
సాగరతీరంలో టైడ్ పూల్ వాక్‌లో పాల్గొన్న మహిళలు
వైజాగ్‌లో ఆల్ ఉమెన్ బయోడైవర్సిటీ వాక్ !
ఏపీలోనే తొలిసారి శ్రీకారం చుట్టిన మహిళామణులు. మూడు రోజులు భిన్న ప్రాంతాలు, విభిన్న జాతుల సందర్శన. ఆనంద పరవశంతో అచ్చెరువొందిన స్త్రీ మూర్తులు.
ఇన్నాళ్లూ ఇంటికి, వంటింటికే పరిమితం అయిన కొంతమంది మహిళలు ఒకడుగు ముందుకేశారు. కొత్త బంగారు లోకం చూడటానికి పయనమయ్యారు. సరికొత్త జంతు జాలాలను, విభిన్న పక్షులను, చిత్ర విచిత్రమైన సముద్ర జీవులను కళ్లారా వీక్షించడానికి వెళ్లారు. ఇన్నాళ్లూ ఎవరైనా చెబితే వినడమో, టీవీల్లోనూ చూడడమే తప్ప ప్రత్యక్షంగా చూడని వీరు వాటిని చూసి అచ్చెరువొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖకు చెందిన ఈ మహిళామణులు ఒక్క రోజు కాదు.. మూడు రోజుల పాటు మూడు వేర్వేరు ప్రాంతాల్లో తొలిసారిగా ఈ బయోడైవర్సిటీ వాక్‌ను నిర్వహించారు.
కంబాల కొండ చెరువు వద్ద పక్షులను చూస్తున్న విద్యార్థినులు
విశాఖ నగరం పరిసరాలు ప్రక్రుతి రమణీయతకు నిలయాలు. ఒకపక్క నీలి నీలి సంద్రం. మరోపక్క పచ్చని పర్వత శ్రేణులు. ఇంకో పక్క అటవీ ప్రదేశాలు. వీటిలో రకరకాల జీవరాశులు సంచరిస్తూ జీవిస్తుంటాయి. ప్రక్రుతి ప్రేమికులను మైమరపిస్తుంటాయి. వేటికవే ప్రత్యేకతను సంతరించుకుని అలరిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లోని పక్షులు, జంతువులు, జలచరాలను చూడడానికి పక్షి, జంతు ప్రేమికులో, ట్రెక్కర్సో, వీటిపై పని చేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులో ఆసక్తి చూపుతుంటారు. వీరు బయో డైవర్సిటీ వాక్, బర్డ్ వాక్, టైడ్ పూల్ వాక్, ఫుల్ మూన్ నైట్ వాక్‌లను నిర్వహిస్తుంటారు. ఎప్పుడైనా ఒకరిద్దరు మహిళలూ అందులో పాల్గొంటారు. మిగిలిన వారంతా పురుషులే ఉంటారు. విశాఖలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే మహిళలు బ్రుందంగా ఏర్పడి ఈ బయో డైవర్సిటీ తదితర వాక్‌లు నిర్వహించిన సందర్భాలు లేవు.
ఇందిరాగా జూలో జంతువులను వీక్షిస్తున్న మహిళలు
మొట్ట మొదటి ఆల్ ఉమెన్ వాక్..
తొలిసారి విశాఖ నగరంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, గ్రీన్ వేవ్స్, గ్రీన్ పాస్ సంస్థలు ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా కేవలం మహిళలతోనే బయో డైవర్సిటీ వాక్ నిర్వహించాలని తలపెట్టారు. దానికి ఆల్ ఉమెన్ వాక్ అని పేరు పెట్టారు. ఈ వాక్‌లో పాల్గొనడానికి విభిన్న రంగాల్లో పని చేస్తున్న మహిళా మణులు, గ్రుహిణులు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ఆసక్తి చూపారు. ఈ ఆల్ ఉమెన్ వాక్ కోసం ఈనెల 7, 8, 9 తేదీల్లో మూడు ప్రత్యేక మహిళా వాక్స్‌ను ఎంపిక చేశారు. 7వ తేదీన సాగర తీరంలో సముద్ర జీవులు, వాటి సంరక్షణను అన్వేషించడం కోసం *టైడ్ పూల్ వాక్*ను, 8న ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లోని విభిన్నమైన వ్రుక్ష, ప్రాణి సంపదను వీక్షించేందుకు బయో డైవర్సిటీ (జీవ వైవిధ్య) వాక్‌ను, 9న జీవ వైవిధ్య పక్షుల అన్వేషణకు కంబాల కొండ/ చెరువులో బర్డ్ వాక్‌ను చేపట్టారు. ఈ మూడు రోజుల వాక్‌లో సుమారు 150 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
బీచ్‌లో వింత జీవరాశులను పరిశీలిస్తూ..
ఏమేం చూశారు?
తొలిరోజు టైడ్ పూల్ వాక్‌లో భాగంగా ఈ మహిళా బ్రుంద సభ్యులు విశాఖ సాగరతీరంలో అత్యంత అరుదైన సముద్ర జీవులు ఎలిగెంట్ ఫెదర్ స్టార్, టినీ నార్తర్న్ స్టార్ వంటి వాటితో పాటు భిన్న రకాల పీతలు, బార్నికల్స్, బటర్ ఫ్లై ఫిష్ వంటి వాటిని వీక్షించారు. అలాగే రెండో రోజు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో అరుదైన జంతువులు, పక్షులు, వాటి జీవన శైలి వంటివి చూశారు. మూడోరోజు కంబాల కొండలో కాటన్ పిగ్మీ గూస్, ఇండియన్ స్పాట్ బల్డ్ డక్స్, గ్రే ఫ్రాంకొలిన్, ఫెరల్ పీజియన్, స్పాటెడ్ డవ్, కామన్ హాక్ కుకూ, యూరేసియన్ కూట్, స్పాటెడ్ ఓలెట్, వైట్ థ్రోటెడ్ కింగ్‌ఫిషర్ వంటి 51 రకాల పక్షులు వీరికి కనువిందు చేశాయి.
