విశాఖ విమానాల్లో ఎగురుతున్న పాములు, బల్లులు! బరితెగించిన స్మగ్లర్లు!!
x

విశాఖ విమానాల్లో ఎగురుతున్న పాములు, బల్లులు! బరితెగించిన స్మగ్లర్లు!!

ఇన్నాళ్లూ చెన్నై, బెంగళూరు, శంషాబాద్ ఎయిర్‌పోర్టులకే పరిమితమైన బల్లులు, పాముల స్మగ్లింగ్ ఇప్పుడు విశాఖపట్నానికీ పాకింది.


విమానాల్లో పాములు, బల్లులు విహరిస్తున్నాయి.. అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య ఇవి నిశ్చింతగా ప్రయాణిస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉందా? ఔను.. మీరు చదువుతున్నది నిజంగా నిజం. ఇవే కాదు.. అంతరించి పోతున్న అత్యంత అరుదైన పాము జాతికి చెందిన సరీసృపాలు, కొండచిలువలు, బుల్లి కొండముచ్చులు, కంగారూలు, విభిన్న తాబేళ్లు, ముక్కు సూది పందికొక్కులు వంటివి కూడా విమానాల్లో విలాసంగా ప్రయాణిస్తున్నాయి మరి! ఇన్నాళ్లూ దక్షిణాది రాష్ట్రాల్లోని బెంగళూరు, చెన్నై, శంషాబాద్ ఎయిర్‌పోర్టులకే పరిమితమైన వీటి అక్రమ రవాణా ఇప్పుడు అలాంటి మచ్చ లేని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికీ విస్తరించింది!


కాసులు కురిపించే మాదక ద్రవ్యాలు, అంతరించి పోతున్న వన్య ప్రాణుల అక్రమ రవాణా వ్యవహారం కొత్తేమీ కాదు.. దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది. అయితే ఈ స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. అలా ఇప్పుడు విశాఖపట్నం ఇంటర్నేషనల్

ఎయిర్‌పోర్టును కూడా వీరు ఎంచుకున్నారు. తాజాగా ఈనెల 24న థాయ్లాండ్ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగులను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఎస్ఐ) అధికారులు తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఆరు ఈస్టర్న్ బ్లూ టంగ్డ్ లిజర్డ్స్ (నీలి రంగు నాలుక పాము ఆకారంలోని బల్లులు)ను గుర్తించారు. వీటిని చిన్న చిన్న బాక్సుల్లో ప్యాక్ చేసి తెచ్చారు. బల్లి జాతికి చెందిన ఇవి చూడటానికి చిన్నపాటి పాము రూపంలో ఉన్నాయి. వీటిని చూసిన డీఆర్ఐ అధికారులు విషపూరితమైన పాములుగా భ్రమించి విశాఖ నగరంలో పాములను పట్టడంలో దిట్టగా పేరొందిన రొక్కం కిరణ్ను పిలిపించారు. కిరణ్ వాటిని తెరిచి చూసి విష రహితమైనవిగా తేల్చారు. దీంతో వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో అధికారులను రప్పించారు. పరిశీలనలో వారు ఆస్ట్రేలియా అడవుల్లో ఉండే అంతరించిపోతున్న అత్యంత అరుదైన ఈస్టర్న్ బ్లూ టంగ్డ్ లిజర్డ్స్ నిర్ధారించారు. అనంతరం నిబంధనల ప్రకారం.. సంబంధిత అధికారులు లిజర్డ్స్ను బ్యాంకాక్ విమానంలో తిరిగి థాయ్లాండ్కు పంపించి వేశారు. పట్టుబడిన ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తరహా అంతరించిపోతున్న ప్రాణులు పట్టుబడడం ఇదే తొలిసారని ఈ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎస్. రాజారెడ్డి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.
అదే రోజు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాములు..
ఇక అదే రోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు రెండు పాములతో పట్టుబడ్డారు. వీరు కూడా వారి బ్యాగుల్లో ఆ పాములను ఉంచి గట్టు చప్పుడు కాకుండా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వీరు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న గోధుమ వర్ణ విదేశీ పాములు అత్యంత విషపూరితమైనవని నిర్ధారించారు.
బెంగళూరు, చెన్నై ఎయిర్‌పోర్టుల్లోనూ..
స్మగ్లర్లు గత కొన్నేళ్లుగా తమ అక్రమ స్మగ్లింగ్ కార్యకలాపాలకు శంషాబాద్ పాటు బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్టులనూ ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబరులో చెన్నైలోని అన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ జాతులకు చెందిన అంతరించిపోతున్న 56 రకాల అరుదైన వన్య ప్రాణులను స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మహిళా ప్రయాణికుల మాదిరిగా ఈ స్మగ్లరు వీటిని మలేసియా నుంచి రవాణా చేస్తునట్టు గుర్తించారు.

