అల్లూరి అడవి బిడ్డ ప్రపంచ కప్‌ తెచ్చింది.. !
x
టీ–20 ప్రపంచ కప్‌తో గిరిజన బాలిక కరుణ కుమారి

అల్లూరి అడవి బిడ్డ ప్రపంచ కప్‌ తెచ్చింది.. !

అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడికి చెందిన కరుణ కుమారి అంధ మహిళల టీ–20 క్రికెట్‌ ప్రపంచ కప్‌ను సాధించడంలో కీలకపాత్ర పోషించింది,


క్రికెట్‌ అంటే ఏమిటో తెలియని స్థితి నుంచి ఇప్పుడు ఏకంగా ప్రపంచ కప్‌ సాధనలో ఆ అంధ బాలిక అద్వితీయ ప్రతిభను చాటింది. అక్కడెక్కడో అడవుల్లో సరైన తిండికి నోచుకోని పేద కుటుంబంలో పుట్టి నేడు అందరి నోటా ఔరా! అనిపించుకుంటోంది. భారత అంధ మహిళల క్రికెట్‌ జట్టుకు వెలుగు దివ్వెగా మారింది. ఆమె పేరు ఎల్లలు దాటి ఊరూ వాడా మార్మోగుతోంది.


ఛాంపియన్‌షిప్‌ సాధించిన ఉత్సాహంలో పరుగెడ్తున్న భారత జట్టు

చూపు లేకపోయినా.. తపన తగ్గలేదు..
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడికి చెందిన పాంగి కరుణ కుమారికి పుట్టుకతోనే పాక్షిక అంధత్వం ఉంది. ఊహ తెలిసొచ్చాక ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. కానీ క్రికెట్‌ ఆడేందుకు బాల్, బ్యాట్‌ కొనివ్వలేని పరిస్థితి ఆమె తల్లిదండ్రులది. దీంతో పొరుగింటికి వెళ్లి టీవీల్లోను, ఎవరిదైనా సెల్‌ఫోన్లోను తనకిష్టమైన క్రికెట్‌ను అప్పుడప్పుడు అస్పష్టంగా చూసి ఆనందించేంది. అలా ఎక్కడైనా చిన్న కర్ర కనిపిస్తే బ్యాట్‌గాను, గుండ్రని వస్తువును బాల్‌గాను చేసుకుని క్రికెట్‌ ఆడి తృప్తి చెందేది. అలాంటి కరుణ కుమారి ఓ టీచరు సాయంతో రెండేళ్ల క్రితం విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల హైస్కూలులో ఎనిమిదో తరగతిలో చేరింది. అక్కడ మరికొన్ని క్రీడలతో పాటు క్రికెట్‌పై పట్టు సాధించింది. ఆమె పట్టుదలను గుర్తించిన పీఈటీ రవికుమార్, మరో పీఈటీ సత్యవతిలు ఆమెను ప్రోత్సహించారు.

క్రికెట్‌ బ్యాట్‌తో కరుణ కుమారి

కరుణ కుమారి క్రికెట్‌ ప్రస్థానం ఇలా..
కరుణ కుమారి తనకు వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. 2023 డిసెంబర్‌లో జాతీయ అంధ మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికైన కరుణ.. 2024లో హుబ్లీలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ప్రతిభ చూపింది. ఈ ఏడాది జనవరిలో కొచ్చిలో జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటింది. గత మార్చిలో కొచ్చిలోనే జరిగిన మ్యాచ్‌లో కర్నాటకను ఓడించి ఆంధ్ర జట్టును గెలిపించింది. అంధ మహిళల టీ–20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ జట్టు ఎంపిక కోసం ఆగస్టులో బెంగళూరులో నిర్వహించిన మ్యాచ్‌లో 70 బంతుల్లో 114 పరుగులు చేసి టీమ్‌లో చోటు సంపాదించుకుంది.
జట్టులో అతి పిన్న వయస్కురాలు..
జాతీయ అంధ మహిళల క్రికెట్‌ టీమ్‌లోకెల్లా కరుణ కుమారే (15) అతి పిన్న వయస్కురాలు కావడం విశేషం! ఈ జట్టులో ఈమెకన్నా మిగిలిన వారంతా పెద్దవారే. ప్రస్తుతం ఈమె విశాఖ ప్రభుత్వ అంధ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

