అందరి చూపులు మండలిపైనే–మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
x

అందరి చూపులు మండలిపైనే–మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలు కానున్నాయి. అధికార పక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో హాజరు కానున్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఈ సమావేశాలకు డుమ్మా కొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా గుర్తించకుండా అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరుపై ఇది వరకే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శాసన మండలికి మాత్రం హాజరకానుండగా, సభకు మాత్రం గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పాటుగా ఇదే సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులుపై చర్చించి వాటిని ఆమోదించేందుకు గురువారం మంత్రి వర్గ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో మంత్రులు ఎలా వ్యవహరించాలి, ప్రతిపక్షాలను ఎలా ధీటుగా ఎదుర్కోవాలనే దానిపైన కేబినెట్‌లో చర్చించనున్నారు.

అయితే సుమారు వారం రోజుల నుంచి పది రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనల్లో అధికార పక్షం ఉన్నట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సభ ప్రారంభం కాగా, మరి కొద్ది నిముషాల్లో మండలి మొదలు కానుంది. వైసీపీ మండలికి హాజరు కానున్న నేపథ్యంలో శాసన సభలో కంటే మండలి సమావేశాలు రసవత్తరంగా జరగనున్నాయి. ప్రశ్నోత్తరాలతోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరో వైపు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలు ఏయే అంశాలపై బయట మీడియాతో మాట్లాడాలి, వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై దిశానిర్థేశం చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సమావేశాల్లో ఆరు ఆర్డినెన్స్‌లకు బదులుగా బిల్లులు తేవాలని అధికార పక్షం భావిస్తోంది. పంచాయతీరాజ్‌ సవరణ, మున్సిపల్‌ చట్టాల సవరణ, ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహనాల పన్నులుతో పాటు ఎస్సీ వర్గీకరణ, ది ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆఫ్‌ ది బార్‌ కౌన్నిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ ఎట్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆర్డినెన్స్‌ 2025కు బదులు బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అంతేకాకుండా సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు పీ4, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, మెగా డీఎస్సీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి సుమారు 20కిపైగా అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలనే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజులు ఇప్పటికే అధికారులతో చర్చించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read More
Next Story