అమరావతి అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి
x

అమరావతి అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి

లిక్కర్‌ స్కామ్‌పైన, విజయసాయిరెడ్డిపైన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


అమరావతి నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జగన్‌ మాట్లాడారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేసి తీసుకొస్తున్న డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరావతి సెల్ప్‌ ఫైనాన్స్‌ మోడల్‌ అంటూ ఏపీ ప్రజలను మభ్యపెట్టిన సీఎం చంద్రబాబు భారీ స్థాయిలో అప్పలు తెస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ఏడీబి నుంచి రూ. 15వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11వేల కోట్లు, జర్మనీకి చెందిన బ్యాంకు నుంచి రూ. 5వేల కోట్లు, సీఆర్‌డిఏ బాండ్ల నుంచి రూ. 21వేల కోట్లు, ఇలా ప్రస్తుతానికి రూ. 52వేల కోట్లు అమరావతి నిర్మాణం పేరుతో ఎడాపెడా అప్పులు చేశారని ధ్వజమెత్తారు.

ఇవి కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ బడ్జెట్‌ నుంచి మరో రూ. 6వేల కోట్లను కేటాయించారని పేర్కొన్నారు. ఎక్కడ సెల్ప్‌ ఫైనాన్స్‌ మోడల్‌.. ఎక్కడ అప్పలు అని మండిపడ్డారు. అమరావతిలో 50వేల ఎకరాలకు సంబంధించిన వర్కుల కోసం రూ. 77వేల కోట్లు కావాలని ఇటీవల అమరావతికి వచ్చిన ఫైనాన్స్‌ కమిషన్‌ అధికారుల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన పీపీటీలో వెల్లడించారు. అమరావతి నిర్మాణాల పేరుతో ఇంకా ఎంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తారో అనేది అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

విజయసాయిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు జగన్‌. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, సీఎం చంద్రబాబుకు అమ్ముడు పోయాడని సంచలన ఆరోపణలు చేశారు. కూటమికి మేలు చేయడం కోసం టీడీపీకి, చంద్రబాబుకు విజయసాయిరెడ్డి పూర్తిగా లొంగి పోయారని ధ్వజమెత్తారు. అందువల్లే ఆయన పార్టీ నుంచి వెళ్లడం, రాజీనామాలు చేయడం చేశారని, అలాంటి విజయసాయిరెడ్డికి కానీ, అలాంటి వ్యక్తుల మాటలకు కానీ ఏమి విలువ ఉంటుందని ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబు తన 12 మాసాల కాలంలో ఏపీని అతలాకుతలం చేశారని, కేంద్రంలో 13.76 పెరుగుదల కనిపిస్తే.. ఏపీ రెవెన్యూ కేవలం 3.8 మాత్రం సాధించిందన్నారు. తమ ఐదేళ్ల కాలంలో రూ. 3,32,671 లక్షల కోట్లు అప్పులు చేస్తే, ఈ 12 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు రూ. 1,37,546 కోట్ల అప్పులు చేశారని జగన్‌ పేర్కొన్నారు. ఏపీఎండీసీకి సంబంధించిన ఘనులను తాకట్టు పెట్టి రూ. 9వేల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన గనులపై ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ.. వారి అజమాయిషీ చేసేందుకు బాట వేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి నిర్మాణాల కోసం 2018లో కూడా సీఎం చంద్రబాబు టెండర్లు పిలిచారని, అయితే నాడు ఖరారైన టెండర్ల విలువ రూ. 41,107 కోట్లు అని తెలిపారు. వీటిల్లో రూ. 6వేల కోట్ల పనులు చేపట్టారని, తక్కిన రూ. 35వేల కోట్ల పనులు చేపట్టాల్సి ఉందని, అయితే ఆ టెండర్లను రద్దు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు వాటి అంచనాలను అమాంతంగా పెంచేశారని మండిపడ్డారు. 2018తో పోల్చితే ఇప్పుడు 105 శాతం పైగా అంచనాలను పెంచేశారని, చదరపు అడుగు రూ. 8,931 వెచ్చించి నిర్మిస్తున్నారని, ఏమైనా బంగారంతో కడుతున్నారా అంటూ ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూటమి ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబుపైనా నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని, 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4ను వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని జగన్‌ వెల్లడించారు. జూన్‌ 4న కూటమి పాలన తీరుపైన, హామీలను నెరవేర్చక పోవడంపైనా, ప్రజల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని, కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పిస్తామని వెల్లడించారు.
లిక్కర్‌ మీద కూడా జగన్‌ ప్రస్తావించారు. లిక్కర్‌ షాపులను ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు లంచాలు ఇస్తారా? ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎక్కడైనా మద్యం షాపులు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అని నిలదీశారు. 2029–24 మధ్య కాలంలో మద్యం విక్రయాలు బాగా తగ్గిందని, ఒక్క కంపెనీకి కూడా లైసెన్స్‌ ఇ్వలేదని, అంతేకాకుండా పన్నులు కూడా పెంచామన్నారు. ఈ నేథ్యంలో మద్యం కంపెనీలు లాభాలకు పోలేదని, తద్వారా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం కూడా పెంచామన్నారు. అంతేకాకుండా లిక్కర్‌ తాగడం తగ్గిందని, దీంతో ప్రజల ఆరోగ్యానికి మేలు చేశామని జగన్‌ చెప్పొకొచ్చారు.
ప్రతీ లిక్కర్‌ సీసా మీద క్యూఆర్‌ కోడ్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా లిక్కర్‌ విక్రయాలు చేపట్టామని జగన్‌ చెప్పొకొచ్చారు. ఇంత బాధ్యతగా చేసినప్పుడు మద్యం కుంభకోణం ఎక్కడ జరిగిందని అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పని చంద్రబాబు ఇప్పుడు మద్యం రేట్లు పెంచారని, ఏపీలో గల్లీ, గల్లీకి బెల్ట్‌ షాపులు వెలిశాయని, ఈ 12 నెలల కాలంలో సేల్స్‌ పెరిగిందని పేర్కొన్నారు. బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయడం లేదు కానీ మద్యాన్ని మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్‌ కంపెనీలకు సీఎం చంద్రబాబు మేలు చేకూర్చే పని చేస్తున్నారు. ఇలాంటి తమ హయాంలో ఉందా అని ప్రశ్నించారు.
మద్యం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న సీఎం చంద్రబాబు ఇవాల్టికి బెయిల్‌ మీద ఉన్నారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. తమ హయాంలో ఎలాంటి స్కామ్‌ జరక్కపోయినా, జరిగినట్టు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. భయపెట్టి, బెదిరింపులకు పాల్పడి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి మద్యం కుంభకోణం అంటూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డికి మద్యం కేసులో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ధనుంజరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మద్యం కుంభకోణంలో ఏం సంబంధం ఉందని నిలదీశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి, రాజ్‌ కసిరెడ్డికి వ్యాపార సంబందాలు ఉన్నాయని, ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయని, రాజ్‌ కసిరెడ్డిని అప్రూవర్‌గా మారలేదని, నిందితుడుగా మార్చారని, సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా, వారికి కావలసిన స్టేట్‌మెంట్‌ ఇస్తే రాజ్‌ కసిరెడ్డిని ఎప్పుడో వదిలేసే వారని జగన్‌ మండిపడ్డారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్క ఫైల్‌ అయినా సీఎంవోకు వచ్చి సంతకం అయినట్లు కూటమి ప్రభుత్వం చూపించగలదా అని నిలదీశారు. ఏపీలో ఐపీఎస్,ఐఏఎస్‌ల మీద కేసులు పెట్టి జైల్లో వేసిన సందర్భాలు లేవని, సీనియర్‌ అధికారులకు కూడా పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
Read More
Next Story