Allu Arjun rescues KTR|కేటీఆర్ ను రక్షించిన అల్లుఅర్జున్
సమాజంలో అల్లుఅర్జున్ డెవలప్మెంట్లు తప్ప ఇంకేమీ వార్తలు లేనట్లుగా టీవీ ఛానళ్ళు పోటీలుపడి మరీ ఊహాగానాలతో జనాలను చావగొట్టేస్తున్నాయి.
అల్లుఅర్జున్ ఏమిటి కేటీఆర్ ను రక్షించటం ఏమిటని ఆలోచిస్తున్నారా ? సంథ్యా ధియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించిన కేసు తనమెడకే చుట్టుకుని విచారణను ఎదుర్కొంటున్న అల్లుఅర్జున్(AlluArjun) ఏ విధంగా కేటీఆర్(KTR) ను రక్షించాడనే అనుమానాలు మొదలయ్యాయా ? విషయం ఏమిటంటే కేటీఆర్ మీద ఫార్ములా ఈ కార్ రేసు కేసు(Formula E Car Race Case)ను ఏసీబీ నమోదుచేసేన విషయం తెలిసిందే. ఎప్పుడైతే కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అప్పటినుండి కేటీఆర్ మీద కేసు, విచారణకు నోటీసులు, అరెస్టు ఖాయమని ప్రచారం విపరీతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అందరు అనుకున్నట్లే కేటీఆర్ మీద ఏసీబీ అధికారులు ఏ1గా కేసు నమోదుచేశారు. ఏసీబీ అధికారులు కేసునమోదు చేయగానే వెంటనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగేసింది. కేటీఆర్ మీద మనీల్యాండరింగ్, ఫెమా కేసులను ఈడీ నమోదు చేసింది. కేటీఆర్ అరెస్టుకు ఏసీబీ రెడీ అవుతోందనే ప్రచారం పెరిగిపోతోంది.
సరిగ్గా అదేసమయంలో అల్లుఅర్జున్ అరెస్టు వ్యవహారం తెరమీదకు వచ్చింది. 13వ తేదీ ఉదయం అర్జున్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అరెస్టుచేసి చిక్కడపల్లి పోలీసుస్టేషన్(Chikkadapalli Police) కు తీసుకెళ్ళారు. దాంతో పుష్ప(Pushpa) లాయర్లు రంగంలోకి దిగి నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసును విచారించిన నాంపల్లి కోర్టు(Nampalli Court)లోని సింగిల్ బెంచ్ అల్లుఅర్జున్ దాఖలుచేసిన పిటీషన్ను కొట్టేసింది. దాంతో అప్పటికప్పుడే అర్జున్ లాయర్లు హైకోర్టు(High Court)లో లంచ్ మోషన్ దాఖలుచేశారు. కేసును విచారించిన హైకోర్టు అల్లుఅర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. అయితే పోలీసులు అల్లుఅర్జున్ను అప్పటికే చంచల్ గూడ(Chamchalguda Jail)కు జైలుకు తరలించారు. ఆరోజు నుండి ఈరోజువరకు మీడియామొత్తం అల్లుఅర్జున్ నామజపంలోనే ముణిగిపోయింది. అల్లుఅర్జున్ అదన్నాడు, ఇదన్నాడు, అలాచేశాడు, ఇలాచేశాడు, అసెంబ్లీలో రేవంత్(Revanth) రెచ్చిపోయాడు, పోలీసులు ఆగ్రహంగా ఉన్నారంటు పుష్ప మంగళవారం ఉదయం 11గంటలకు చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు చేరుకునేంతవరకు టీవీ మీడియా మొత్తం మినిట్ టు మినిట్ లైవ్ రిలేచేస్తోంది.
సమాజంలో అల్లుఅర్జున్ డెవలప్మెంట్లు తప్ప ఇంకేమీ వార్తలు లేనట్లుగా టీవీ ఛానళ్ళు పోటీలుపడి మరీ ఊహాగానాలతో జనాలను చావగొట్టేస్తున్నాయి. థియేటర్లో డిసెంబర్ 4వ తేదీన తొక్కిసలాట జరిగి మహిళ మరణించటం, కొడుకు కోమాలోకి వెళ్ళిన దగ్గర నుండి ఈరోజువరకు అల్లుఅర్జున్ కు సంబంధించిన డెవలప్మెంట్లే మీడియాకు చాలా కీలకమైపోయాయి. థియేటర్లో తొక్కిసలాట జరగకపోయుంటే, జరిగినా మహిళ మృతిచెందకుండా ఉండుంటే పుష్ప సినిమా రిలీజ్ అంశం పెద్ద వార్తాంశం అయ్యుండేదికాదు. అప్పుడు మీడియా ఫోకస్ అంతా నూరుశాతం కేటీఆర్ మీదే నిలిచుండేది. ఫార్ములా కార్ కేసు, కేటీఆర్ అవినీతి, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, ఏసీబీ, ఈడీలు కేసులు నమోదుచేయటంపైనే మీడియా ఫుల్లుగా ఫోకస్ చేసుండేది. అలాకాకుండా మీడియా ఫోకస్ అంతా అల్లుఅర్జున్ మీదే ఉండటం అంటే కేటీఆర్ కు కొంతకాలం ఊపిరిపీల్చుకునే అవకాశం దొరికినట్లే అనుకోవాలి.
అల్లుఅర్జున్ వ్యవహారం పాతపడిపోతోంది, జనాలు పట్టించుకోవటంలేదు అనుకోగానే మీడియాకు ఏదోక సంచలనం కావాలి. అప్పుడు మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేసు, కేసునమోదు అంశాన్ని హైలైట్ చేస్తు మళ్ళీ కేటీఆర్ వెంటపడుతుంది మీడియా. ఇపుడు క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత కేటీఆర్ మీద మీడియా ఫోకస్ పడకుండా కొన్నిరోజులైనా అల్లుఅర్జున్ కాపాడినట్లే అనుకోవాలి. ఈ విధంగా కేటీఆర్ ను మీడియా బారినుండి అల్లుఅర్జున్ రక్షించాడనే చర్చ కూడా జరుగుతోంది.