బ్రహ్మోత్సవ అంతా సిద్ధం.. కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు.
x

బ్రహ్మోత్సవ అంతా సిద్ధం.. కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు.


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో, అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.....

- ఈ ఏడాది అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అత్యంత వైభవంగా జరుగనున్నాయి.

- ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహన సేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.

- ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తకోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసింది.

- అక్టోబరు 04న ముఖ్యమంత్రివర్యులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

- అదేవిధంగా అక్టోబర్ 5వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ.13.45 కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు.

శ్రీవారి ఆలయం :

భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ప‌లు ఆర్జితసేవలు రద్దు.

- భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచాం.

- భక్తుల సౌకర్యార్థం లడ్డూ కౌంటర్లను 2023లో 54 ఉండగా 2024లో 65, అంటే 11 అదనంగా ఏర్పాటు చేశాం.

- వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు.

- బ్రేక్‌ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం. గరుడసేవ రోజు అక్టోబరు 8న బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా రద్దు.

- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 1.32 లక్షల రూ.300/` దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం.

- తిరుపతిలో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్లు 24 వేలు అందుబాటులో ఉన్నాయి.

- అంగప్రదక్షిణ టోకెన్ల రద్దు.

- శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఉద్యానవన, విద్యుత్‌ విభాగాల ఆధ్వర్యంలో శోభాయమానంగా అలంకరణలు చేపడుతున్నాం.

భద్రత :

- దాదాపు 1250 మంది టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బంది.

- పోలీసు సిబ్బంది దాదాపు 3900

అదేవిధంగా DFMDలు 2023లో 130, 2024లో 151 మందితో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాం.

- గరుడసేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత.

- ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,775 సిసి కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుండి పర్యవేక్షిస్తాం.

- పిఏసి - 4లోని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వీడియోవాల్‌ ద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తాం.

- సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో భద్రతా సిబ్బందితోపాటు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం.

- హోంగార్డులు, ఎన్‌సిసి విద్యార్థులు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అగ్నిమాపక పరికరాలతో కూడిన సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశాం.

- భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబరు : 155257కు ఫిర్యాదు చేయవచ్చు.

- శ్రీవారి సేవా సదన్‌ వద్ద 4 అదనపు లగేజి సెంటర్లు ఏర్పాటు.

ఇంజినీరింగ్‌ విభాగం :

- లక్షలాది భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు సుందరంగా తీర్చిదిద్దాం.

- తిరుమలలో ఎల్ఈడి స్క్రీన్లు గత సంవత్సరం 3 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేయగా, 2024లో 9 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేశాం.

- గరుడసేవ నాడు వాహనసేవను తిలకించేందుకు మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్‌, రాంభగీచా విశ్రాంతి గృహం, ఫిల్టర్‌ హౌస్‌ ఇతర ప్రాంతాల్లో కలిపి 28 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం.

- తిరుమలలోని పలు కూడళ్లలో భక్తులకు అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు.

- భక్తులను ఆకట్టుకునేలా శ్రీవారి ఆలయం, జిఎన్‌సి ప్రాంతాల్లో దేవతామూర్తుల ప్రతిరూపాలతో విద్యుద్దీపాలంకరణలు. తిరుమలలోని అన్ని కూడళ్లలో ప్రత్యేకంగా విద్యుత్‌ అలంకరణలు.

- రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తిరుమల, నడకమార్గాల్లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం.

- తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు.

- తిరుమలలో పార్కింగ్‌ ప్రదేశాలు : బాలాజినగర్‌, కౌస్తుభం ఎదురుగా, రాంభగీచా బస్టాండు, ముళ్లగుంత.

- తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌ పాయింట్‌ , శ్రీవారి మెట్టు వద్ద 6 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు.

వసతి :

- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన వసతి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకున్నాం.

- తిరుమలలో సామాన్య భక్తుల కోసం 6,282 గదులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో 1,580 గదులు ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వీటిని 50 శాతానికి తగ్గించడం జరిగింది. విఐపి ఏరియాలో 1,353 గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని గదుల్లో దాదాపు 40 వేల మంది భక్తులు బస చేసే అవకాశముంది.

