పిఠాపురం పర్యటలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు ఎంత కాలం వరకు ఉండాలనే దానిపైన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు తక్కువ కాకుండా ఎన్డీఏతో అలయన్స్ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..శక్తి పీఠంపై ఆనేసి చెబుతున్నట్లు ప్రకటించారు. నేను పని చేయడానికి వచ్చాను. నేను వళ్లు వంచి పని చేస్తాను. నా పని తీరు నచ్చితే వచ్చే ఎన్నికల్లో కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. నా పని తీరు నచ్చకుంటే వదిలేయండని అన్నారు. అంత నిక్కచ్చిగా ఉంటానన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకు కాబట్టే తగ్గి మాట్లాడతానన్నారు. గురువారం తిరుపతిలో కూడా అలాగే మాట్లాడానన్నారు. తిరుమల తిరుపతి తొక్కిసలాట దురదృష్టకరం. సంక్రాంతి సందర్భంగా ఇలా జరగడం బాధేసింది. ఈ తప్పు అందరి వల్ల జరిగింది. దీనికి అందరు బాధ్యతగా తీసుకోవాలి. దీనికి మంచి మనసు కావాలి. తప్పు జరిగింది కాబట్టి సనాతన ధర్మం పాటించే హిందువలందరినీ క్షమాపణలు కోరానని చెప్పారు.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి, టీటీడీపీ పాలక మండలి అంతా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను క్షమాపణలు కోరాలని ఆదేశించారు. క్షమాపణలు చెప్పి తీరాలి. వేరే దారి లేదన్నారు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. దానిని గుర్తు పెట్టుకోండి. అందువల్ల మీరు క్షమాపణలు చెప్పడం చాలా అవసరం. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీరు సారీ చెప్పడానికి ఏంటీ నామోషీ? బాధ్యత తీసుకోవాలన్నారు. మీ వల్ల తప్పు లేదంటే ఎలా? నేను మాత్రం దోషిగా నిలబడాలా? నేను క్షమాపణలు ఎందుకు చెప్పాలి అని ప్రశ్నించారు. అధికారం నాకు అలంకారం కాదు. అధికారం నాకు బాధ్యత. లా అండ్ ఆర్డర్‌ను ఎవరైనా సరే ఇష్టా రాజ్యంగా చేస్తే తొక్కి నార తీస్తా ఒక్కొక్కరికి అని సినిమా స్టైల్‌లో హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్‌లో మా ఇష్టం అంటే.. కుదరదన్నారు. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్ కనబడకూడదు అని అధికారులను హెచ్చరించారు. తెగించానంటే నా ముందు ఎవ్వరు సరిపోరన్నారు. తిరుపతిలో తాను గెలవక పోయినా.. సీఎం చంద్రబాబు గెలవక పోయినా ప్రభుత్వంలోను, టీటీడీలోను భాగస్వాములం. గెలుపు ప్రజలు ఇచ్చారు. అందుకే ప్రజలకు క్షమాపణలు చెప్పానన్నారు.
అడవుల్లోకి మీరు వెళ్లేందుకు చాలా భయపడుతారు. నాకు బిడ్డలు ఉన్నారు. నలుగురు బిడ్డలు. నాకు కోట్ల సంపాదన ఉంది. మంచి కెరీర్ ఉంది. అన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్లి మందు పాతరలు ఉంటాయా లేదా? అనే భయంతో ఎందుకు వెళ్లాలి నేను? ప్రజలంటే నాకు ఇష్టం..ప్రేమ. శ్రీశ్రీ కవితలు, బాలగంగాధర్ తిలక్ కవితలు చదివి, అవి ఉటంకించడానికి స్టేజీ మీద నేను కవిని కాదు. నేను పని చేసే వాడిని. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలాగా ఉంటాడంటే..నాలాగా ఉంటాడు. విప్లవ కారుడు తుపాకీని పట్టుకోకుండా ఓటును నమ్మితే నాలాగే ఉంటది. నాకు డబ్బు మీద మమకారం లేదు. పేరు మీద ఇష్టం లేదు. బాధ్యతే ఉంది నాకు. అందుకని నాతో ప్రేమైనా సరే..గొడవైనా సరే..రెండింటికీ నేను సిద్ధం. అంటూ సిని స్టైల్ డైలాగులు చెబుతూ తన ప్రసంగంలో ఊపు తెప్పించాడు. తన తండ్రి ఎలా ఉద్యోగం చేశారు.. ఎలాంటి కష్టాలు పడ్డారు. ఎంత నిజాయితీగా విధులు నిర్వర్తించాడు..అనే విషయాలను చెబుతూ ప్రజలను ఉద్రేక పరిచారు. అవినీతి గురించి కూడా ప్రస్తావించారు. తన తండ్రి నిజాయితీ గురించి చెబుతూ..మొత్తం అవినీతి మయం అయింది..నేను కాదనడం లేదు. కానీ అవినీతి మయంలో కూడా ఎంతో కొంత చిన్న పాటి అవినీతిని చేయించే ఆలోచనలు చేస్తాను తప్పా..అవినీతిని పూర్తిగా నిర్మూలించలేమంటూ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కల్యాణ్ ప్రజలకు స్పీచ్ ఇచ్చారు. శుక్రవారం పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వపన్ కల్యాణ్ ఈ ప్రసంగం చేశారు.