వారంలో ఆవిరైన అల్లు అర్జున్ ఆనందం
x

వారంలో ఆవిరైన అల్లు అర్జున్ ఆనందం

సినీ హీరో అల్లు అర్జున్ అలియాస్ పుష్పరాజ్ ఆనందం ఆవిరైంది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా రేపిన మంటలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


సినీ హీరో అల్లు అర్జున్ రేవతి అనే మహిళ మృతికి కారకుడయ్యాడనే రేరం కింద చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్యా ధియేటర్ కు అర్జున్ వచ్చిన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందటంతో పాటు ఆమె కుమారుడు ఆస్పత్రిలో చావుతో పోరాడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ పై ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా భార్య చావుకు అల్లు అర్జున్ కారణమని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ 11వ తేదీన ఢిల్లీలో జరిగిన సక్సెస్ మీట్ కు హాజరై శుక్రవారం ఉదయం హైదరాబాద్ కు వచ్చారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలువ లేదు. ఉదయం 11.30 గంటలకు పోలీసులు వచ్చి విచారణ నిమిత్తం స్టేషన్ కు రావాలని కోరారు. దీంతో స్టేషన్ కు తీసుకు వెళ్లిన పోలీసులు అక్కడ రెండు గంటలపాటు విచారించి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు.

అర్జున్ చుట్టూ మీడియా..

అల్లు అర్జున్ అరెస్ట్ వార్త దావానలంలా వ్యాపించడంతో మీడియా మొత్తం ఆయనను ఇంటి వద్ద నుంచి స్టేషన్ కు, స్టేషన్ నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి కోర్టుకు తీసుకెళుతున్న దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీవీల ముందు కూర్చుని పలువురు ఉత్కంఠగా ఏమి జరుగుతుందో తిలకించారు. ఎంతో మంది అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా హీరో ఆనందం ఎంతో సేపు మిగలలేదని, ఎవ్వరూ ప్రేక్షకులు చావాలని కోరుకోరు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఆస్పత్రి బయట, రోడ్డుపైన అభిమానులు అల్లు అర్జున్ ను చూసి కేకలు వేశారు.

భారీగా పోలీస్ బందోబస్త్

సినీ రంగంలో ప్రముఖ హీరో కావడం వల్ల అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద కానీ, ఆస్పత్రి వద్ద కానీ, కోర్టు వద్ద కానీ భారీ స్థాయిలో పోలీసులను మొహరింప జేశారు. దీంతో అభిమానులను ముందుకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ అభిమానులను కట్టడి చేశారు. అయితే మహిళ మృతి సెన్సిటివ్ విషయం కావడంతో ఎవ్వరూ పెద్దగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం అర్జున్ అరెస్ట్ ను వ్యతిరేకించారు.

సీనీ ప్రముఖుల్లో ఆందోళన

అల్లు అర్జున్ వెంటన ఆయన తండ్రి, తమ్ముడు ఉన్నారు. అర్జున్ ను అరెస్ట్ చేశారన్న వార్త తెలియగానే చిరంజీవి, పలువురు నిర్మాతలు, డైరెక్టర్లు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అక్కడి వారితో మాట్లాడారు. ఏమి జరిగిందో తెలుసుకున్నారు. కేసు నమోదైన విషయం తెలియగానే బుధవారం కోర్టులో కేసు కొట్టివేతకు అల్లు అర్జున్ న్యాయవాది పిటీషన్ వేశారు. అయితే ఈ పిటీషన్ బెంచ్ పైకి రాలేదు. శుక్రవారం అర్జున్ ను అరెస్ట్ చేయగానే న్యాయవాది అర్జెంట్ గా తమ పిటీషన్ పై స్పందించాలని న్యాయమూర్తిని కోరారు. ఉదయం పదిన్నరకు పిటీషన్ బెంచ్ పైకి రాకుండా విచారణ ఎలా చేస్తామని జడ్జి అనటంతో తమ వైపు నుంచి పిటీషన్ ముందుగానే వేసిన విషయాన్ని జడ్జికి న్యాయవాది వివరించారు. సాయంత్రం నాలుగు గంటలకు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

ఉత్కంఠ

కోర్టులో సాయంత్రం నాలుగు గంటలకు ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. బెయిల్ ఇస్తారా? రిమాండ్ కు తరలిస్తారా? అనే సందేహాలు అభిమానులను తొలుస్తున్నాయి. అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. అర్జున్ మాత్రం నిబ్బరంగా అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు.

Read More
Next Story