NDA in Telangana|తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ?
తాజా రాజకీయ అప్ డేట్స్ ప్రకారం అయితే అవుననే సమాచారం అందుతోంది.
తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ఏర్పాటవబోతోందా ? తాజా రాజకీయ అప్ డేట్స్ ప్రకారం అయితే అవుననే సమాచారం అందుతోంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Amitshah) ఏపీలో రెండురోజులు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో చంద్రబాబునాయుడు(Chandrababu), డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) ఎలాగూ ఉంటారు. వీళ్ళకి అదనంగా కరీంనగర్ ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కూడా ఉన్నారు. ఈనేపధ్యంలోనే ఏపీలో ఎన్డీయే(NDA) కూటమి ఏర్పడినట్లే తెలంగాణ(Telangana)లో కూడా ఏర్పడే విషయమై చర్చలు జరిగినట్లు సమాచారం. టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమిగా ఏర్పడి ఈమధ్యనే జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అఖండవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు విషయం ఏమిటంటే తొందరలో తెలంగాణలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే వచ్చేఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరగబోతున్నాయి.
తొందరలో జరగబోయే ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ పెద్ద టార్గెట్టే పెట్టుకున్నది. ఆ టార్గెట్ రీచవ్వాలంటే అందుకు క్షేత్రస్ధాయిలో బలమైన పునాది చాలా అవసరం. అయితే కమలంపార్టీకి గట్టిపునాదిలేదన్న విషయం అందరికీ తెలిసిందే. పోయినఏడాది జరిగిన అసెంబ్లీఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో బీజేపీ అన్నీచోట్లా పోటీచేసినప్పటికీ ప్రత్యర్ధులకు గట్టిపోటి ఇచ్చింది మాత్రం సుమారు 20 నియోజకవర్గాల్లో మాత్రమే. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీచేశారంటే పోటీచేశారంతే. ఇలాంటి పరిస్ధితుల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావటం జరిగేపనికాదు.
ఏపీలో కూటమి మ్యాజిక్ బాగా వర్కవుటైంది కాబట్టి అదే మ్యాజిక్ ను తెలంగాణలోకూడా రిపీట్ చేయాలనేచర్చలు అమిత్-చంద్రబాబు మధ్య జరిగినట్లు టీడీపీవర్గాల సమాచారం. తెలంగాణలో కూటమి ఏర్పాటు ఆలోచనను తొందరలోనే తెలంగాణ నేతలతో మాట్లాడుతానని అమిత్ చెప్పినట్లు సమాచారం. నిజానికి బీజేపీతో పాటు టీడీపీ, జనసేనకు కూడా తెలంగాణలో పెద్దగా బలంలేదు. ఒకపుడు ఎంతోబలంగాఉన్న టీడీపీ 2014 తర్వాత రాజకీయపరిణామాల్లో బాగా బలహీనపడిపోయింది. పార్టీకి మళ్ళీ పూర్వవైభం తెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలుచేస్తున్నారు. తనప్రయత్నాలకు బీజేపీ, జనసేన కూడా తోడైతే టీడీపీ ఒంటిరిగా కాకపోయినా కనీసం కూటమిగా అయినా బలోపేతం అయ్యేందుకు మార్గం ఏర్పడుతుందన్నది చంద్రబాబు ఆలోచన.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీ విషయమై కేంద్రమంత్రి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని చెప్పారు. అయితే ఏపీలో జరిగిన పరిణామాలు కిషన్ ప్రకటనతర్వాత జరిగినవి. అయినా పొత్తులా ? ఒంటరిపోటీనా అన్నది నిర్ణయించాల్సింది నరేంద్రమోడి(Narendra Modi)నే కాని కిషన్ కాదు. కాబట్టి తొందరలోనే తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ఏర్పాటు అయ్యేట్లే ఉంది చూస్తుంటే. మరి అధికారిక ప్రకటన ఎప్పుడుంటుందో చూడాలి.