
అమరావతి: యండ్రాయిలో భూములు అమ్ముకుంటున్న రైతులు
అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ యండ్రాయిలో మొదలైంది. అయితే ముందుగానే యండ్రాయి రైతులు తమ పొలాలు రియల్టర్లకు అమ్ముకుంటున్నారు.. ఎందుకు?
రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముందు యండ్రాయి గ్రామంలో మొదలైంది. సన్న, చిన్న కారు రైతులు భారీగా పొలాలు అమ్ముకుంటున్నారు. శనివారం యండ్రాయి గ్రామాన్ని సందర్శించిన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి’ వారితో నేరుగా మాట్లాడితే వారి మాటలు ఆశ్చర్యం, ఆలోచనలు రేకెత్తించాయి. గ్రామంలోని దాదాపు 70 శాతం మంది చిన్న రైతులు పూలింగ్‌లో భూములు ఇస్తే ప్లాట్లు ఎప్పుడు వస్తాయోననే అనిశ్చితి. పిల్లల చదువు, ఇంటి ఖర్చులకు వెంటనే నగదు అవసరం ఉంటుంది. అందుకే ముందుగానే భూములు రియల్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా రూ.1.60 కోట్లకు ఉన్న ఈ పొలాలను బయటి గ్రామాల రియల్టర్లు కొనుగోలు చేస్తూ, “పూలింగ్‌లో ఇస్తే వచ్చే కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు రెట్టింపు ధర పలుకుతుంది” అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా స్థానిక చిన్న రైతులు నగదు తీసుకుని వెళ్తుండగా, పెద్ద లాభాల ఆశతో రియల్ వ్యాపారులు పూలింగ్ ప్రయోజనాలను సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంటోంది.
యండ్రాయి గ్రామంలోని ఒక భాగం
అమరావతి మండలం యండ్రాయి గ్రామ పంచాయతీలో ఈనెల 4వ తేదీన సీఆర్డీఏ అధికారులు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పొంగురు నారాయణ సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో ఎక్కువ మంది రైతులు భూములు ప్రభుత్వానికి అందజేయడానికి అంగీకరించారు. మొత్తం 2 వేల ఎకరాల పైన యండ్రాయి పొలాలు పూలింగ్ పరిధిలోకి తీసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ మద్దతు వెనుక రైతుల ఆందోళనలు, మార్కెట్ డైనమిక్స్, భవిష్యత్ ఆర్థిక ఒత్తిడులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొదటి విడతలో ఎదురైన ఆలస్యాలు, అనిశ్చితులు రైతులను ముందుగానే పొలాలు అమ్ముకోవడానికి పురిగొలుపుతున్నాయి.
గ్రామ సభలో మద్దతు, మంత్రి హామీలు
సీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో మంత్రి నారాయణ, పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. లింగాపురం గ్రామానికి చెందిన రైతు నంబూరి బలరామ్ 4 ఎకరాల పొలం పత్రాలను మంత్రి చేతికి అందజేశారు. (ఆయన ఇటీవలే యండ్రాయిలో భూమి కొనుగోలు చేశారు) మొత్తం 1,879 ఎకరాల పట్టా భూములు, 46 ఎకరాల అసైన్డ్ భూములు యండ్రాయిలో పూలింగ్‌కు గురవుతాయి. రెండో విడతలో అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల నుంచి 16,666 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి నారాయణ మాట్లాడుతూ "రైతులకు అన్యాయం జరగనివ్వం. ఆన్యుటీలు, కమర్షియల్-రెసిడెన్షియల్ ప్లాట్లు, విద్య-ఆరోగ్య సౌకర్యాలు అందిస్తాం" అని హామీ ఇచ్చారు. మొదటి విడతలో 33 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం, ఇప్పుడు మొత్తం 65 వేల ఎకరాలతో అమరావతిని మెగా సిటీగా మలచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
యండ్రాయి గ్రామ పొలాల్లో పండిన పత్తి పంట
రైతులు ముందుగానే పొలాలు అమ్ముకోవడం ఎందుకు?
ఈ మద్దతు రైతుల ఆర్థిక ఒత్తిడుల నుంచి వస్తోంది. ప్రస్తుతం యండ్రాయి పొలాలు ఎకరానికి రూ. 1.60 కోట్లకు అమ్ముడవుతున్నాయి. 5 ఎకరాల లోపు చిన్న రైతులు ఎక్కువగా పొలాలు అమ్ముకుంటున్నారు. "పూలింగ్‌లో ప్లాట్లు ఎప్పుడు స్వాధీనం అవుతాయో తెలియదు. మొదటి విడతలో 11 ఏళ్లు ఆలస్యం జరిగింది. ఇప్పుడు అమ్ముకుంటే డబ్బు వెంటనే వస్తుంది" అంటున్నారు స్థానిక రైతులు. ఆ డబ్బుతో వేరే గ్రామాల్లో ఎకరా రూ. 40 లక్షలకు పొలాలు కొనుగోలు చేసి, అక్కడే ఇళ్లు నిర్మించుకుని బతకాలని ప్లాన్ చేస్తున్నారు. పిల్లల చదువు, ఇతర ఖర్చులకు సాగు ఆదాయం లేకపోతే ఇబ్బంది పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విశ్లేషణ ప్రకారం పూలింగ్ ప్లాట్లు 3-5 సంవత్సరాల్లో రెట్టింపు విలువ పెరిగే అవకాశం ఉన్నా, అనిశ్చితి వల్ల చాలా మంది నగదు ఎంపికలోకి మళ్లుతున్నారు.
