
నేషనల్ హైవే మీద డ్రైవర్ల నిద్ర మత్తుకు పోలీసుల చికిత్స
అనకాపల్లి NH 16 మీద అర్థరాత్రి తర్వాత ప్రమాదాలు నివారించేందుకు జిల్లా ఎస్ పి 'నీరు- తేనీరు' వినూత్న ప్రయోగం
రాత్రి వేళ హైవేలో రోడ్డు ప్రమాదాల నివారణకు అనకాపల్లి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అర్థరాత్రి దాటాక నిద్ర మత్తులోకి జారకుండా వాహన డ్రైవర్లను ఆపి నీళ్లతో ముఖం కడిగించి, టీలు తాగించి పంపుతున్నారు.

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి వేళ వాహనాలను నడిపే డ్రైవర్లు అలసటతో నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటె ండెంట్ తుహిన్ సిన్హా ఇటీవల ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే?
ప్రాణాలను తోడేస్తున్న నిద్ర మత్తు..
అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారి-16 లంకెలపాలెం నుంచి పాయకరావుపేట వరకు 80 కిలోమీటర్ల మేర ఉంది. ఈ చెన్నై-కోల్కతా నేషనల్ హైవే మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ జిల్లాలో హైవేకి ఇరువైపులా గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి, దీంతో నిద్ర మత్తులో వాహనం ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది. విశాఖ పరిసరాల్లోని స్టీల్స్టాంట్తో పాటు పలు పరిశ్రమలు, ఫార్మా కంపెనీల నుంచి విజయవాడ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. అటు నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల మీదుగా వాహనాలు విశాఖ వైపు వస్తుంటాయి. ఇవి తరచూ అర్థరాత్రి దాటాక ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటిలో ఎక్కువగా డ్రైవర్ల నిద్ర మత్తు వల్లే జరుగుతున్నట్టు గుర్తించారు.

డ్రైవర్లకు ముఖం కడిగించి.. టీ ఇచ్చి..
అర్థరాత్రి తర్వాత (తెల్లవారు జామున 2-4 గంటల మధ్య) అలసిపోయిన డ్రైవర్లు వాహనాలు నడుపుతున్న సమయంలో కునికిపాట్లు పడుతుంటారు. ఆ రెప్ప పాటు కాలంలోనే వాహనాలు అదుపు తప్పి ఘోరాలు జరిగి పోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల జిల్లా పరిధిలోని హైవేపై డ్రైవర్లు 'స్టాప్ అండ్ ఫేస్ వాష్' పేరిట స్పెషల్ డ్రైవ్క అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా శ్రీకారం చుట్టారు.

అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా
ఇందులో భాగంగా జాతీయ రహదారిలో 80 కిలోమీటర్ల మేర (లంకెలపాలెం నుంచి కాకినాడ జిల్లా సరిహద్దు తుని వరకు) తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే తొమ్మిది చోట్ల ఫేస్ వాష్ పాయింట్లను ఎంపిక చేశారు. వీటిని 7-14 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక మొబైల్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్ లో ఒక డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్ లేదా ఏఎస్ఐ ఉంటారు. వీరికి ఫస్ట్ ఎయిడ్తో పాటు ఫేస్ వాష్ప కూడా శిక్షణ ఇచ్చారు. సంబంధిత పాయింట్లలో అర్థరాత్రి 12 నుంచి మర్నాడు ఉదయం వరకు ఇరువైపులా వెళ్లే లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు, జీపులు తదితర వాహనాలను ఆపి నీళ్లిచ్చి డ్రైవర్లకు ముఖం కడిగిస్తున్నారు. ప్రస్తుతం లంకెలపాలెం, తాళ్లపాలెం, కొక్కిరాపల్లి పాయింట్లలో వీరికి టీ కూడా ఇస్తున్నారు. త్వరలో పాయకరావుపేట, కెఎన్నార్పేటల్లోనూ టీ అందించనున్నారు. ఇలా ముఖం కడిగించి టీ తాగించడం ద్వారా నిద్ర మత్తు వదిలి ప్రమాదాలను నియంత్రించే వీలుంటుంది. ప్రాణంకంటే మించినది ఏమీ లేదని, సురక్షితంగా వాహనం నడిపితే మీపై ఆధారపడ్డ భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారని డ్రైవర్లకు పోలీసులు వివరిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం..
అనకాపల్లి జిల్లాలో హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో మరణాలూ సంభవిస్తున్నాయి. సంబంధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఇటీవల వాహనాల డ్రైవర్లకు 'స్టాప్ అండ్ ఫేస్ వాష్' కార్యక్రమం చేపట్టాం. మా మొబైల్ టీమ్లు అర్థరాత్రి నుంచి వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లిచ్చి ముఖం కడిగిస్తున్నారు. వారికి టీలు కూడా అందిస్తున్నారు. దీంతో వారికి నిద్ర మత్తు వదిలి వాహన ప్రమాదాలు జరగకుండా నివారించ గలుగుతున్నాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం' అని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

