అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు
అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల పాటు కలిసి ఒకే కుటుంబంలా ఉన్న మెగా, అల్లూ ఫ్యామిలీలు కలహాలతో నిండిపోయాయి
అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల పాటు కలిసి ఒకే కుటుంబంలా ఉన్న మెగా, అల్లు ఫ్యామిలీలు కలహాలతో నిండిపోయాయి. మెగా నీడ నుంచి బయటకు వెళ్లడానికి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని, అందుకు ఈ ఎన్నికలను సరైన అదునుగా మార్చుకున్నాడని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపైనే అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య భీకర పోరు జరుగుతోంది. వారి దెబ్బకు సోషల్ మీడియా కూడా షేక్ అవుతోంది. అయితే ఈ అంశంపై తొలిత స్పందిస్తూ కీలక పోస్ట్ పెట్టిన నాగబాబు ఒక్కసారిగా తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారింది.
నాగబాబు ట్వీట్
‘‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసే వాడు మావాడైనా పరాయివాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మావాడే’’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది. బన్నీని ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై విరుచుకుపడ్డారు. వారికి మెగా ఫ్యాన్స్‌కు కూడా ఎప్పటికప్పుడు ఘాటుగా సమాధానాలు చెప్తూనే వస్తున్నారు. ఈ వివాదం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసేశారు.
ట్విట్టర్ డీయాక్ట్ వెనక ఆంతర్యం ఏంటి!
ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌పై మెగా ఫ్యామిలీ కూడా నాగబాబునే తప్పుబట్టాయని, ఈ విషయంలో పవన్ కూడా నాగబాబును మందలించడంతోనే నాగబాబు తన ఖాతాను డీయాక్టివేట్ చేసేశారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మరోపక్క మాత్రం తాను స్పందిస్తే ఈ వివాదం మరింత పెద్దది అవుతుందని, కుర్రాడు(బన్నీ) ఏదో తెలిసీతెలియక చేసిన పని అని భావించి, వివాదాన్ని చల్లబర్చడానికే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వివాదంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు మరోసారి బహిర్గతం అయ్యాయి.
గొడవకు ఆద్యం అక్కడిది
అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య గొడవ 2017 జులైలో మొదలైంది. ఆ ఏడాది ‘సరైనోడు’ సినిమా సక్సెస్ మీట్‌లో పీకే ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ అనలాంటూ కేకలు వేశారు. దానికి బన్నీ ‘చెప్పను బ్రదర్’ అని బదులిచ్చారు. అక్కడ మొదలైంది ఈ గొడవ. అల్లు అర్జున్‌పై పీకల్లోతు కోపంలో ఉన్న పవన్ ఫ్యాన్స్ అంతా కూడా సరైన ఛాన్స్ కోసం ఎదురు చూశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా ‘డీజే’. ఆ సినిమా టీజర్ విడుదలైంది. అప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తమ ప్రతీకారం తీర్చుకున్నారు. డీజే టీజర్‌పై డిజ్‌లైక్‌ల వర్షం కురిపించారు. వారి దెబ్బకు ఇప్పటికి కూడా భారతదేశంలో అత్యంత డిస్‌లైక్స్ అందుకున్న వీడియోల జాబితాలో ఈ టీజర్ టాప్‌లోనే ఉంటుంది.
క్లారిటీ ఇచ్చిన బన్నీ
దీంతో ఆ తర్వాత తాను ‘చెప్పను బ్రదర్’ అనడానికి కారణాన్ని అల్లు అర్జున్ వివరించారు. ‘‘అభిమానులు మెగా కుటుంబానికి సంబంధంలేని ఈవెంట్స్‌లో కూడా పవన్ కల్యాణ్ అంటూ కేకలు వేయడం వల్ల ఇతర హీరోలు హర్ట్ అవుతున్నారు. దానికి స్వస్తి పలుకుదామనే ఆ రోజున ‘చెప్పను బ్రదర్’ అన్నాను. మేముమేము బాగానే ఉంటాం. కానీ అభిమానులే కొట్టుకుని ఇబ్బంది పడతారు. అలా మీ స్థాయిని తగ్గించుకుని మా స్థాయిని తగ్గించొద్దు’’అని బన్నీ క్లారిటీ ఇచ్చారు. కానీ లాభం లేకపోయింది.
పిఠాపురంతో మళ్లీ చెలరేగిన వివాదం
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో అక్కడ ప్రచారానికి బన్నీ కూడా వస్తాడా రాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కానీ తాను ప్రచారానికి రాలేదు. తన మద్దతు ఎప్పుడూ పవన్‌కి ఉంటుందని ట్వీట్ చేసి ఊరుకున్నాడు బన్నీ. దాంతో సినిమా షూట్‌లో బిజీగా ఉన్నాడేమో అని పీకే ఫ్యాన్స్ సర్దిచెప్పుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే బన్నీ.. నంద్యాలలో వైసీపీ తరపున ఎన్నికల బరిలో ఉన్న శిల్పా రవిని కలవడంతో చిచ్చు మొదలైంది. మామకు హ్యాండ్ ఇచ్చి అతని శత్రువుతో చేతులు కలుపుతావా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్నీపై ట్వీట్లు గుప్పించారు. దీంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న మెగా, అల్లు వివాదం మరోసారి పిఠాపురం సాక్షిగా భగ్గుమంది.
మరోసారి బన్నీ క్లారిటీ
అయితే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, శిల్పా రవి తనకు మంచి మిత్రుడని, అందుకే అతడిని కలవడానికి వెళ్లానని బన్నీ మరోసారి తన చర్యలకు వివరణ ఇచ్చుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా బన్నీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అదే సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో దీనిని మెగా ఫ్యామిలీ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి దీనిని పరిష్కరించడానికి మెగా బాస్ బరిలోకి దిగుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.