కంబాలకొండలో బయోడైవర్సిటీ వాక్ మహిళలు
ఆయా ప్రాంతాల్లో వీరు వాక్ చేసినప్పుడు వారి కంట పడిన జంతువులు, పక్షులు, సముద్ర జీవరాశుల గురించి నిర్వాహకులు ఈ మహిళలకు, విద్యార్థినులకు శాస్త్రీయ నామాలతో సహ వివరించారు. వాటి ప్రత్యేకతలనూ తెలియజేశారు. సుదూరంలో చెట్ల పై వాలిన అరుదైన పక్షులు సరిగా కంటికి కనిపించకపోతే అత్యాధునిక కెమెరాలు, బైనాక్యులర్లతో వాటిని చూపించారు. దీంతో వాక్‌కు వెళ్లిన మగువలంతా ఆనంద పరవశులయ్యారు.
బీచ్‌లో టినీ నార్తర్న్ స్టార్
చెప్పలేనంత మధురానుభూతి పొందా..
నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా బీచ్‌కు వెళితే రకరకాల సముద్ర జీవులు కనిపిస్తాయి. కానీ అవేంటో నాకు తెలియవు. బీచ్ టైడ్ పూల్ వాక్‌లో నేను మునుపెన్నడూ చూడని అరుదైన జీవరాశులను చూశాను. వాటి గురించి వివరంగా చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. ఇన్ని వింత జీవులు ఇక్కడ ఉన్నాయా? అనిపించింది. ఇలాంటి వాటిని నేను టీవీల్లోనే చూశాను.
బీచ్‌లో ఎలిగెంట్ ఫెదర్ స్టార్ ఫిష్
ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. కంబాల కొండలోనూ ఎన్నో కొత్తరకం పక్షులు కనువిందు చేశాయి. ఇలాంటి వాటిని చూడాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వాక్‌ల్లో వాటిని చూసే అవకాశం దక్కింది. ఈ వాక్‌లో చెప్పలేనంత మధురానుభూతిని పొందాను అని విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన గ్రుహిణి బి.వెంకట శ్రీలక్ష్మి ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు.
కంబాల కొండలో ఏసియన్ కోయెల్
మంచి ముందడుగు..
మహిళలు బయోడైవర్సిటీ వాక్‌పై ఆసక్తి చూపడం ఓ మంచి పరిణామం. ఇన్నాళ్లూ ఇలాంటి వాటికి ఎక్కువగా పురుషులే వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఆల్ ఉమెన్ వాక్ నిర్వహించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్శంగా నిర్వహించిన మూడు రోజుల వాక్‌లో 150 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా జూలో వీరికి ఉచితంగా అనుమతించి పక్షులు, జంతువుల గురించి వివరించాం. అరుదైన పక్షులు, జీవరాశులు, జంతువులను చూసి మురిసిపోయారు.
ఫీజెంట్ టెయిల్ జకానా
ఈ వాక్‌లో కళాశాలల విద్యార్థినులు పాలుపంచుకున్నారు. తాము చూసిన వాటి ప్రత్యేకతలను రికార్డు చేసుకున్నారు. బయోడైవర్సిటీ వాక్కు వచ్చిన మహిళలతో కొత్తగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. దీనిపై ఆసక్తి ఉన్న మహిళలను గ్రూపులో చేర్చుకుంటాం. ఇలాంటి వాక్ ఏర్పాటుపై ఈ మహిళలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బి.దివ్య తెలిపారు.
చైతన్య
ఇదో గొప్ప ప్రయత్నం..
మహిళలు బయోడైవర్సిటీ వాక్ చేపట్టడం గొప్ప ప్రయత్నం. ఈ వాక్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న మహిళలు చెప్పలేనంత ఆనందానుభూతిని పొందాం. విద్యార్థినులకూ చాలా ఉపయోగపడింది. కంబాలకొండలో వలస పక్షులు, కొత్త రకాల పక్షిజాతులు కనువిందు చేశాయి. ఈ వాక్ ద్వారా జంతు, పక్షి ప్రపంచంపై అవగాహన పెంపొందుతుంది. గ్రూపు ఏర్పాటుతో మహిళల మధ్య పరిచయాలూ పెరగడంతో పాటు.. పరస్పర అనుభవాలనూ పంచుకోవచ్చు. ప్రక్రుతి అంటే నాకు మక్కువ. రెండేళ్లలో ఒకట్రెండు సార్లు ఇలాంటి వాక్‌లకు వెళ్లాను. కానీ ఈ వాక్‌లో ఎంతో ఎంజాయ్ చేశాం. ఐదేళ్ల కుమార్తెను వెంటబెట్టుకుని బయో డైవర్సిటీ వాక్‌కు వెళ్లాను. మున్ముందు ఇలాంటి వాక్‌ల్లో పాల్గొనాలన్న కుతూహలం పెరిగింది అని చైతన్య అనే మహిళ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో తన ఆనందాన్ని పంచుకున్నారు.