రెండో విడత భూ సమీకరణ ఎందుకు ఆగిందంటే...
x

రెండో విడత భూ సమీకరణ ఎందుకు ఆగిందంటే...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూ సేకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎందుకు?


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూ సేకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎందుకు బ్రేక్ పడిందీ, ఎవరు దీనికి అభ్యంతరం చెప్పారు అనే దానిపై ఇప్పుడు రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వమే ఆపిందని కొందరు, పవన్ కల్యాణ్ ఆగ్రహం వల్లనే ఆగిందని మరికొందరు చెబుతుంటే ప్రజాగ్రహం వల్లనే ఆగిందని ఇంకొందరు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే...
రాజధాని రెండో దశ కోసం సుమారు 42,226 ఎకరాల భూమిని పూలింగ్ చేయాలని చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈమేరకు జూలై 1న ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పుడది అనూహ్యంగా ఆగింది. చంద్రబాబు లాంటి ఉద్దండునికి ఇది నిజంగా శరాఘాతమే.
వాస్తవానికి జూలై 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రెండో విడత భూ సమీకరణపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఓ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి చెప్పిన దాని ప్రకారం "ల్యాండ్ పూలింగ్ విషయమై మంత్రి వర్గం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, కొందరు మంత్రులు వ్యతిరేకించారు. ప్రత్యేకించి కూటమిలో కీలకంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత భూ సమీకరణను వ్యతిరేకించారు. రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆ మీటింగ్ నుంచి ఆయన లేచి వెళ్లిపోయారు. దీంతో ఆ విషయాన్ని పక్కన బెట్టారు".
దీంతో చేసేదేమీ లేక ఆ విషయాన్ని సీఆర్డీఏ వ్యవహారాలు చూస్తున్న మంత్రుల బృందానికి అప్పగించారు. ఈ పని చేయడమంటే తాత్కాలికంగా ఆ అంశాన్ని అటకెక్కించినట్టే.
"రైతులతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు ఈ మంత్రుల బృందం పని చేస్తుంది" అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నా వాస్తవం మాత్రం రెండో విడత భూ సమీకరణ ఇప్పటికి లేనట్టే.
నిజానికి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ రెండో విడత భూ సమీకరణ కోసం జీవో ఇచ్చారు. "ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూసేకరణ పథకం - 2025" పై గెజెట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 13 గ్రామాల్లోని రైతుల నుంచి విమానాశ్రయం, రైలు మార్గాలు, రోడ్ల వంటి అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన భూమిని సేకరించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
రెండవ దశ భూసేకరణలో తాడికొండ మండలంలో 7,257 ఎకరాలు, తుళ్లూరులో మండలంలో 10,878 ఎకరాలు, అమరావతి మండలంలో 19,504 ఎకరాలు, పెదకూరపాడు మండలంలో 4,586 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. “గ్రామసభలు నిర్వహించి, రైతుల రాతపూర్వక అంగీకారంతోనే భూములు తీసుకుంటాం” అని కుమార్ అన్నారు.
నోటిఫికేషన్ ప్రకారం, గ్రామ సభలు నిర్వహించి రైతుల యాజమాన్య హక్కులను ధృవీకరించేందుకు అవకాశం ఇచ్చి వారి పూర్తి అంగీకారంతో భూములు తీసుకోవాలి. గ్రామసభల్లో రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాతే భూములను ప్రభుత్వం తీసుకుంటుంది.
కానీ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. చాలా చోట్ల రైతులు ఎదురుతిరిగారు. గ్రామ సభల్లో అల్లర్లు చేశారు.
గతంలో సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలో 29 గ్రామల్లో తీసుకున్న భూములు, రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఇంకా అభివృద్ది చేయలేదని, మరో 43 వేల ఎకరాలను ఎలా అభివృద్ధి చేస్తారని రైతులు ప్రశ్నించారు.
