రైస్ మిల్లు దారిలో రైతు జేబుకు చిల్లు
x

రైస్ మిల్లు దారిలో రైతు జేబుకు చిల్లు

రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎంఎస్పీ పేరుకు మాత్రమే. రైతు సేవా కేంద్రాల నుంచి మిల్లులకు వెళుతున్న ధాన్యంలో రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు.


రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అలా ఉంచితే కనీస మద్దతు ధర (msp) రావటం లేదు. ఈ విషయాన్ని రైతులే స్వయంగా చెబుతున్నారు. కృష్టా జిల్లా రైతులు ఈ విషయం ఈనెల 20న ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఎదుటే నేరుగా చెప్పారంటే ధాన్యం పండిస్తున్న రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పండించటానికి పడిన కష్టం ఒకెత్తయితే.. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి పడే కష్టం మరో ఎత్తు. విత్తు పోకుండా రైతుల నుంచి కొంటామంటున్న ప్రభుత్వం ఏ మాత్రం కొనుగోలు చేసిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. గత సంవత్సరం 12.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఈ ఏడాది 21.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులు పండించిన పంట మాత్రం 85 లక్షల మెట్రిక్ టన్నులుగా వ్యవసాయ శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి. అంటే నాలుగో వంతు కూడా రైతుల నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు.

ఈ సంవత్సరం కరీఫ్ లోనూ రైతులు నష్టపోయారు. చలికాలంలోనూ అకాల వర్షాల కారణంగా వరి పంట దెబ్బతిన్నది. ఇటీవల కురిసిన వర్షాలకు తీర ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో వరి ధాన్యం పూర్తిగా తడిసి కొన్ని చోట్ల మొక్కలు కూడా వచ్చింది. ఈ విషయం రైతులు వివిధ ప్రచార సాధనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు పోగలిగారు. అయినా రైతు సేవా కేంద్రాల నుంచి గింజ పోకుండా కొనుగోలు చేస్తామంటున్న ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ప్రైవేట్ వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి గింజ ఆరలేదంటూ క్వింటాలుకు వెయ్యి ఇచ్చి కొనుగోలు చేశారు. సాధారణంగా రూ. 1400లు 75 కేజీల బస్తాకు వ్యాపారులు ఇస్తున్నారు. అవి కూడా తగ్గిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రైస్ మిల్లర్లు ఎలా మోసం చేస్తున్నారంటే..

రైస్ మిల్లుల్లో తేమ శాతం పేరు చెప్పి రైతులు తీసుకు వెళుతున్న వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500లు తగ్గించి ఇస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటున్నందున ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వలేమని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధాన్యాన్ని తీసుకుంటున్న మిల్లర్లు తేమ శాతం ఎక్కువగా ఉందని, మీరు తగ్గించి చెబుతున్నారని అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం ఒక విధంగా కొలుస్తుంటే, మిల్లుల్లో మరో విధంగా తేమ శాతం కొలుస్తున్నారు. ఎంఎస్పి క్వింటాలుకు రూ. 2300లుగా ఉంది. అయితే బయటి వ్యాపారులు రూ. 1900లకు మించి ఇవ్వటం లేదు. అంటే కేజీ వరి ధాన్యం ధర రూ. 19లు కూడా పడటం లేదు. కానీ వరి బియ్యం ధర నేడు దుకాణాల్లో రూ. 65 నుంచి 72ల వరకు ఉంది. ఇంత దారుణమా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

సీఎం చెప్పినా వినరా?

