ఆంధ్రలో ఈరోజు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా..
x

ఆంధ్రలో ఈరోజు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా..

ఆంధ్రలో ఎన్నికల ప్రచారంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా జోరందుకుంది. ఈరోజు ఈ ప్రచారాలు ఎలా సాగనున్నాయంటే..


ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు రోజురోజుకు మరింత ఊపందుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు నామినేషన్ల ప్రక్రియను చూసుకుంటూనే ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నాయి. ఆయా పార్టీల అధినేతలు కూడా నామినేషన్ల ప్రక్రియపై ప్రచారం చేస్తూనే ఒక కన్నేసి ఉంచారు. ఈ క్రమంలో ఈరోజు ఎవరు ఎక్కడ ప్రచారం చేయనున్నారంటే..

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈరోజు గోడిచర్ల ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నాపాలెం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు సీఎం జగన్.

ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈరోజు తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌కు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా కడప చేరుకుంటారు. ఉదయం 9:15 గంటలకు ఐటీఐ సర్కిల్ నుంచి ర్యాలీ ప్రారంభిస్తారు. 11 గంటలకు ఆ ర్యాలీ డీసీసీ ఆఫీస్ దగ్గర ముగుస్తుంది. 11:10 గంటలకు షర్మిల నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ పూర్తియిన తర్వాత ఉదయం 11:45 గంటలకు ఆమె భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 12:30 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు పిఠాపురం నుంచి తన రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రచారం 22 రోజుల పాటు కొనసాగనుంది. ఈ రోజు ఆయన పిఠాపురంలోనే ప్రచారం కొనసాగించనున్నారు. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థికి పూర్తి మద్దతు తెలపనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ప్రజాగళం’ యాత్ర ఈరోజు తిరుపతి, గూడూరు నియోజకవర్గాల్లో సాగనుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం అనంతపురంలోని కనెకల్ నుంచి యాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి కనెకల్ క్రాస్‌రోడ్, వారగలి క్రాస్ రోడ్ మీదుగా గూడురులోని సీఆర్ రెడ్డి కళ్యాణ మండపం చేరుకుంటారు. అక్కడే ఓ సభ నిర్వహించనున్నారు. అనంతరం భోజన విరామం తీసుకోనున్నారు. విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన మర్రిపల్లి సెంటర్ మీదుగా 2:40 గంటలకు పొదలకూరు గేట్ సెంటర్ చేరుకుంటారు. అక్కడ రెండో సభ నిర్వహించనున్నారు. మీటింగ్ అనంతరం సాయంత్రం 4:40 నిమిషాలకు గేట్ సెంటర్ నుంచి పొదలకూరు అగ్రహారం, క్లాక్ టవర్ చేరుకుని అక్కడ సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతి విమానాశ్రయం చేరుకుని విజయవాడకు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Read More
Next Story