ఆళ్లగడ్డ.. ఎవరికి అడ్డా..
x

ఆళ్లగడ్డ.. ఎవరికి అడ్డా..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలు భూమా, గంగుల కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయి. భూమా దంపతులు చనిపోయినా కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.


ఆ నియోజకవర్గంలో వీరిది ఏకఛత్రాదిపత్యమే...

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెండు కుటుంబాల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. రాజకీయాల్లో ఈ రెండు తలపండిన కుటుంబాలు. ఒక కుటుంబం వారు ఓడిపోతే మరో కుటుంబం వారు గెలుస్తారు. 1989 నుంచి వరుసగా భూమా నాగిరెడ్డి కుటుంబం గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. పార్టీలు మారినా రాజకీయాలు మాత్రం వారి చుట్టూ తిరుగుతూ ఉండటం విశేషం. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య భూమా శోభా నాగిరెడ్డిలు నియోజకవర్గంలో ఒక వెలుగు వెలిగారు. అయితే ఇరువురూ ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. వారి వారసురాలుగా భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. పిన్న వయసులోనే ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచి ఊహకు అందని విధంగా పార్టీ మారి మంత్రి పదవిని చేపట్టారు. మంత్రి అయ్యాక తల్లిదండ్రుల రాజకీయ సేవలు అఖిలప్రియ మరిచిపోయారనే విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ఈ కుటుంబం ఆళ్లగడ్డలో ఏకచత్రాధిపత్యంగా రాజకీయ ప్రయాణం సాగించింది.

పడి లేచిన కెరటం..

అఖిలప్రియ ఒకసారి ఓటమి చవిచూశారు. వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో గంగుల బ్రిజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే రానున్న ఎన్నికల్లో గత ఎన్నికల్లో వీచిన గాలి వైఎస్సార్‌సీపీకి వీచడం లేదు. అలాగని తెలుగుదేశం పార్టీలో కూడా సఖ్యత లేదు. వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ అడ్డాగా ఆళ్ల గడ్డ మారుతుందా? లేదా? అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది.

ఆకుటుంబాలను ఆదరించిన ప్రజలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోకవర్గం విలక్షణమైన రాజకీయాలకు వేదిక. ఈ నియోజకవర్గంలో 1989 నుంచి భూమా కుటుంబ సభ్యులే రాజకీయాలు చేయడం విశేషం. వారిని ప్రజలు కూడా అదే మాదిరి ఆదరిస్తున్నారు. 1989లో భూమా కుటుంబం నుంచి శేఖర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి టీడీపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడకుండా వరుసగా 1999వరకు నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉన్నారు. 2004లో భూమానాగిరెడ్డిపై కాంగ్రెస్‌–ఐ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల ప్రతాప్‌రెడ్డి గెలుపొందారు. తిరిగి 2009లో భూమా శోభా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గంగుల ప్రతాప్‌రెడ్డి ఓడిపోతూ వచ్చారు. పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో శోభా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉప ఎన్నికలో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన శోభ ఎన్నికలు జరగటానికి ముందే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తర్వాత రిజల్ట్‌ ప్రకటించగా శోభ నాగిరెడ్డి గెలుపొందారు. అదే సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలో శోభ నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ వైఎస్సార్‌సీపీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరువాత జరిగిన పరిణామాల్లో ఆమె పార్టీ పిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియ 35,613 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అఖిలప్రియ పార్టీ మారడంతో ఆమెను ప్రజలు స్వాగతించలేదు. భూమా కుటుంబానికి ప్రత్యర్థిగా రాజకీయాల్లో ఉంటూ వచ్చిన గంగుల ప్రతాప్‌రెడ్డి కుమారుడు బ్రిజేంద్రరెడ్డికి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వడంతో ఆయన గెలుపొంది ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆళ్లగడ్డలో రాజకీయ చక్రం తిప్పుతున్నది ఆ కుటుంబాలే..

ఆళ్లగడ్డ రాజకీయాల్లో గంగుల కుటుంబం, భూమా కుటుంబం, ఎస్వీ సుబ్బారెడ్డి కుటుంబం 1978 నుంచి చక్రం తిప్పారు. ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె శోభా నాగిరెడ్డి. భూమా నాగిరెడ్డి ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ మూడు కుటుంబాల్లోని వ్యక్తులు పార్టీలు మారారే తప్ప రాజకీయాలు మాత్రం వారి చేతుల్లోనే ఉన్నాయి. తాతలు, తండ్రులు, ఇప్పుడు వారి వారసులు రాజకీయాల్లో ఉన్నారు. మేలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ తిరిగి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తుండగా బ్రిజేంద్రరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇరు కుటుంబాలు రాజకీయాల్లో ఉద్దండలే. అయితే ఇప్పుడు అఖిలప్రియ తల్లి, తండ్రి లేని బిడ్డగా మిగిలారు. పైగా తాను పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులు ఇచ్చి తనకు నచ్చిన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుని చరిత్ర సృష్టించారు.

Read More
Next Story