లోపం ఎవరిలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న కృష్టా జిల్లా గంగూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో నేరుగా ముచ్చటించారు. క్వింటా వరిధాన్యం ధర ఎలా ఉందనే వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2300లు ఇవ్వాల్సి ఉండగా తేమ శాతం ఎక్కువగా ఉందని మిల్లర్లు రూ. 1900లు మాత్రమే ఇస్తున్నారని, అధికారులు కూడా తామేమీ చేయలేమనే ధోరణిలో చేతులెత్తేస్తున్నారనే విషయం చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి నేరుగా తన ముందు ఆ రోజు వచ్చిన వరి ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో మిషన్ పై చెక్ చేయించారు.14.2శాతంగా నమోదైంది. అదే రోజు ఆ ధాన్యం మిల్లులో చెక్ చేస్తే 14.6శాతంగా నమోదైంది. ఇదేమిటని ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఆ మిల్లుపై కానీ, అధికారులపై కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తేమ శాతం ఎక్కువ చూపించి రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి.

మిల్లర్లు, అధికారులు కుమ్మక్కయ్యారా...

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ప్రభుత్వం అమ్ముతోంది. అదే ధాన్యం నుంచి మిల్లింగ్ చేసిన రైస్ ను ప్రభుత్వం మిల్లర్ల నుంచి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా కొనుగోలు చేస్తోంది. ఇందులో కల్తీ జరుగుతోందని ఇటీవల జరిగిన ఎంక్వయిరీల్లో తేలింది. సివిల్ సప్లైస్ రైస్ ను రీ సైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నట్లు తేలింది. అయినా ఈ వ్యవహారంపై కూడా ఎటువంటి చర్యలు లేవు. కంటి తుడుపుగా కాకినాడలో ఒకటీ రెండు మిల్లులపై చర్యలు తీసుకుని వదిలేశారు.

కుమ్మక్కు రాజకీయాలే కారణమా...

రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం వల్ల అధికారుల, మధ్య దళారులు ఒక్కటై రైతులను నిలువునా ముంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లేకుంటే రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించకుండా పోతోందంటే అందుకు పాలకులే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్ గోడౌన్ లలో పెట్టిన వేల టన్నుల బియ్యం కనిపించకుండా పోతున్నాయి. కానీ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదు. ఒకపక్క రైతులు పండించిన పంటకు కేజీకి రూ. 19 లు ఇస్తున్నారు. అవే ధాన్యం మిల్లింగ్ చేస్తే అర కేజీ బియ్యం వస్తాయి. అరకేజీ బియ్యం ఖరీదు రూ. 35లుగా ఉంది. అంటే రైతులు ఎంత భారీగా నష్ట పోతున్నారో అర్థం చేసుకోవాలి. పైగా మిల్లర్ తవుడు, పొట్టును కూడా అమ్ముకుంటాడనే విషయం ప్రభుత్వానికి తెలుసు. ఈ దోపిడీని అరికట్టాలంటే దళారులు, మిల్లర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కు కాకుండా ఉండాలి. అప్పుడే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది.

ప్రతి గింజా రైతు నుంచి ప్రభుత్వం కొనాలి

పండిన ప్రతి గింజా రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో మిల్లర్లు రైతు సేవా కేంద్రాల నుంచి ధాన్యం తీసుకునేందుకు ముందుకు రావడం లేదని, దీంతో రైతులు మిల్లర్లను ఒప్పించుకోవాలంటూ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 17 శాతం తేమ ఉన్నా ధాన్యాన్ని ఎంఎస్స్పీ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలనే నిబంధన ఉందన్నారు. సీఎం ముందే తేమ శాతంలో మిల్లుకు, రైతు సేవా కేంద్రం వారికి వ్యత్యాసం ఉందంటే ఇది అధికారులు, దళారులు, మిల్లర్లు కలిసి ఆడుతున్న నాటకమన్నారు. అందుకే స్థానికంగా ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని రైతులు పండించిన పంట నంతా కొనుగోలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం కంటే త్వరగా రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బులు అందుతున్నాయని, ఇది మంచి పరిణామమన్నారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులకు ప్లాట్ ఫారాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. వర్షాల కారణంగా కల్లాలు, రోడ్ల పక్క ఆరబోసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.

Read More
Next Story