Liquor: ఆంధ్రాలో మందు మజా.. మళ్లీ రంజుగా!
x

Liquor: ఆంధ్రాలో మందు మజా.. మళ్లీ రంజుగా!

వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం.


మద్యం కేసులు తగ్గించాలంటే పర్మిట్ రూములు ఉండాలంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు అనుమతి లేకుండా తాగినందుకు కేసులు పెట్టారు. ఇకపై కేసులు ఉండవు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇక మందే మందు.. ఎక్కడికో పోయి గుట్టుచప్పుడు కాకుండా తాగాల్సిన పనే లేదు. వైన్ షాపులోనే గబుక్కున కొనుక్కుని గుటుక్కున తాగవచ్చు.. ఇదేమిటనుకుంటున్నారు కదూ.. మందు తాగి మత్తులో అల్లర చిల్లర పనుల్ని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనిపెట్టిన కొత్త అస్త్రం పర్మిట్ రూమ్ ల మంజూరు. మందును మందుతోనే కొట్టడమంటే ఇదే కాబోలు.

ఏపీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతున్న దశలో ఆంధ్రాలో మద్యం ప్రియుల కథ తారాస్థాయికి చేరనుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, ఏకంగా ఇప్పటి వరకు 2.7 లక్షల కేసులు నమోదయ్యాయని రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. బోలెడంత సేపు చర్చించింది. చివరకు ఈ సమస్యను అదుపు చేయడానికి ఏపీ మంత్రివర్గం ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! ఇది మద్యం వ్యాపారానికి కొత్త ఊపిరి లాంటిది. కానీ ఈ నిర్ణయం వెనుక ఉన్న గణాంకాలు, టర్నోవర్ అంచనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వైన్ షాపులు ఎన్ని ఉన్నాయో తెలుసా?

2024 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ కింద 3,736 వైన్ షాపులు నోటిఫై చేశారు. ప్రైవేటు డీలర్లకు అప్పగించారు. వైఎస్ జగన్ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వం నిర్వహించగా చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటు వారికి అప్పగించింది. ఈ 3,736 షాపులలో 12 ప్రీమియం షాపులు కూడా ఉన్నాయి. ఇవి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి పెద్ద నగరాల్లో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందిస్తాయి.


మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు

నెలవారీ టర్నోవర్ ఎంతంటే...?

ప్రతి వైన్ షాపు ఏడాదికి సగటున 6 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుందని అంచనా. దీన్ని నెలవారీగా విభజిస్తే, ఒక్కో షాపు నెలకు సుమారు 50 లక్షల నుంచి 83 లక్షల రూపాయల టర్నోవర్‌ను సాధిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,736 షాపులు కలిపి నెలకు దాదాపు 18,680 కోట్ల నుంచి 31,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను రాబడుతున్నాయని అంచనా వేయవచ్చు. ఈ లెక్కలు 20 శాతం రిటైలర్ మార్జిన్‌పై ఆధారపడి ఉన్నాయి. ఇది IMFL, బీర్, వైన్, రెడీ-టు-డ్రింక్ బాటిల్స్‌పై లభిస్తుంది.

పర్మిట్ రూముల రాకతో డీలర్లకి పండగే పండగ...

2019లో పర్మిట్ రూమ్‌లను తొలగించినప్పుడు మద్యం వినియోగం 27 శాతం (IMFL), 56.4 శాతం (బీర్) తగ్గింది. ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో మద్యం తాగడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు పర్మిట్ రూమ్‌లను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల వినియోగం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఒక్కో షాపుకు 5 లక్షల రూపాయల అదనపు లైసెన్స్ ఫీజుతో పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతించినట్లు విశ్వసనీయ సమాచారం.

పర్మిట్ రూమ్‌ల వల్ల టర్నోవర్ 15-25 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం వల్ల ఉత్పన్నమైన 2.7 లక్షల కేసులను నియంత్రించడానికి ఉపయోగ పడుతుంది. వినియోగదారులు పర్మిట్ రూమ్‌లలో తాగడానికి ఆకర్షితులవుతారు. ఒకవేళ 20 శాతం టర్నోవర్ పెరిగితే, రాష్ట్ర వ్యాప్తంగా నెలవారీ టర్నోవర్ 22,416 కోట్ల నుంచి 37,200 కోట్ల రూపాయలకు చేరవచ్చు. ఇది రాష్ట్ర ఆదాయానికి, అలాగే రిటైలర్ల లాభాలకు ఊపు ఇస్తుంది.

బార్లకు బ్రేక్, పర్మిట్ రూమ్‌లకు బూస్ట్!

ఈ కొత్త పాలసీతో బార్ల వ్యాపారానికి కాస్త గండిపడినట్లే! గతంలో బార్లు హోటళ్లు, రెస్టారెంట్లు హాయిగా లాభాలు ఆర్జించాయి. కానీ ఇప్పుడు వైన్ షాప్ పర్మిట్ రూమ్‌లు ఆ స్థానాన్ని ఆక్రమిస్తాయి.

ఊహించండి... ఒక సాయంత్రం విశాఖపట్నం సముద్రతీరంలో.. ఒక వైన్ షాప్ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లో మద్యం ప్రియులు బీర్‌తో చల్లగా రిలాక్స్ అవుతున్నారు. ఇది కేవలం మద్యం తాగడం కాదు, ఒక కొత్త సోషల్ హబ్ లాంటిది! కానీ ఈ పర్మిట్ రూమ్‌లు బహిరంగ ప్రదేశాల్లో గొడవలను తగ్గిస్తాయా? లేక కొత్త సమస్యలను తెచ్చిపెడతాయా? వైన్ షాప్స్ అంటేనే వైలెన్స్ కు కేంద్రాలు. అందులోనూ షాపు పక్కనే తాగటం.

రాష్ట్రానికి లాభం, మద్యం ప్రియులకు హాయి!

ఈ కొత్త ఎక్సైజ్ పాలసీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకి 5,500 కోట్ల రూపాయల రెవెన్యూ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈ ఆదాయం నెలకి 3,600 కోట్లుగా ఉంది. దీన్ని పెంచేందుకు పర్మిట్ రూమ్‌ల అదనపు ఫీజు కూడా ఒక భాగం. 3,736 వైన్ షాపులు నెలకు కోట్లాది రూపాయల టర్నోవర్, పర్మిట్ రూమ్‌లతో వచ్చే అదనపు బూస్ట్‌తో రాష్ట్ర ఖజానాకు లాభం. రిటైలర్లకు లాభం. వినియోగదారులకు కొత్త హ్యాంగౌట్ స్పాట్ దొరికినట్లే! కానీ ఈ మద్యం మజా సమాజంలో శాంతిభద్రతలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. మీరు ఈ కొత్త పర్మిట్ రూమ్‌లను ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నారా...

840 బార్లు

2025-28 బార్‌ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 840 బార్లను లాటరీ విధానంలో కేటాయిస్తారు. ఒక్కో బార్‌కి కనీసం నాలుగు దరఖాస్తులు రావాలి. బార్లలో 10 శాతం కల్లుగీత కులాల వారికి కేటాయించాలని నిర్ణయించారు. 50వేల వరకు జనాభా ఉన్నచోట్ల రూ.35లక్షలు, 50వేల నుంచి 5 లక్షలలోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.75లక్షలు లైసెన్స్‌ ఫీజుగా నిర్ణయించారు. గీతకులాలకు కేటాయించే బార్లకు 50 శాతమే ఫీజు ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉంటాయి.

ఇక మందుబాబులకు మందే మందు. షాపు వద్దే మందు తాగొచ్చు, చిందేయవచ్చు..

Read More
Next Story