వీరు అక్రమంగా రవాణా చేస్తున్న ఈ వన్య ప్రాణుల్లో 52 గ్రీన్ ఇగ్వానాలు, నాలుగు అతి చిన్న సియామాన్ గిబ్బన్లు (నల్లని మూతి, గోధుమ వర్ణం కలిగిన వానర జాతి) ఉన్నాయి. అలాగే ఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్టులో మలేసియా నుంచి తెస్తున్న 50 అరుదైన విదేశీ సరీసృపాలు, పొడవాటి ముక్కున్న పందికొక్కులు, కంగారూలను పట్టుకున్నారు.
ఉదాసీనతే ఊతమా?
థాయ్లాండ్, మలేసియా దేశాల్లో స్మగ్లింగ్ నిరోధక, నిబంధనలు మన దేశంలో ఉన్నంత కఠినంగా ఉండవని చెబుతారు. వివిధ దేశాలకు చెందిన స్మగ్లర్లు వీటినే ఆసరాగా చేసుకుని, అక్కడ ఎయిర్పోర్టు, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పో, చేతులు తడిపో ఆ దేశాల్లోని ఎయిర్‌పోర్టుల్లోకి ప్రయాణికుల్లా ప్రవేశిస్తారు. అక్కడ నుంచి బ్యాగుల్లో దుస్తులు, ఇతర సామగ్రి మాదిరిగా విలువైన, అరుదైన వన్య ప్రాణులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అలా అక్కడ బయల్దేరి మన దేశంలోని వివిధ ఎయిర్పోర్టులకు చేరుకుంటున్నారు. సాధారణంగా తనిఖీల్లో పురుషులతో పోలిస్తే మహిళా ప్రయాణికుల పట్ల ఒకింత సరళంగా ఉంటారు. అందువల్ల స్మగ్లింగ్ మహిళలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలా పట్టుబడుతున్న వారిలో అత్యధికులు మహిళలే ఉండడం ఇందుకు తార్కాణంగా చెబుతారు.
ఇక్కడ నుంచి ఎక్కడకు?
అంతరించి పోతున్న జీవులకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉంది. దీంతో స్మగ్లర్లు అడ్డదారుల్లో, వక్ర మార్గాల్లో వీటిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా విదేశాల నుంచి వాయు మార్గాల్లో తెచ్చి మన దేశంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ స్మగ్లర్లకు దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఏజెంట్లు/ దళారులు ఉన్నారు. వారికుండే రహస్య లింకులతో అందరి కళ్లుగప్పి నిర్దేశిత ప్రాంతాలకు రైళ్లు, బస్సు మార్గాల్లో చేరవేస్తున్నారు. ఈ తరహా స్మగ్లర్ల ముఠాలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాలు అడ్డాగా ఉన్నాయి. ఇలా వివిధ ఎయిర్‌పోర్టుల్లో పట్టుబడిన వాటి మూలాలు, ఎక్కడికి తరలించడానికి వీటిని తెచ్చారన్న దానిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అంతరించిపోతున్న వన్య ప్రాణుల పరిరక్షణ కోసం అపెండిక్స్-3 ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పీసీస్ అండ్ షెడ్యూల్ 4 ఆఫ్ ది వైల్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చట్టం అమలులో ఉంది.


Read More
Next Story