
విజయవాడలో ’అక్షర జాతర‘
జనవరి 2 నుంచి 36వ పుస్తక మహోత్సవం. 300 స్టాళ్లతో భారీ ఏర్పాట్లు చేపట్టారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడలో మరోసారి పుస్తకాల పండగ సందడి మొదలవ్వనుంది. గత 35 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవం ఈ ఏడాది మరింత ఆకర్షణీయంగా, వైవిధ్యంగా రూపుదిద్దుకుంది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జనవరి 2 నుంచి 11 వరకు ఈ అక్షర యజ్ఞం జరగనుంది. ఈ మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ హాజరుకానుండటం విశేషం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా దీనిని ప్రారంభోత్సవం చేయనున్నారు.
గతేడాది విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రముఖుల స్మరణార్థం వేదికల నామకరణం
ఏటా సాహిత్య రంగంలో కృషి చేసిన వారిని గుర్తు చేసుకునే సంప్రదాయంలో భాగంగా, ఈసారి ప్రదర్శన ప్రాంగణానికి వడ్లమూడి విమాలాదేవి పేరును ఖరారు చేశారు. అలాగే ప్రధాన సాహిత్య వేదికకు ప్రముఖ మనస్తత్వవేత్త, రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ పేరును, ప్రతిభా వేదికకు ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత నార్లీకర్ పేరును పెట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
గతేడాది విజయవాడ పుస్తక ప్రదర్శనలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
పెరిగిన స్టాళ్లు.. భారీ రాయితీలు
పుస్తక ప్రియుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈసారి స్టాళ్ల సంఖ్యను భారీగా పెంచారు. గత ఏడాది 200 స్టాళ్లు ఉండగా, ఈసారి వాటిని 300లకు పెంచారు. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలన్నీ తమ తాజా ప్రచురణలతో ఇక్కడ కొలువుదీరనున్నాయి. ఈ ప్రదర్శన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఎక్కడా పాత పుస్తకాలు కనిపించవు; కేవలం కొత్తగా అచ్చైన వైవిధ్యభరితమైన పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, కొనుగోలు చేసే ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీని అందిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ(వీబీఎఫ్) అధ్యక్షుడు టి.మనోహర్‌నాయుడు, కార్యదర్శి కే లక్ష్మయ్య ’ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‘ ప్రతినిధికి తెలిపారు.
వైవిధ్యభరితమైన కార్యక్రమాలు
కేవలం పుస్తకాల విక్రయాలకే పరిమితం కాకుండా, ప్రతిరోజూ సాయంత్రం సాహిత్య సదస్సులు, చర్చా గోష్టులు జరగనున్నాయి. ప్రధాన వేదికపై మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. బాల సాహిత్యం, అనువాద సాహిత్యం, దృశ్య మాలిక వంటి వివిధ అంశాలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయి. నిత్యం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉంటాయి.
పుస్తక ప్రియుల గమ్యస్థానం
విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి వేలాది మంది పుస్తక ప్రియులు, విద్యార్థులు, గ్రంథాలయ ప్రతినిధులు ఈ ప్రదర్శనకు తరలిరానున్నారు. లక్షలాది రూపాయల విలువైన పుస్తకాలు ఈ పది రోజుల్లో విక్రయం అవుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చదువుపై ఆసక్తి ఉన్న వారందరికీ ఈ పుస్తక మహోత్సవం ఒక జ్ఞాన భాండాగారంలా నిలవనుంది.
1989 నుంచి నిరంతరాయంగా
విజయవాడ పుస్తక ప్రదర్శన (Vijayawada Book Festival) 1989 నుంచి నిరంతరాయంగా నిర్వహించబడుతోంది. 1989లో నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT) చొరవతో మొదటిసారిగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఈ స్పందనను చూసి, 1990లో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ (VBFS) ఏర్పాటయింది. అప్పటి నుండి ఈ స్వచ్ఛంద సంస్థ (VBFS), ప్రభుత్వ సంస్థల సహకారంతో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ వేడుకను నిర్వహిస్తోంది.
చారిత్రక ప్రాధాన్యత
ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుస్తక పండుగలలో ఒకటిగా పేరుగాంచింది. విజయవాడ నగరం గతంలో పత్రికలు, ప్రచురణలకు కేంద్రంగా ఉండటంతో, ఈ ఫెస్టివల్ నగర సాంస్కృతిక చిహ్నంగా ఎదిగింది. దశాబ్దాల పాటు ఈ ప్రదర్శన స్వరాజ్య మైదానం (PWD Grounds)లో జరిగేది. అయితే, అక్కడ అంబేద్కర్ స్మృతివనం నిర్మించిన తర్వాత, వేదికను ఇతర ప్రాంతాలకు (ప్రస్తుతం IGMC స్టేడియం) మార్చారు. దేశంలో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించే అతికొద్ది పుస్తక ప్రదర్శనలలో ఇది ఒకటి.
VBFS కార్యదర్శి కే లక్ష్మయ్య ప్రస్తుతం నిర్వహిస్తున్న బుక్ ఫెస్టివల్ గురించి ’ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి‘ తో మాట్లాడుతూ.. వ్యాపారం కోసం, లాభాల కోసం పుస్తక ప్రదర్శన నిర్వహించడం లేదన్నారు. ఒక పది రోజుల పాటు పుస్తకాల గురించి, సాహిత్యం గురించి, విజ్ఝానం గురించి, వ్యక్తిత్వం గురించి, విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం గురించి మాట్లాడుకోవడం కోసం, వాటిని ప్రజలకు తెలియజేయడం కోసమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ పుస్తక ప్రదర్శనలో సాహిత్య పరమైన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, పుస్తక పరిచయ, కవిత్వ పరిచయ కార్యక్రమాలతో పాటు ప్రజల్లో విజ్ఝానం పెంపొందించే కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ పబ్లిషర్ సంస్థలు 150 వరకు పాల్గొనే అవకాశం ఉందన్నారు. విజయవాడ పుస్తక ప్రదర్శన అంటే దానికి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి ప్రజలు వస్తారు. ఈ బుక్ ఫెస్టివల్ అనేది విజయవాడలో పుస్తక ప్రియులకు ఒక పండుగ వాతవరణమే అని చెప్పొచ్చని లక్ష్మయ్య వెల్లడించారు.

