x

Andhrapradesh | ఏపీలో హ్యాపీ, పర్యాటక రంగాభివృద్ధికి చర్యలు

తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు.టూరిజం ద్వారా ఆదాయం పెంచడంపాటు ప్రజలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎ రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు లు ఒకే రోజు పర్యాటక రంగాభివృద్ధిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం(Promotion of tourism sector) ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP and Telangana)పర్యాటక రంగం పురోగమించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భ‌ద్రాచ‌లం, స‌లేశ్వ‌రం, రామ‌ప్ప వంటి ఆల‌యాలు, మల్లెల తీర్ధం,కుంటాల, బొగ‌త జ‌ల‌పాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆల‌యాలు,గండికోట, సూర్యలంక, లంబసింగి, తిరుపతి, అరకులోయ, అమరావతి, విశాఖపట్టణం, నెల్లూరు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.


టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి
రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ...హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. 2025-26 మధ్య 20 శాతం వృద్ధిరేటును పర్యాటక శాఖ సాధించాలన్నారు.అమరావతి సచివాలయంలో పర్యాటకశాఖపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. టూరిజం ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, హోటల్ రూముల నిర్మాణం, పెట్టుబడులు, ల్యాండ్ లీజ్ పాలసీ, హోంస్టేలు వంటి వాటిపై సమీక్షలో చర్చించారు.

రూ.45 కోట్లతో 11 టూరిజం రిసార్టులు
కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.1,217 కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, రూ.45 కోట్లతో 11 టూరిజం రిసార్టులు, హోటళ్లు పునరుద్ధరించామని అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకంలో భాగంగా అన్నవరం దేవాలయం, ఎస్ఎఎస్‌సీఐ కింద గండికోట, అఖండ గోదావరి, స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరకు, లంబసింగి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలెప్మెంట్ కింద అహోబిలం, నాగార్జున సాగర్ ఎంపికైనట్లు అధికారులు వివరించారు.

పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈవెంట్స్
పర్యాటకులను ఆకట్టుకునేందుకు 2025-26 ఏడాదికి సంబంధించి టూరిజం ఈవెంట్స్ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులోభాగంగా మొత్తం 37 టూరిజం ఈవెంట్స్‌లో 2 కీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, 12 మెగా ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు.విశాఖ, అమరావతి, తిరుపతి శిల్పారామాల్లో ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.



గండికోటను బ్రాండింగ్ చేయండి

జల, గిరి, వన దుర్గంగా పేరుగాంచిన గండికోటలాంటి ప్రాంతం దేశంలో ఎక్కడా లేదని, దీన్ని మరింత బ్రాండ్ చేయాలని సీఎం సూచించారు. గండికోటతో పాటు కడప దర్గా, ఒంటిమిట్ట రామాలయం, సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. శ్రీశైలాన్ని శక్తి పీఠంగా మార్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం డ్యాం, అటవీ, మల్లన్న దేవాలయం అన్నీ ఒకేచోట పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడానికి శ్రీశైలానికి కలిసొచ్చిన అంశమని, ఎకో టూరిజానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రకృతిసేద్య ఆహారాన్ని ప్రమోట్ చేయండి
రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ సంప్రదాయక ఇళ్లు ఉన్నాయని, వాటిని ఆధునీకరణ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. టూరిజం హోటళ్లలో అందించే ఆహారం విషయంలోనూ మార్పులు తీసుకురావాలన్నారు. ప్రకృతిసేద్య ఆహారాన్ని ప్రమోట్ చేయాలని సూచించారు. తద్వారా పర్యాటకుల ఆరోగ్యం బాగుండటంతో పాటు సాగురైతులకు కూడా మేలు చేకూరుతుందని సీఎం అన్నారు.

విశాఖ బీచ్‌ మరింత అభివృద్ధి
కోనసీమలో హౌస్ బోట్స్ ప్రవేశపెట్టడంతో పాటు విశాఖ బీచ్‌ను మరింత అభివృద్ధి చేయాలన్నారు. గండికోట, సూర్యలంక, లంబసింగిని టెంట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రోప్‌వేల నిర్మాణానికి కూడా అవకాశాన్ని బట్టి పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆదాయ‌,ఉపాధి వ‌న‌రుగా ప‌ర్యాట‌కం

తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం స‌మ‌కూర్చ‌డ‌మే కాకుండా ఎక్క‌డిక‌క్క‌డ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా ప‌ర్యాట‌క శాఖ ఉండాలని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో కోరారు.ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా వ‌న‌రులు మ‌న‌కు ఎన్నో ఉన్నా, గ‌తంలో ప్ర‌చారంపైన శ్రద్ధ చూప‌లేదు.తెలంగాణ ఘ‌న చ‌రిత్ర‌ను వ‌ర్త‌మానానికి అనుసంధానిస్తూ.. భ‌విష్య‌త్‌కు బాట‌లు వేసేలా ప‌ర్యాట‌క శాఖ‌ను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.ప‌ర్యాట‌క శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు

సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాగార్జున సాగ‌ర్‌ బ్యాక్ వాట‌ర్‌లో బోట్ హౌస్‌ అందుబాటులో ఉంచాల‌ని, డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాల‌ని సీఎం సూచించారు.భ‌ద్రాచ‌లం, స‌లేశ్వ‌రం, రామ‌ప్ప వంటి ఆల‌యాలు, మల్లెల తీర్ధం, బొగ‌త జ‌ల‌పాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆల‌యాల్లో వ‌స‌తులు మెరుగుప‌ర్చ‌డంతో పాటు స‌రైన ప్ర‌చారం క‌ల్పించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు.

భువ‌న‌గిరి కోట రోప్ వే ప‌నులు

భువ‌న‌గిరి కోట రోప్ వే ప‌నుల‌పైనా సీఎం ఆరా తీశారు. భూ సేక‌ర‌ణ‌లో కొంత జాప్యం జ‌రిగింద‌ని, ఇప్పుడు భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలుస్తామ‌ని అధికారుల‌కు సీఎంకు తెలిపారు. సాధ్య‌మైనంత త్వ‌రగా భువ‌న‌గిరి కోట రోప్ వే ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డంతో పాటు కోట‌పై ఉన్న చారిత్రక క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం

ప‌ర్యాట‌క శాఖ పాల‌సీకి తుది రూపు ఇచ్చే స‌మ‌యంలో అట‌వీ, ఐటీ, విద్యుత్‌, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడ‌ల శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, ఒక శాఖ విధానాలు మ‌రో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు కోరారు. అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌కు ప‌ర్యాట‌క శాఖ‌లో ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం సూచించారు. వైద్య అవ‌స‌రాల‌కు విదేశాల నుంచి వ‌చ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప‌ర్యాట‌కుల్లా వ‌చ్చిపోయేలా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ప‌ర్యాట‌క శాఖ‌కు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.



Read More
Next Story