111 జీవో పరిధిలోని  అక్రమనిర్మాణాలన్నీ సేఫ్
x

111 జీవో పరిధిలోని అక్రమనిర్మాణాలన్నీ సేఫ్

111 జీవో పరిధిలో ఉంది కాబట్టి జన్వాడ ఫాంహౌస్ ను తాము ఏమీచేయలేమని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ స్పష్టంగా చెప్పారు.


111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు. 111 జీవో పరిధిలో ఉంది కాబట్టి జన్వాడ ఫాంహౌస్ ను తాము ఏమీచేయలేమని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ స్పష్టంగా చెప్పారు. అక్రమనిర్మాణాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనవంతుల ఇళ్ళు, ఫామ్ హౌసులు, కట్టడాల జోలికి హైడ్రా వెళ్ళటంలేదన్నది వాస్తవం కాదని చెప్పారు. రంగనాధ్ ఎంత సమర్ధించుకుందామని చూస్తున్నా ఆయన ఆలోచన ఏమిటో అందరికీ అర్ధమైపోతోంది. ఎందుకంటే 111 జీవో పరిధిలో ఉన్న అక్రమినిర్మాణాల జోలికి తాము వెళ్ళలేమని రంగనాధ్ చేతులెత్తేసిన విషయం స్పష్టమైపోయింది. 111 జీవో అంటేనే మ్యాగ్జిమమ్ అక్రమనిర్మాణాలుగా చాలా ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే.

హైడ్రా కూల్చివేతలు మొదలైన తర్వాత సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేసింది. వెంటనే జన్వాడ ఫాంహౌసు అంశం బాగా ప్రచారంలోకి వచ్చింది. శంకరపల్లి జన్వాడ గ్రామంలోని ఫాంహౌస్ అనగానే అందరికీ తెలిసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే. ఎందుకంటే జన్వాడలో ఫాంహౌస్ లో ఉంటున్నది కేటీఆర్ మాత్రమే. అందుకనే జన్వాడ ఫాంహౌస్ అంతగా పాపులరైంది. దాంతో జన్వాడ ఫాంహౌస్ ను కూడా హైడ్రా కూల్చేయబోతోందనే ప్రచారం బాగా పెరిగిపోయింది. దానికి తగ్గట్లే కేటీఆర్ కూడా ఫాంహౌస్ ను ఖాళీ చేసేశారు. ఇంకేముంది ఈరోజో రేపో ఫాంహౌస్ కూలిపోవటం ఖాయమని జనాలు అనుకున్నారు. దానికి తగ్గట్లే ఇరిగేషన్, రెవిన్యు శాఖల సిబ్బంది ఒకటికి రెండుసార్లు ఫాంహౌస్ లో సర్వేలు జరిపారు. ఫాంహౌస్ లో సర్వేలు చేసిన సిబ్బంది కాల్వను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించారని నిర్ధారించారని కూడా వార్తలు వచ్చాయి. దాంతో ఫాంహౌస్ ను హైడ్రా ఎప్పుడు కూలుస్తుందాని ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో హైడ్రా కమిషనర్ రంగనాధ్ మాట్లాడుతు జన్వాడ ఫాంహౌస్ 111 జీవో పరిధిలో ఉంది కాబట్టి దానిజోలికి వెళ్ళటంలేదన్నారు. ఎందుకంటే 111 జీవో పరిధిలోని నిర్మాణాలు తమ పరిధిలోకి రావన్నారు. రంగనాధ్ చెప్పింది నిజమే అయితే 111 జీవో పరిధిలోని అక్రమనిర్మాణాల్లో దేన్ని కూడా హైడ్రా కూల్చే అవకాశంలేదు. 111 జీవో పరిధి అంటే ఆరుమండలాల్లోని 1.32 లక్షల ఎకరాలు వస్తాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ళ, షాబాద్, శంకర్ పల్లి మండలాల్లోనే వేలాది అక్రమనిర్మాణాలున్నాయి. వీటిల్లోనే రాజకీయ, ఇతర రంగాల్లోని ప్రముఖుల ఫాంహౌసులున్న విషయం అందరికీ తెలుసు. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించేసుకుని ఇష్టారాజ్యంగా ఫాంహౌసులు కట్టేసుకోవటమే కాకుండా మరికొందరు ప్రభుత్వ భూములను కూడా కబ్జాచేశారు.

ఎవరెవరికి ఎక్కడెక్కడ ఫాంహౌసులున్నాయి ? ఎంతెంత విస్తీర్ణంలో ఫాంహౌసులున్నాయి ? చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసిన రాజకీయ ప్రముఖుల ఫాంహౌసులను రాజకీయపార్టీలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వైరల్ చేస్తున్నాయి. తాజాగా రంగనాధ్ చెప్పిన ప్రకారమైతే ఈ ఫాంహౌస్ లన్నీ సేఫనే అనుకోవాలి. ఎందుకంటే 111 జీవో పరిధి హైడ్రా పరిధిలోకి రాదుకాబట్టి ఏ అక్రమనిర్మాణం జోలికీ హైడ్రా వెళ్ళదు. కాబట్టి ప్రతి అక్రమనిర్మాణమూ సేపని అర్ధమైపోతోంది. మరి హైడ్రా బుల్డోజర్లు ఎవరిమీద ప్రతాపం చూపిస్తాయి ? ఎవరిమీదంటే పేద, మధ్య, ఎగువ తరగతి జనాల ఇళ్ళమీద మాత్రమే అన్న విషయంలో క్లారిటి వచ్చేసింది.

Read More
Next Story