ఏపీలో ప్రాజెక్టులన్నీ రూ. 20వేల కోట్లతో రెడీ...
x
ఆలోచనా పరుల మీడియా సమావేశం

ఏపీలో ప్రాజెక్టులన్నీ రూ. 20వేల కోట్లతో రెడీ...

మీడియా సమావేవంలో ఆలోచనా పరుల వేదిక ప్రజలకు, పాలకులకు వినతి


రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ అన్న దాతను ఆదుకోవాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచనా పరుల వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, నీటిపారుదల ప్రాజెక్టుల అధ్యయన, విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ, నీటిపారుదల రంగ నిపుణులు జొన్నలగడ్డ రామారావు పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నదీ జలాలపై ఆధారపడి నిర్మించిన, నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు రాసిన లేఖను విడుదల చేస్తూ విలేకరులతో మాట్లాడారు.

కరువు పీడిత ప్రాంతాలకు ఉపయోగం లేని పథకాలు

పోలవరం - బనకచెర్ల ఎత్తిపోతల పథకం, గత ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల కరవు పీడిత రాయలసీమకు ఏ మాత్రం ప్రయోజనం లేదని, వాటిని విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణా జలాలనే పూర్తి స్థాయిలో అందజేయాలన్నారు. కేవలం రిజర్వాయర్స్ లో నీటిని నింపడం ద్వారా ప్రయోజనం ఉండదని, ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరా భూమి వరకు నీటిని అందించినప్పుడే పూర్తి స్థాయిలో ప్రయోజనాలు వానగూడుతాయని వ్యాఖ్యానించారు. కేవలం రూ. 20వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు.

రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పది లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని, పది లక్షల మందికి స్థిరమైన ఉపాధి లభిస్తుందని, పదుల వేల కోట్ల సంపద ఉత్పత్తి అవుతుందని, ప్రభుత్వం ఈ దృష్టితో ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని కోరారు. ఎన్టీఆర్ ప్రభుత్వం, నాటి ప్రముఖ ఇంజనీర్ రామకృష్ణయ్య చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారని, ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రభుత్వాల్లో ఆ చిత్తశుద్ధి లోపించిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి వెచ్చించిన రు.500 కోట్లు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఖర్చు చేసిన రు.750 కోట్ల ప్రజాధనం వృథా అయిపోయిందని మరొక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. రుషికొండ ప్యాలెస్ ను మెంటల్ హాస్పిటల్ కు, లేదా, ఐటి పరిశ్రమలకు వినియోగిస్తే మేలని ప్రభుత్వానికి సూచించారు. మరొక ప్రశ్నకు సమాధానంగా కృష్ణా జలాలపైనే ప్రధానంగా ఆధారపడిన రాయలసీమలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమే సముచితమని చెప్పారు.


పోలవరం - సోమశిల - కావేరి ఆనకట్ట అనుసంధానం సమర్థనీయం

గోదావరి - కావేరి నదుల అనుసంధాన పథకాన్ని ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలన్న జాతీయ నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిపాదనను తాజాగా హైదరాబాదులో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించి, పోలవరం - సోమశిల - కావేరి ఆనకట్ట అనుసంధాన పథకంగా చేపట్టాలని ప్రతిపాదించడం సమర్థనీయమని సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకులు టీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. గోదావరి నీటిని పోలవరం జలాశయం నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరందిస్తూ, నాగార్జున్ సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ ఆయకట్టు స్థిరకరణ, వెలిగొండ ప్రాజెక్టు కింద, ప్రకాశం జిల్లాలో నూతన ఆయకట్టుకు, సోమశిల, కండలేరు రిజర్వాయర్ల కింది ఆయకట్టుకు అందించాలని, తద్వారా ఆదా అయ్యే కృష్ణా నదీ జలాలను శ్రీశైలం రిజర్వాయరు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు గ్రావిటీ మీద అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

బచావత్ ట్రిబ్యునల్ ఛత్తిస్గడ్ కు కేటాయించిన 148 టియంసిల ఆధారంగా ఈ పథకాన్ని నిర్మిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీ చెబుతుంటే, ఛత్తిస్గడ్ ప్రభుత్వం తిరస్కరించింది. గంగా - కావేరి నదుల అనుసంధాన పథకంలో భాగంగా గంగా - మహానది, మహానది - గోదావరి (పోలవరం) అనుసంధానం చేయకుండా గోదావరి - కావేరి అనుసంధాన పథకాన్ని ఇచ్చంపల్లి నుంచి చేపడితే బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరంకు నికర జాలాల లభ్యత బాగా తగ్గి, ప్రమాదం ముంచుకొస్తుందన్న ఆందోళన లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు.

రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు ఎందుకు నింపలేకపోయారు

సాగునీటి శాఖాధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 80శాతం నీటి నిల్వ చేయడం పట్ల ముఖ్యమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ, దాదాపు రెండు నెలలుగా శ్రీశైలం జలాశయం నిండుగా ఉన్నా, వందలాది టియంసీలు కిందికి ప్రవహిస్తున్నా, రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లను ఎందుకు నింపలేకపోయారో ఆలోచించాలన్నారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఎస్సార్బీసికి కీలకమైన గోరకల్లు నిల్వ సామర్థ్యం 11.5 టియంసిలకు 8 టియంసిలు, గండికోట 26.8 టియంసిలకు 20 టియంసిలు, బ్రహ్మసాగర్ సామర్థ్యం 17 టియంసిలకు 8 టియంసిలు, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో 150 టియంసిలకు 100 టియంసిల వరకే నింపారు.

ఆయా రిజర్వాయర్ల నిల్వలలో గత ఏడాది తరలించిన కృష్ణా నీళ్ళలో వాడుకోలేని నీళ్ళు కూడా ఉన్నాయని గమనించాలన్నారు. శ్రీశైలం నుంచి రిజర్వాయర్లకు నీటిని తరలించినా ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం, ప్రధాన కాలువలు, పంట కాలువల వ్యవస్థను నిర్మించకపోవడం, వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద మరమ్మతులు చేయకపోవడం పర్యవసానంగా నీళ్ళున్నా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదని విమర్శించారు.

గడచిన రెండు నెలల వ్యవధిలో దాదాపు 450 టియంసీలు ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలోకి వెళ్ళాయని, వైకుంఠాపురం రిజర్వాయరును 20 టియంసీల సామర్థ్యంతో నిర్మిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీనికి గతంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రిజర్వాయరు నిర్మాణానికి సత్వరం చర్యలు చేపట్టాలని అక్కినేని భవానీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టుల పర్యటనలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కృష్ణమూర్తినాయుడు, విద్యావేత్త నల్లమోతు చక్రవర్తి, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, పలువురు నాయకులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కెవివి ప్రసాద్, సిపిఐ, పలు ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు ఆగస్ట్ 4 నుంచి 6 వరకు జరిగిన ప్రాజెక్టుల పర్యటనలో పాల్గొన్నారని టి లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు.

Read More
Next Story