అత్యుత్తమ క్రీడా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంపు.
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ క్రీడా కేంద్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు అన్నారు. నూతన స్పోర్ట్స్ పాలసీపై ఆయన సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబులిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు. అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్ట్స్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటి వరకు ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
శాప్‌లో గ్రేడ్ –3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా దాని కంటే ఎక్కువ ప్రోత్సాహలు ప్రతిపాదించారు. పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం అన్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.75 లక్షలు ఇస్తుండగా, ఇక నుంచి రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ. 30 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అదే విధంగా ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు, రజత పతకం సాధించిన వారికి రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 కోటి, ఏషియన్స్ గేమ్స్‌లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. వరల్డ్ ఛాంపియన్ ఫిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పథకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.
ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారికి గ్రూప్–1 ఉద్యోగులుగా నియమించనున్నారు. అమరావతిని స్పోర్ట్స్ సిటీగా రూపొందించడంతో పాటు తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. కడప, విజయవాడ, విజయనగరం క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం క్రీడా పాఠశాల గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఏపీకి వరంగా సముద్ర తీరం, కొండలు, అడవులు ఉన్నాయని, మౌంటెయిన్ బైకింగ్, వాటర్ స్పోర్ట్స్ నేచర్ ఫోటో గ్రఫీ, ట్రెక్కింగ్ వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని, అన్ని ఆటలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పీపీపీ విధానంతోను, దాతలు, సంస్థల సహాయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.