డ్రైవర్లూ సహకరిస్తున్నారు..
'స్టాప్ అండ్ ఫేస్ వాష్ కార్యక్రమానికి డ్రైవర్లు కూడా సహకరిస్తున్నారు. వాహనం నడిపేటప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే వాహనాన్ని అపేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాతే వెళ్లాలని డ్రైవర్లకు సూచిస్తున్నాం' అని హైవే మొబైల్ టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఎస్.రమేష్ తెలిపారు. 'సరకును టైమ్కి చేరవేయడం కోసం నిద్రను లెక్క చేయకుండా, విశ్రాంతి తీసుకోకుండా లారీని నడుపుతాం. అది రిస్క్ అని తెలిసినా అలాగే నడిపేస్తాం. అనకాపల్లి పోలీసులు అర్థరాత్రి వేళ హైవేపై వాహనాలను ఆపి నీళ్లిచ్చి ముఖం కడిగిస్తున్నారు. ముఖం కడుక్కుని టీ తాగాక నిద్ర మత్తు వదుల్తోంది' అని గొల్లపల్లి నాగేశ్వరరావు అనే లారీ డ్రైవర్ చెప్పాడు.
నాలుగేళ్లలో ప్రమాదాలు ఇలా..
అనకాపల్లి జిల్లాలో గడచిన నాలుగేళ్లలో హైవేపై 432 రోడ్డు ప్రమాదాల్లో 453 మంది మరణించారు. 2022 సంవత్సరంలో 141 ప్రమాదాల్లో 150 మంది, 2023లో 130 ప్రమాదాల్లో 135 మంది, 2024లో 106 ప్రమాదాల్లో 110 మంది, 2025లో ఇప్పటివరకు 55 ప్రమాదాల్లో 58 మంది మృత్యువాత పడ్డారు. ఈ లెక్కన హైవేపై నెలకు సగటున 12 రోడ్డు ప్రమాదాలు, 13 మరణాలు సంభవిస్తున్నాయి. స్టాప్ అండ్ ఫేస్ వాష్ కార్యక్రమం మొదలు పెట్టిన ఈ నెల రోజుల్లో హైవేపై 8 రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మాత్రమే చనిపోయారు. దీన్నిబట్టి ఈ ఫేస్ వాష్ కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

మరిన్ని అదనపు చర్యలు..
మరోవైపు అనకాపల్లి జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్లు, మరణాలను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం అదనపు చర్యలు తీసుకుంటోంది. గత నాలుగేళ్లలో తాగి వాహనాలు నడిపే వారిపై 11,241 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో తాగి వాహనం నడిపేందుకు సిద్ధమవుతున్న 48,173 కేసులను నమోదు చేశారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, ర్యాష్, సెల్ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై వెరసి 4,64,494 కేసులు పెట్టారు. లంకెలపాలెం నుంచి పాయకరావుపేట వరకు హైవేపై 219 సీసీ కెమెరాలను, 216 స్టాపర్లను, 550 బ్లింకింగ్ లైట్లను ఏర్పాటు చేశారు. 2022 వరకు ఈ జిల్లాలో 39 బ్లాక్ స్పాట్లుండగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతుండడంతో ఇప్పుడవి 24కి పరిమితం చేయగలిగారు.