ఏపీ సీఆర్డీఏకి చెందిన ఒక అధికారి ప్రకారం చెప్పిన దాని ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ సభలు నిర్వహించడం కష్టంగా ఉంది. అందువల్ల తాత్కాలికంగా నిలిపి వేశామన్నది ఆ అధికారి చెప్పిన మాట. “అదనపు భూ సమీకరణ తుది నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానిదే” అని ఆయన తేల్చిచెప్పారు.
రాజధాని కోసం 2014–2019 మధ్య కాలంలో సుమారు 33,000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. 29 గ్రామాలకు చెందిన సుమారు 26వేల మంది రైతులు ఈ భూమిని ఇచ్చారు. తీసుకున్న భూమికి బదులుగా ప్రభుత్వం ఒక్కో ఎకరానికి 1250 గజాలు ఇచ్చింది. వాటిని అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. కొందరికి పట్టాలు ఇచ్చింది గాని ఆ ప్లాట్లు ఇంకా స్వాధీనం చేయలేదు.
ఈనేపథ్యంలో 2024 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. అమరావతి అభివృద్ధి ఆగింది. భూములు ఇచ్చిన రైతులు చెల్లాచెదరయ్యారు. ఉపాధి కోల్పోయిన రైతు కూలీలు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.
వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని ఫలితంగా రైతులు ఇచ్చిన భూములు బీడుపడ్డాయి. ఇప్పుడు వాటిల్లో మొలిచిన పిచ్చి మొక్కల్ని తొలగించడానికే సుమారు 37 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం తొలుత ఇచ్చిన భూముల్ని అభివృద్ధి చేయకుండానే రెండోసారి భూ సేకరణ చేయాలనుకోవడం లో అర్థం లేదని పలువురు విమర్శించారు.
రైతులు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటి దశ అభివృద్ధి పూర్తిగా ప్రారంభం కాకముందే మళ్లీ భూ సమీకరణ ఎందుకు అని ప్రశ్నించారు. గ్రామసభల సమయంలో రైతులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విషయాన్నే కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదనపు భూముల సేకరణపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు.
“మొదటగా వచ్చే మూడేళ్లలో అమరావతి మొదటి దశను పూర్తిగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ప్లాట్లు లభించలేదు, వారి లేఅవుట్ల అభివృద్ధి జరగలేదు” అని ఓ మంత్రి బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
మరొక మంత్రి మాట్లాడుతూ “మొదటి దశలోని లేఅవుట్లు పూర్తిగా అభివృద్ధి చేసి ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు అమరావతి 2.0 కోసం అదనపు భూముల పూలింగ్ గురించి ఆలోచించవచ్చు” అని చెప్పారు.
వామపక్ష పార్టీలు ప్రత్యేకించి సీపీఎం రెండో విడత భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఊరూ వాడా సదస్సులు పెట్టడం ప్రారంభించాయి. ప్రజా రాజధాని అంటే పాలనా రాజధానిగా ఉండాలే గాని కార్పొరేట్ల రాజధానిగా ఉండకూడదని గట్టిగా చెప్పాయి. వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ దిశగానే ఆందోళనకు దిగాయి.
సరిగ్గా ఈ దశలో పవన్ కల్యాణ్ రెండో విడత భూ సమీకరణను తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. తొలి దశ అభివృద్ధి చేసి అప్పుడు రెండో విడత గురించి ఆలోచించాలని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ మాటను చంద్రబాబు కాదనే ప్రసక్తి లేదు. అందుకే వాయిదా వేశారని తెలుస్తోంది.
రైతుల వ్యతిరేకత, మంత్రుల అసంతృప్తి, కూటమి పార్టీలలో ప్రధానమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనాసక్తి వంటి కారణాలతో రెండో విడత భూ సమీకరణ ఆగింది. అయితే ఇది ఎంత కాలం ఆగుతుందీ, చంద్రబాబు తదుపరి చర్యలు ఏమిటనేది తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
Read More
Next Story