- పిఏసి -1, 2, 3, 4లలో కలిపి 28 హాళ్లలో దాదాపు 6700 లాకర్లు ఉన్నాయి. దాదాపు 20 వేల మంది భక్తులు బస చేయవచ్చు.

- భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో వసతి పొందలేని భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా విజ్ఞప్తి.

- బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది.

- అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 7 మరియు 8వ తేదీలలో కాటేజి దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు.

- అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలపై గదులు కేటాయించబడదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని మనవి.

ఆరోగ్యశాఖ :

- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అదనంగా 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాం.

- పర్యవేక్షణ సిబ్బంది: గత సంవత్సరం 8 మంది, ఈ సంవత్సరం 49 మందిని (డిఎం & హెచ్ఒ నుండి 20, పిఆర్ శాఖ నుండి 14, మునిసిపల్ యాజమాన్యం నుండి 15) ఏర్పాటు చేశాం.

- వీరు పారిశుద్ధ్య నిర్వహణతో పాటు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద విధులు నిర్వహిస్తారు.

- బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, అన్నప్రసాదం, పాలు, అల్పాహారం వితరణకు ఏర్పాట్లు.

- పులిహోర: 2023లో 1.75 లక్షలు, 2024లో రెండు లక్షలు అందిస్తాం.

- కాఫీ: 2023లో 40 వేలు 2024లో 59 వేలు

- పాలు: 2023లో ఒక లక్ష, 2024లో 1.95 లక్షలు.

- ఉప్మా : 2023లో 2 లక్షలు, 2024లో 2.5 లక్షలు అందించేందుకు చర్యలు చేపట్టాం.

- తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఫుడ్‌ కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు.

- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ.

- కూరగాయల దాతల సహకారంతో రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తాం.

- ప్రతిరోజూ లక్ష మందికి పాలు అందించేందుకు చర్యలు చేపట్టాం.

వైద్యశాఖ :

- భక్తులకు వైద్యసేవలందించేందుకు తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని వైద్యకేంద్రాలు, 6 డిస్పెన్సరీల్లో అదనపు సిబ్బంది ఏర్పాటు. తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకున్నాం.

- తిరుమలలోని ప్రధాన కూడళ్లలో 14 ప్రథమచికిత్స కేంద్రాలు, ఒక మొబైల్‌ క్లినిక్‌.

- ఆలయ నాలుగు మాడ వీధులతో పాటు అన్ని ముఖ్య కూడళ్లలో 12 అంబులెన్సులు.

- 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్‌ సిబ్బంది భక్తులకు సేవలందిస్తారు.

- స్విమ్స్‌, బర్డ్‌, రుయా ఆసుపత్రుల నుండి వైద్యులు అందుబాటులో ఉంటారు.

- భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో హోమియోపతి, ఆయుర్వేద వైద్య శిబిరాలు ఏర్పాటు.

- గుండె సంబంధిత చికిత్సల కోసం తిరుమలలోని అపోలో కార్డియాక్‌ సెంటర్‌లో తగినంత మంది వైద్యులు అందుబాటులో ఉంటారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది.

- అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల వద్ద స్విమ్స్‌ వైద్యులతో కార్డియాక్‌ స్క్రీనింగ్‌ సెంటర్లు ఏర్పాటు.

ప్రజాసంబంధాల విభాగం :

- శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులకు తెలియజేసేందుకు మీడియాసెంటర్‌ ఏర్పాటు.

- సమాచార కౌంటర్లు: భక్తుల సౌకర్యార్థం గత ఏడాది 5 కౌంటర్లు ఉండగా, ఈ సంవత్సరం 12, అంటే 7 అదనంగా (తిరుమలలో 5, తిరుపతిలో 2) ఏర్పాటు చేశాం.

- ఇందులో తిరుమలలోని జిఎన్‌సి, సిఆర్వో, ప్రధాన కల్యాణకట్ట, భజనమందిరం, ఎటిసి సమాచార కేంద్రాలతో పాటు ఈ ఏడాది అదనంగా పిఏసి`2, విజివో కార్యాలయం సమీపంలో, రాంభగీచ అతిథి గృహం వద్ద, మ్యూజియం వద్ద, ఆర్‌టిసి బస్టాండ్‌ ఎదురుగా టీటీడీకి సంబంధించిన సమాచారాన్ని కరపత్రాలలో ముద్రించి భక్తులకు అందుబాటులో ఉంచడమైనది.