కప్‌తో అంధ మహిళల జట్టు (కుడి నుంచి మూడో బాలిక కరుణ కుమారి)

కోటి ఆశలతో పంపితే.. కప్‌ కొట్టింది..
అంధ మహిళల టీ–20 వరల్డ్‌ కప్‌కు తొలిసారిగా భారత జట్టులోకి ఎంపికైనప్పుడే కరుణ కుమారిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. అంతకు ముందే వివిధ మ్యాచ్‌ల్లో ఆమె సాధించిన పరుగులు, చూపిన ప్రతిభతో తప్పక ఇండియా జట్టుకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుందని అంతా భావించారు. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ కరుణ రాణిస్తూనే వచ్చింది. అలా భారత జట్టు ఫైనల్‌ చేరుకోవడం, ఫైనల్‌లోనూ విజయ బావుటా ఎగురేయడం అనూహ్యంగా జరిగిపోయాయి. తొలిసారిగా ఈ ఏడాది అంధ మహిళల టీ–20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభమైంది. శ్రీలకంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదివారం భారత జట్టు నేపాల్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ పులా సరెన్‌ 44 పరుగులు చేయగా.. మన తెలుగమ్మాయి, గిరిజన బాలిక పాంగి కరుణ కుమారి 42 పరుగులు సాధించింది. నేపాల్‌ అంధ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని చేజిక్కించుకుంది. దీంతో అంధ మహిళల తొలి టీ–20 వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇలా కోటి ఆశలతో టీ–20 వరల్డ్‌ కప్‌కు కోటి ఆశలతో పంపిన నిర్వాహకులకు కొండంత విజయాన్ని తెచ్చిపెట్టిందంటూ కరుణ కుమారిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కరుణ కుమారిపై ఎవరేమన్నారంటే?
అంధ మహిళల టీ–20 ప్రపంచ కప్‌ ఛాంపియన్‌షిప్‌ సాధనలో కీలక పాత్ర పోషించిన కరుణ కుమారిని పలువురు ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తారు. భారత జట్టు వరల్డ్‌ కప్‌ సాధించడంలో ఆమె చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణమని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దనరెడ్డిలు కొనియాడారు. అలాగే భారత జట్టులో తెలుగు తేజం కరుణ ప్రతిభకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఆమె సాధించిన విజయం దేశ యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని ఏసీఏ ప్రెసిడెంట్, శక్రటకరీలు కేశినేని శివనాథ్, సానా సతీష్‌బాబులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె క్రికెట్‌లో మరింతగా రాణించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అంధుల పాఠశాలలో ఆనంద హేల!
అంధ మహిళల టీ–20 వరల్డ్‌ కప్‌ సాధనలో కీలకపాత్ర పోషించడంతో ఆమె చదువుకుంటున్న విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల ఉన్నత పాఠశాలలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పాఠశాల తోటి విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. స్కూలులో అందరూ కరుణ కుమారి ప్రతిభ గురించే చర్చించుకుంటున్నారు. ‘మా విద్యార్థిని కరుణ కుమారి ఇంతటి ఘన విజయాన్ని సాధించడం మా అందరికీ చాలా చాలా సంతోషం.. మా పాఠశాలకు ఇండియాలోనే మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది’ అని ప్రభుత్వ అంధ బాలికల హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ విజయ ‘ద ఫెడరల్‌ ఆం్ర«దప్రదేశ్‌’ ప్రతినిధితో తన ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రధానిని కలవనున్న ఛాంపియన్లు..
ప్రస్తుతం భారత అంధ బాలికల జట్టు శ్రీలంక నుంచి చెన్నై చేరుకుంది. వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన ఈ టీమ్‌ను ఢిల్లీ తీసుకెళ్తున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ జట్టును నేరుగా అభినందించనున్నారు. సోమవారం ప్రధాని ఈ జట్టు సభ్యులకు ‘ఎక్స్‌’ వేదికగా శుభాభినందనలు తెలియజేశారు. నాలుగైదు రోజుల్లో కరుణ కుమారి విశాఖ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు విశాఖలో ఘనంగా స్వాగతం పలకడానికి ప్రభుత్వ యంత్రాంగం, క్రీడాభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.
Read More
Next Story