తీరం దాటిన వాయుగుండం
x

తీరం దాటిన వాయుగుండం

గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను గడగడలాండించిని వాయుగుండం తీరం దాటింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. గత మూడు రోజులుగా భారీ వర్షాలతో ముంచెత్తిన ఈ వాయుగుండం గురువారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో తీరం దాటింది. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి–నెల్లూరు మధ్య తీరం దాటింది. దీంతో క్రమంగా బలహీనపడనుంది. రాగల 12 గంటల్లో పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడనుంది. అయినప్పటికీ గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాలతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్థంభించి పోయింది. పలు కాలనీలు వర్షపు ప్రభావానికి గురయ్యాయి. వేలాది హెక్టార్లలో పంటలు నేలకొరిగాయి. నెల్లూరు జిల్లా చేజర్ల, అనంతసాగరం, విడవలూరు, ఎస్‌ఆర్‌పురం తదితర ప్రాంతాల్లో దాదాపు 250 హెక్టార్లలో వేసిన వరి పంట నేలవాలింది. అన్నమయ్య జిల్లాలో వర్షపు నీటి నిల్వల వల్ల టమాట పంటకు వేరుకుళ్లు తెలుగులు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనలు చెందుతున్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 2వేలకుపైగా హెక్టార్లలో వరి, మరో 300 హెక్టార్లలో మినుముకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. తిరుపతి జిల్లాలో దాదాపు 3వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లాలో పొగాకు పంటకు బాగా నష్టం జరిగింది.
Read More
Next Story