- శ్రీవారి సేవ: 2023లో 3 వేల మంది సేవలందించగా, 2024లో 4 వేల మంది, అదనంగా 1000 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు.

- దూరదర్శన్‌, ఆకాశవాణితోపాటు ఇతర ప్రసార మాధ్యమాలలో బ్రహ్మోత్సవాల ప్రసారం.

- టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందించే ఏర్పాటు. కాల్‌ సెంటర్‌ నంబరు: 155257.

- భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఈ`మెయిల్‌ :

helpdesk.ttd@tirumala.orgను అందుబాటులో ఉంచాం.

రవాణా శాఖ :

- గరుడసేవ రోజున 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లను తెరిచి ఉంచడం జరుగుతుంది.

- బ్రహ్మోత్సవాల రోజుల్లో రోజుకు దాదాపు 2 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పిస్తాం.

- తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు 24 గంటల పాటు ఉచిత బస్సుల ఏర్పాటు.

- ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం.

- ఇందులోభాగంగా సాదారణ రోజుల్లో 8 ప్రాంతాల్లో, గరుడ సేవనాడు 12 ప్రాంతాలలో క్రేన్లు, ఆటోమొబైల్‌ క్లినిక్‌ వాహనాలు ఏర్పాటు.

హిందూ ధర్మప్రచార పరిషత్‌ /అన్నమాచార్య ప్రాజెక్టు/ దాససాహిత్య ప్రాజెక్టు :

- హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, అస్సాం మొదలైన 21 రాష్ట్రాల నుండి వచ్చే కళాబృందాలతో వాహనసేవల్లో ప్రదర్శనలు.

- 2023లో 12 రాష్ట్రాల నుండి కళాబృందాలు పాల్గొనగా, 2024లో 21 రాష్ట్రాలు (19 రాష్ట్రాలు ఇప్పటికే రూఢీ అయ్యాయి )

- మొత్తం 160 బృందాలు రానున్నాయి.

- తిరుమలలో ఆస్థానమండపం, నాదనీరాజనం వేదికతోపాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ఆధ్యాత్మిక, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు.

- బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు జిల్లా యంత్రాంగం తమవంతు సహకారం అందిస్తోంది.

గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు

- శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 8న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు.

- దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవిందనిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తాం.

- గరుడసేవ రోజున 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు, శ్రీవారి మెట్టు మార్గం తెరిచి ఉంచడం జరుగుతుంది.

- గరుడ వాహనాన్ని సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా రాత్రి 11 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతాం.

- బయట వేచి ఉండే భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలి. అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తాం.

- భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేయడమైనది.

పార్కింగ్ -

- తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌ పాయింట్‌ వద్ద రెండు వేల టూ వీలర్లు, వినాయక్‌నగర్‌ క్వార్టర్స్‌, నెహ్రూ మున్సిసల్‌ గ్రౌండ్‌, భారతీయ విద్యాభవన్‌, దేవలోక్‌ల వద్ద ఉన్న గ్రౌండ్‌లలో 4 వీలర్లు, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కూడా పార్కింగ్‌ ఏర్పాట్లు.

- తిరుపతిలోని పార్కింగ్‌ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లేలా ఆర్‌టిసి బస్సులను ఏర్పాటుచేశాం.

- ఆర్‌టిసి బస్సుల్లో దాదాపు 3 వేల రౌండ్‌ ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు తీసుకున్నాం.

- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 7 నుండి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తాం.

- భక్తుల కోసం పులిహోర, టమోటా బాత్‌, బిసిబెళా బాత్‌ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు అందిస్తాం.

- వాహనాలపై చిల్లర నాణేలు విసరవద్దని మరొకసారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

చక్రస్నానం ఏర్పాట్లు

- శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం. దీని మ‌హ‌త్యం రోజంతా ఉంటుంది. కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని మనవి. సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

- భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశాం.

- భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లతోపాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచాం.

ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీర బ్రహ్మం,

సివిఎస్ఓ శ్రీధర్, సి శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story