KTR and BJP|బీఆర్ఎస్ ఆశలన్నీ బీజేపీ పైనేనా ?
x

KTR and BJP|బీఆర్ఎస్ ఆశలన్నీ బీజేపీ పైనేనా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)(GHMC) మేయర్, డిప్యుటి మేయర్ పై అవిశ్వాసతీర్మానం పెట్టి దించేయాలని బీఆర్ఎస్(BRS) డిసైడ్ అయ్యింది


వినటానికి విచిత్రంగానే ఉన్నా క్షేత్రస్ధాయిలో పరిణామాలు మాత్రం దాదాపు ఇలాగే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)(GHMC) మేయర్, డిప్యుటి మేయర్ పై అవిశ్వాసతీర్మానం పెట్టి దించేయాలని బీఆర్ఎస్(BRS) డిసైడ్ అయ్యింది. అయితే మేయర్, డిప్యుటి మేయర్ పైన అవిశ్వాసతీర్మానం పెట్టాలంటే బీఆర్ఎస్ బలం సరిపోదు. అందుకనే మద్దతుకోసం కారుపార్టీ నేతలు బీజేపీ(BJP)పైన ఆధారపడ్డారు. శతృవుకు శతృవు అన్నపద్దతిలో కాంగ్రెస్(Congress) లో ఉన్న మేయర్, డిప్యుటి మేయర్లను పదవుల్లో నుండి దించేయటానికి బీజేపీ కూడా ఆలోచిస్తోంది. అయితే బహిరంగంగా బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా అన్నదే పెద్ద అనుమానంగా తయారైంది. మేయర్, డిప్యుటి మేయర్లను దింపేయటానికి బీఆర్ఎస్ కు మద్దతివ్వటంలో తప్పులేదని కొందరు కమలంపార్టీ కార్పొరేటర్లు ఆలోచిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలోనే అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు అర్ధంకావటంలేదు.

అవిశ్వాసతీర్మానం పెట్టాలని కేటీఆర్ తదితరుల్లో బలంగా ఉన్నా అందుకు అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యుటి మేయర్ శ్రీలతశోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా గెలిచారు. 2021 ఫిబ్రవరిలో గద్వాల మేయర్, శ్రీలత డిప్యుటి మేయర్ గా బాధ్యతలు తీసుకున్నారు. 2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పై ఇద్దరితో పాటు మరికొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అప్పటినుండి కేటీఆర్ తదితరులు గద్వాల, శ్రీలత అంటే మండిపోతున్నారు. అందుకనే వీళ్ళిద్దరినీ ఎలాగైనా పదవుల్లోనుండి దింపేయాలని వ్యూహాలు పన్నుతున్నారు. అయితే పార్టీలవారీగా ప్రస్తుత బలాబలాలు చూసుకుంటే మేయర్, డిప్యుటిలను పదవుల్లోనుండి తొలగించేంత సీన్ బీఆర్ఎస్ కు లేదు. అందుకనే వెలుపలినుండి మద్దతుకోసం బీజేపీపైన ఆధారపడితే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారు.

మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇంట్లో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీల సమావేశం జరిగింది. కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనేకఅంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో మేయర్, డిప్యుటిలపై అవిశ్వాసతీర్మానం పెట్టే విషయంపైన కూడా పెద్ద చర్చేజరిగింది. తాజా పరిణామాల్లో కాంగ్రెస్, ఎంఐఎం ఏకమయ్యాయి. కాబట్టి బీఆర్ఎస్ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలని అనుకుంటే బీజేపీ మద్దతుతోనే సాధ్యమవుతుంది. లేకపోతే అసలు ఆలోచనే చేయదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అని రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఇదేసమయంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందని బీజేపీ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ తో పాటు పార్టీనేతలు గోలచేస్తున్నారు.

అసలు ఏ పార్టీకి ఏ పార్టీతో సంబంధాలున్నాయి ? అవగాహన కుదిరింది ? లోపాయికారీ ఒప్పందాలు కుదిరాయన్న విషయంలో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటిసమయంలో మేయర్, డిప్యుటీలను పదవుల్లో నుండి దింపేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఏకమైతే ఇంతకాలంగా రేవంత్ అండ్ కో చేస్తున్న ఆరోపణలు నిజమేనని జనాలు నమ్ముతారు. బీఆర్ఎస్-బీజేపీలు ఒకటే అని జనాలు నమ్మితే రెండుపార్టీలకు తీవ్రమైన నష్టంఖాయం. 2023 ఎన్నికలకు ముందు ఢిల్లీలిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో కీలకపాత్రదారుగా కేసులో ఇరుక్కున్న కల్వకుంట్ల కవిత(Kavitha)పై సీబీఐ, ఈడీలు చర్చలు తీసుకోకపోవటానికి బీఆర్ఎస్. బీజేపీ మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందమే కారణమని రాహుల్ గాంధి(Rahul Gandhi), రేవంత్(Revanth) పదేపదే చేసిన ఆరోపణలు నిజమని జనాలు నమ్మారు. దాని ప్రభావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కనబడింది. తర్వాత జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు ముందు కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED) అరెస్టుచేసిన విషయం తెలిసిందే.

