అందరి చూపు సుప్రీం కోర్టు వైపు
x

అందరి చూపు సుప్రీం కోర్టు వైపు

వల్లభనేని వంశీ జైలు జీవితంలో బుధవారం రోజు గుర్తుండిపోయే రోజుగా మిగిలిపోనుంది.. ఎందుకంటే?


తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ విజయవాడ జైలు నుంచి బుధవారం విడుదల అవుతారా? లేకుంటే.. వంశీని జైలు నుంచి విడుదల కాకుండా సుప్రీం కోర్టు ఏమైనా అడ్డుకట్ట వేస్తుందా? అనేది అటు వైసీపీ శ్రేణుల్లోను, ఇటు కూటమి వర్గాల్లో తీవ్ర చర్చగా మారగా.. వంశీ కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు మాత్రం తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో రేపటి సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. వంశీ మీద కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసులన్నింటిలోను బెయిలు మంజూరు చేయగా.. అక్రమ మైనింగ్‌ కేసులో మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు రేపు బుధవారం విచారణకు రానుంది.

మరో వైపు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మంగళవారం నూజివీడు కోర్టు వంశీకి బెయిలు మంజూరు చేసింది. దీంతో వంశీని బుధవారం విడుదల కావలసి ఉంది. ఇదే బువారం రోజు వంశీ బెయిలును రద్దు చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది? వంశీ పట్ల సానుకూలంగా స్పందిస్తుందా? బెయిల్‌ రద్దు చేయాలని తీర్పును వెలువరిస్తుందా? అనేది దానిపై భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తీర్పు అటు పాజిటివ్‌గా వచ్చినా.. ఇటు వ్యతిరేకంగా వచ్చినా 2025 జూలై 2 బుధవారం అనేది వల్లభనేని వంశీ జైలు జీవితంలో ఓ గుర్తుండి పోయే రోజుగా మిగిలిపోనుంది.
వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అక్కడకు వెళ్లి ఫిబ్రవరి 13న అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. నాటి నుంచి నేటి వరకు ఆయన రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లోనే ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు తర్వాత సత్యవర్థన్‌ కిడ్పాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులతో పాటు మొత్తం 10కిపైగా కేసులు వంశీ మీద నమోదు చేశారు. ఇప్పటి వరకు అతని మీద నమోదైన కేసులన్నింటీలోను బెయిల్‌ మంజూరు చేశారు. అయితే అక్రమ మైనింగ్‌ కేసుకు సంబంధించి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీని మీద బుధవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
Read More
Next Story