అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా 'గో బ్యాక్'
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేలో నిరసన సెగలు తగిలాయి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ కూటమి పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఇతర పెద్దలు పుష్ప గుచ్చాలిచ్చి, శాలువాలు కప్పి స్వాగతం పలికితే అంతకంటే రెట్టింపు స్థాయిలో నిరసన గళంతో విజయవాడ నగరం మారు మోగింది. ‘అమిత్ షా గో బ్యాక్’..‘అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా గో బ్యాక్’ అంటూ ప్రజాస్వామ్య వాదులు, వామ పక్షాలు చేపట్టిన నిరసనల ప్రదర్శనలతో దద్దరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే వాతావరణం కనిపించింది. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇటీవల అంబేద్కర్ మీద అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పేరును పదే పదే ప్రస్తావించడం కంటే భగవంతుడి జపం చేస్తే మోక్ష మార్గం ప్రాప్తిస్తుందని అంబేద్కర్ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వాదులు అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. దీంతో ప్రజాస్వామ్య వాదులు, వామపక్షాలు ఆదివారం అమిత్ షా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినదించారు. అంబేద్కర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా తన హోం మంత్రి పదవికి అనర్హుడని, ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానకరంగా మాట్లాడిన అమిత్‌షాకు ప్రధాని మోదీ మద్దతు ఇవ్వడం, వెనకేసుకొని రావడం సిగ్గు మాలిన చర్యల అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్‌కు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించడమే కాకుండా తన వ్యాఖ్యలను అమిత్ షా సమర్థించుకున్నారని, అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.
Next Story