అనురాగ సంగమంలో అమ్మ భాషకు పట్టాభిషేకం
x

'అనురాగ సంగమం'లో అమ్మ భాషకు పట్టాభిషేకం

గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా ప్రారంభమయ్యాయి.


గుంటూరు వేదికగా తెలుగు వాణి విశ్వరూపం దాల్చింది! ఆమ్మ భాషా కమ్మదనాన్ని, ఆరు గాలాల తెలుగు సంస్కృతిని ప్రపంచ దిశదశలా చాటిచెప్పేలా 'ప్రపంచ తెలుగు మహాసభలు' శనివారం (జనవరి 3, 2026) నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చనతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గుంటూరు నగరం.. 52 దేశాల నుంచి తరలివచ్చిన భాషాభిమానుల రాకతో 'తెలుగు వెలుగుల' కాణాచిగా మారింది. అచ్చతెలుగు ఆత్మగౌరవాన్ని ఆవిష్కరిస్తూ, సాహితీ సౌరభాల మధ్య ఈ వేడుకలు జైత్రయాత్రలా మొదలయ్యాయి. తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు గుంటూరు బైపాస్ రోడ్డులోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ (అనురాగ సంగమం) వేదికైంది.

అధ్యాత్మిక శోభతో ప్రారంభం

తొలిరోజు వేడుకలు ఆధ్యాత్మిక పరిమళాల మధ్య ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన శ్రీనివాస కల్యాణం, వేద పండితుల మంత్రోచ్ఛారణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా వెయ్యి మంది కళాకారులతో నిర్వహించిన 'అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చన' సభా ప్రాంగణంలో భక్తిభావాన్ని నింపింది.
ముఖ్య అతిథుల సందడి
ఈ మహాసభలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఎన్టీఆర్ వేదిక.. రామోజీరావు స్మరణ
మహాసభల ప్రధాన వేదికకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు పేరును నామకరణం చేశారు. అలాగే, తెలుగు భాషా సాహిత్యాలకు, పత్రికా రంగానికి విశేష సేవ చేసిన దివంగత రామోజీరావు స్మారక విగ్రహాన్ని సభా ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు తెలుగు భాషాభివృద్ధిలో వారి కృషిని కొనియాడారు.
ప్రపంచవ్యాప్త ప్రతినిధుల రాక
ఈ మూడు రోజుల ఉత్సవాల్లో పాల్గొనేందుకు సుమారు 52 దేశాల నుండి తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు మరియు ప్రతినిధులు తరలివచ్చారు. భాషా పరిరక్షణ, రేపటి తరానికి తెలుగును అందించడం వంటి అంశాలపై ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలు
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు సంప్రదాయ వంటకాల విక్రయశాలలు, ప్రాచీన నాణేల ప్రదర్శన, పుస్తక ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం వేళల్లో నిర్వహించే కూచిపూడి నృత్యాలు, జానపద కళారూపాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మహాసభలు జనవరి 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, భాషా గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ సభలు సాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
Read More
Next Story