పై విషయం దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టినా బీజేపీ మద్దతిచ్చేది అనుమానమే. అవిశ్వాసతీర్మానం విషయంలో రెండుపార్టీలు ఏకమైతే కాంగ్రెస్ చేసే ఆరోపణలను తట్టుకోవటం రెండుపార్టీల నేతలకు కష్టమే. ఆరోపణలప్రభావం తర్వాత జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ప్రభావంచూపినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకనే అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టే విషయంలో ఏమిచేయాలో కేటీఆర్ తదితరులకు అర్ధంకావటంలేదు. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడం ముఖ్యంకాదు. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడితే గద్వాల, శ్రీలతను కచ్చితంగా పదవుల్లో నుండి దింపేయాలి. లేకపోతే అందరిముందు నవ్వులపాలవ్వటం తప్పదు. అసలు అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టేంత బలం బీఆర్ఎస్ కు ఉందా అన్నదే సందేహం. బీఆర్ఎస్, బీజేపీలు కలిసినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేంత బలం అనుమానమే.

ఎవరి బలమెంత ?

గ్రేటర్ కార్పొరేషన్లో మొత్తం 150 డివిజన్లున్నాయి. ఇందులో ఇద్దరు కార్పొరేటర్లు ఎంఎల్ఏలుగా గెలిచారు, ముగ్గురుకార్పొరేటర్లు మరణించటంతో ఇపుడు కార్పొరేటర్ల సంఖ్య 142 మాత్రమే. గ్రేటర్ పరిధిలోని ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు 50 మంది ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్నారు. దాంతో జీహెచ్ఎంసీ సభ్యుల మొత్తం సంఖ్య 192కు చేరింది. మేయర్, డిప్యుటి మీద అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 శాతంమంది సభ్యుల సంతకాలు అవసరం. ఈ లెక్కప్రకారం 192లో 50 శాతం అంటే సుమారు 96 మంది సభ్యులు సంతకాలు చేయాల్సుంటుంది. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలని పట్టుదలగా ఉన్న బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు+29 మంది ఎక్స్-అఫిషియో సభ్యుల బలముంది. నిజానికి బీఆర్ఎస్ తరపున 56 మంది కార్పొరేటర్లు గెలిచినా 2023 ఎన్నికల తర్వాత 14 మంది కాంగ్రెస్ లో చేరిపోవటంతో బలం 42కి పడిపోయింది. మరికొందరు కాంగ్రెస్ లో చేరకపోయినా బయటనుండి మద్దతిస్తున్నారు. అంటే అచ్చంగా కారుపార్టీ బలం 71 అనుకుంటే అవిశ్వాసతీర్మానం ప్రతిపాదనకు మరో 27 మంది సభ్యుల సంతకాలు అవసరం.

ఇక, బీజేపీ 48 డివిజన్లలో గెలిచినా లింగోజీగూడ డవిజన్ కార్పొరేటర్ మరణించాడు. అక్కడ జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచాడు. తర్వాత గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కూడా మరణించాడు. అయితే ఇక్కడ ఉపఎన్నిక జరగకపోవటంతో బీజేపీ బలం 46కి తగ్గిపోయింది. ఇదేసమయంలో మరో ఆరుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరటంతో బీజేపీ వాస్తవబలం ఇపుడు 40 ఉంది. ఎంఐఎం 44 డివిజన్లలో గెలవగా వీరిలో ఒక కార్పొరేటర్ మరణించగా మరో ఇద్దరు రాజీనామాలు చేశారు. దాంతో ఎంఐఎం వాస్తవ బలం 41కి తగ్గిపోయింది. 2020 ఎన్నికల్లో కేవలం 2 డివిజన్లలో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ బలం ఉపఎన్నికలో గెలవటంతో మూడుకు చేరింది. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు పార్టీబలం 24కి పెరిగింది.

జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం గెలిచిన నాలుగేళ్ళ తర్వాత మాత్రమే మేయర్, డిప్యుటిపై అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. రాబోయే ఫిబ్రవరి 11వ తేదీతో మేయర్, డిప్యుటిలు పదవుల్లో కూర్చుని నాలుగేళ్ళవుతుంది. అందుకనే అప్పటికి అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని కేటీఆర్ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్రేటర్లో బలాల లెక్కలన్నీ చాలా అయోమయంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఎంతమంది కార్పొరేటర్లున్నారు ? ఎంతమంది కాంగ్రెస్ లో చేరారు ? ఇంకెతంతమంది బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు ? అన్న విషయంలో ఎవరికీ క్లారిటీలేదు. ఒకవేళ బీజేపీ మద్దతుతో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టినా బీఆర్ఎస్ లోనే ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు సంతకాలు పెడతారా ? తీర్మానంపై ఓటింగ్ జరిగితే ఎంతమంది ఓట్లేస్తారు ? అన్నది తెలీదు.

బీఆర్ఎస్ కార్పొరేటర్లే కాదు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాబట్టి అవిశ్వాసతీర్మానాన్ని ప్రతిపాదించేముందు ఒకటికి రెండుమూడుసార్లు సొంతబలం ఎంతన్న విషయంలో కేటీఆర్ లెక్కలు వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సొంతసభ్యులే జారిపోతే అవమానాన్ని ఎదుర్కోకతప్పదని గుర్తుంచుకోవాలి.

ఇద్దరూ కూల్

అవిశ్వాసతీర్మానం విషయంలో మేయర్, డిప్యుటీలు ఇద్దరూ చా కూల్ గా ఉన్నారు. తమపైన అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టేముందు అసలు బీఆర్ఎస్ బలమేంటో తెలుసుకుంటే మంచిదని గద్వాల, శ్రీలత చాలా కూల్ గా అన్నారు. బీఆర్ఎస్ బలమెంతో వాళ్ళకే తెలియనపుడు ఇక తమపైన అవిశ్వాసతీర్మానం ఎలాగ ప్రవేశపెడతారని శ్రీలత ప్రశ్నించారు. ఇదే విషయమై గద్వాల మాట్లాడుతు అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడితే అప్పుడు చూసుకుంటామని చాలా తేలిగ్గా తీసుకున్నారు.

Read More
Next Story