
యేగా డేలా ప్రచారం అదిరిపోవాలి తమ్ముళ్లూ
సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు.
జీఎస్టీ సంస్కరణల ప్రచారం ఉత్సవంగా చేపట్టాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ లబ్ధి చేకూర్చనున్నాయని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ సంస్కరణలు దేశంలో నూతన అధ్యాయాన్ని తెరుస్తాయని, వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం 60 వేల సమావేశాలు నిర్వహించి, ఈ సంస్కరణల ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. కూటమి పార్టీలు ఉమ్మడిగా ఈ ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు.
జీఎస్టీతో ధరల తగ్గింపు, పరిశ్రమలకు లబ్ధి
జీఎస్టీ సంస్కరణలతో టూ వీలర్‌లు, ఏసీలు, కార్లు, గహోపకరణాల ధరలు తగ్గనున్నాయని, రోగులు వినియోగించే మందులపై జీఎస్టీ లేదని చంద్రబాబు వివరించారు. పారిశ్రామిక, ఆటోమొబైల్, ఫార్మా రంగాలకు ఈ సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సంస్కరణల ఫలితంగా ప్రజలకు రూ. 8 వేల కోట్ల లబ్ధి కలుగుతుందని, ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో తీర్మానం ద్వారా స్వాగతించినట్లు గుర్తుచేశారు.
విద్యుత్ రంగంలో సంక్షోభం పరిష్కారం
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టిందని, దాని అసమర్థ విధానాల వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం 15 నెలల్లో విద్యుత్ రంగాన్ని గాడినపెట్టిందని, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టడం ద్వారా రూ. 1000 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. దీని ఫలితంగా ప్రజలపై రూ. 1000 కోట్ల భారం తగ్గనుందని తెలిపారు.
ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉండాలి
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ప్రజలతో దగ్గరగా ఉండాలని, మంచి–చెడులను వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వెళితే స్వాగతించరని హెచ్చరించారు. సూపర్ సిక్స్‌తో సహా మేనిఫెస్టో హామీలను నెరవేర్చినట్లు, రాష్ట్రంలో అనేక సమస్యలను పరిష్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు.
వైసీపీపై విమర్శలు
వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోగా, ఎమ్మెల్సీలు మాత్రం సభకు హాజరవుతున్నారని, ఈ ద్వంద్వ వైఖరిని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిని డ్రామాగా అభివర్ణించారు.
కార్యకర్తలకు పిలుపు
సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు చేసిన పనులను వివరించినట్లే, జీఎస్టీ ఉత్సవ్‌ను కూడా విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆదేశించారు. యోగాడే కార్యక్రమం విజయవంతమైనట్లే, జీఎస్టీ ఉత్సవ్‌ను కూడా సక్సెస్ చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు స్వీకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు
Next Story