కూలీల వలసలు మొదలు
యండ్రాయి వంటి గ్రామాల్లో వ్యవసాయ కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. పూలింగ్ ప్రక్రియలో భూములు పోతుండటంతో స్థానిక ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. "ఇప్పటి నుంచే వలసలు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాం. రోజువారీ ఆదాయం లేకపోతే బతకడం కష్టం" అంటున్నారు కూలీలు. మొత్తం గ్రామ ఆర్థిక వ్యవస్థపై పూలింగ్ ప్రభావం పడుతుందని నిపుణుల అంచనా. మొదటి విడతలో కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి పథకాలు అమలు చేయకపోవటం వల్ల ఇప్పుడు మరింత ఒత్తిడి పెరిగింది.
అవకాశాలు vs రిస్కులు
ప్రభుత్వం రెండో విడతను "వాలంటరీ"గా ప్రకటించినా, మొదటి విడతలో ఆలస్యాలు (11 ఏళ్లు) రైతులలో అపారనష్టం కలిగించాయి. వైఎస్సార్సీపీ పార్టీ ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉంది. "మొదటి భూములు అభివృద్ధి చేయకుండా రెండోది ఎందుకు?" అని ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం రూ. 500 కోట్లు మొదటి సెటిల్మెంట్లకు కేటాయించింది. భవిష్యత్తులో అమరావతి మెగా సిటీగా మారితే, పూలింగ్ రైతులు లాంగ్-టర్మ్ లాభాలు పొందవచ్చు. కానీ చిన్న రైతులు, కూలీల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ భూములు, ఉపాధి పథకాలు అమలు చేస్తే మాత్రమే ప్రక్రియ విజయవంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. యండ్రాయి వంటి గ్రామాలు అమరావతి అభివృద్ధికి ముందుకు వస్తున్నా స్థానికుల ఆందోళనలు పరిష్కరించకపోతే రాజకీయ అలజడులు తప్పేట్లు లేవు.
యండ్రాయి గ్రామ పంచాయతీ వివరాలు
పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని యండ్రాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకే గ్రామం ఉంది. ఈ గ్రామం కొత్త రాజధాని అమరావతి నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతోంది.
2011 జనగణన ప్రకారం యండ్రాయి జనాభా 2,703. అందులో పురుషులు 1,358 మంది, మహిళలు 1,345 మంది ఉన్నారు. గ్రామంలో మొత్తం 760 ఇళ్లు ఉన్నాయి. అక్షరాస్యత శాతం 66.3 కాగా, పురుషుల అక్షరాస్యత 74.5 శాతం, మహిళల అక్షరాస్యత 58.1 శాతంగా నమోదైంది.
గ్రామంలో ప్రాథమిక పాఠశాల, ఉప ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నాయి. గృహావసరాలకు పూర్తి విద్యుత్, వ్యవసాయానికి రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా అందుతోంది. తాగునీటి సౌకర్యం బాగుంది.
ప్రధానంగా వరి, పొగాకు, పసుపు, పత్తి, మిర్చి పంటలు పండిస్తారు. గ్రామం అమరావతి మెగా ప్రాజెక్ట్ పరిధిలో ఉండటంతో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు త్వరలోనే మరింత మెరుగవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.
నా పొలం అమ్ముకున్నా: షేక్ షాన్ బాషా
నాకు రెండెకరాలు పొలం ఉంది. పూలింగ్ కు ముందుగానే పొలం అమ్ముకున్నా. ప్రస్తుతం ఎకరా భూమి రూ. 1, 60,000లు పలుకుతోంది. ఈ రెండెకరాలు పొలం అమ్ముకుంటే వేరే గ్రామాల్లో రెండెకరాలు పొలం రూ. 80 లక్షలకు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటా. పొలంలోనే ఇల్లు కట్టుకుంటా. నా కుమార్తె ఇంజనీరింగ్ చదువుకుంటోంది. ఆమె చదువుకు డబ్బులు కావాలి. పూలింగ్ కు ఇస్తే వారు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు. డెవలప్ మెంట్ ఎప్పటికి జరుగుతుందో తెలియదు. అప్పటి వరకు ఇంటి అవసరాలు, అమ్మాయి చదువుకు నానా ఇబ్బంది పడాలి. అందుకే ముందుగానే అమ్ముకున్నాను అని చెప్పారు. యండ్రాయిలో దాదాపు 500 కుటుంబాల రైతులు నాలాగే ఐదెకరాలు లోపు పొలం ఉన్న వారు. అందుకే వారంతా అమ్ముకుంటున్నారు అని చెప్పటం విశేషం.
నా పొలం పూలింగ్ కు ఇచ్చా: పిన్నమనేని భాష్కరరావు
నాకున్న ఐదెకరాలు పొలం పూలింగ్ కు ఇస్తున్నా. ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఇవ్వటం తప్పదు. అందుకే ఇస్తున్నా అని చెప్పారు.
ఎవరి ఇష్టం వారిది: నాయుడు రాంబాబు, సర్పంచ్
యండ్రాయి సర్పంచ్ నాయుడు రాంబాబు మాట్లాడుతూ ‘ఎవరి ఇష్టం వారిది. కొంత మంది నేరుగా పూలింగ్ కు ఇస్తున్నారు. కొంత మంది వేరే వారికి అమ్ముకుంటున్నారు’ అని అన్నారు. పేద వ్యవసాయ కూలీలకు పెన్షన్ లు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం రాయితీలు ఇవ్వాలి అని పేర్కొన్నారు. కూలీలు వలసలు పోకుండా ఉండాలంటే వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని కోరారు.

