ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు: రికార్డు స్థాయిలో బదిలీలు
x

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు: రికార్డు స్థాయిలో బదిలీలు

డీజీపీ నుంచి ఎస్‌ఐ వరకు రికార్డు స్థాయిలో కొరడా ఝుళిపించిన ఎన్నికల సంఘం.


మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో పాటు ఇతర సబార్డినేట్‌ పోలీసు అధికారులతో కలిపి దాదాపు 45 మంది అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎన్నికలకు ముందు అంటే మే 13 కంటే ముందు 29 అధికారులను బదిలీ చేయగా ఎన్నికల అనంతర మరో 16 మందిపై వేటు వేసింది. రాష్ట్ర పోలీసు బాస్‌ నుంచి ఎస్‌ఐ స్థాయి అధికారుల వరకు ఈ బదిలీల వేటుకు గురైన వారు ఉండటం గమనార్హం. అంతేకాదు ఎన్నికల నిర్వహణ సరిగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాతో పాటు ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ కుమార్‌ విశ్వజిత్‌పైన కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తిం చేసింది.

ఎన్నికలకు ముందు
ఎన్నికలకు ముందు నుంచే ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల కమీషన్‌ దృష్టి సారించింది. భారీగానే బదిలీలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే కారణంతో వేటు వేయడానికి రంగం సిద్దం చేసింది. ఏప్రిల్‌ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 ఐపీఎస్, 3 ఐఏఎస్‌ అధికారులపై బదిలీ వేటు వేసింది. వీరందరూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలుగా ఉన్నవాళ్లే కావడం గమనార్హం. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ పి జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ కే తిరుమలేశ్వర్‌తో పాటు గుంటూరు రేంజ్‌ ఐజీగా ఉన్న జి పాలరాజులపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటుగా కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి రాజాబాబు, అనంతపురం కలెక్టర్‌గా ఉన్న ఎం గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్‌గా ఉన్న లక్ష్మిషాలను కూడా బదిలీ చేసింది. అదే ర్యాంకు కలిగిన వేరే అధికారులను నియమించాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అప్పజెప్పొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇంటెలిజెన్స్‌ చీఫ్, విజయవాడ సీపీ
అదే ఏప్రిల్‌ మాసంలో మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం బదిలి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న కాంతి రాణా టాటాలను బదిలీ చేసింది. వీరిలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు డీజీ క్యాడర్‌ అధికారి కాగా, కాంతి రాణాటాటా ఐజీ క్యాడర్‌లో ఉన్నారు. వీరు అధికార పార్టీకి అడుగులు మడుగులొత్తుతున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి. దీంతో పాటుగా విజయవాడ సీఎం జగన్‌పై రాయి ఘటనలో దర్యాప్తు సరిగా లేదని టీడీపీ ఫిర్యాదులు చేసింది. దీనిపైన కేంద్ర ఎన్నికల కమిషన్‌ సీపీ కాంతిరాణా టాటాను వివరణ కోరింది. దీంతో పాటుగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీపీ కాంతి రాణా టాటాలు అధికార పార్టీకి తొత్తుగా ఉంటూ ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో వీరిపైన బదిలీ వేటు వేసింది. వీరికి ఎన్నికలకు సంబంధం లేని విధులను అప్పగించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది.
డీజీపీ పైనా వేటు
ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ అంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా బదిలీ జరిగిన మరి కొన్ని రోజులకు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీపై కూడా బదిలీ వేటు వేసింది. మే మొదటి వారంలో ఏపీ పోలీస్‌ బాస్‌ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈయనకు కూడా ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశించింది. అధికార పార్టీకి డీజీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ, ఈయన డీజీపీగా ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉండదని టీడీపీ, బీజేపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో డీజీపీపైన వేటు తప్ప లేదు.
ఎన్నికల అనంతరం జరిగిన హింస నేపధ్యంలో
ఎన్నికల తర్వాత కూడా మరి కొంత మంది కలెక్టర్లు, జిల్లా ఎస్పీలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కొరడా ఝుళిపించింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం ఆయా జిల్లాల్లో చోటు చేసుకున్న హింసను అరికట్టడంలో వైఫల్యం చెందారని వీరిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌ శివశంకర్‌ను బదిలీ చేసింది. ఈయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ను బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఆ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను మాత్రం సస్పెండ్‌ చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌ను కూడా బదిలీ చేసింది. ఈయనపైన కూడా శాఖా పరమైన చర్యలకు ఆదేశించింది. అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ను కూడా బదిలీ చేసింది. ఈయనపై కూడా శాఖాపరమైన విచారణ జరపాలని ఆదేశించింది. వీరితో పాటు తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలకు సంబంధించి 12 మంది సబార్డినేట్‌ పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెండ్‌ అయిన వారిలో తిరుపతి డీఎస్పీ సురేందర్‌ రెడ్డి, ఎస్బీ సీఐ రాజశేఖర్, ఎస్వీడీఎస్పీ భాస్కర్‌ రెడ్డి, అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి, నరసరావుపేట డీఎస్పీ బిఎస్‌ఎన్‌ వర్మ, గురజాల డీఎస్పీ పల్లపురాజు, ఎస్బీ సీఐ ప్రభాకర్‌ రావు, ఎస్బీ సీఐ బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్సై రామాంజనేయులు, నాగార్జునసాగర్‌ ఎస్‌ఐ కొండారెడ్డి, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి సీఐ మురళీకష్ణ ఉన్నారు. వీరిపై శాఖా పరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది.
Read More
Next Story