ఇవిగో విమాన చార్జీలు, ఇంతకు మించితే చర్యలే!
x

ఇవిగో విమాన చార్జీలు, ఇంతకు మించితే చర్యలే!

ఎకానమీ క్లాస్‌లో కి.మీ.వారీగా గరిష్ఠ ఛార్జీలు ఇలా.. కేంద్రం ఆదేశాలు


ఇండిగో (Indigo)సంక్షోభం నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు పెంచకూడదని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఎన్ని కిలోమీటర్లకు ఎంతెంత చార్జీ వసూలు చేయాలో స్పష్టం చేసింది. ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికుల అవస్థలపై శనివారం కేంద్రప్రభుత్వం స్పందించింది. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ‘‘ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలు అందరూ పాటిస్తున్నారు. ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించాం. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాలి. మా మంత్రిత్వశాఖ పూర్తి దృష్టి ప్రయాణికులపైనే ఉంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించాం. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. రేపు రాత్రి 8గంటల్లోపు రీఫండ్‌ చేయాలని ఇండిగోను ఆదేశించాం’’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది .
ఎకానమీ క్లాస్‌లో కి.మీ.వారీగా గరిష్ఠ ఛార్జీలు ఇలా..
500కి.మీ వరకు - రూ.7,500
500-1000కి.మీ - రూ.12,000
1000-1500కి.మీ - రూ.15,000
1500కి.మీ.దాటితే - రూ.18,000
‘‘అంతరాయాల సమయంలో అసాధారణంగా ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ తరహా అవకాశవాద ప్రవర్తన నుంచి ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత మార్గాల్లో న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ధరించేందుకు మంత్రిత్వశాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుంది. కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునేవరకు కొత్తగా సూచించిన పరిమితులను కచ్చితంగా పాటించాలి. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్యసహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా, దోపిడీని నిరోధించాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆర్‌సీఎస్‌-యూడీఏఎన్‌ (RCS-UDAN) విమానాలు, బిజినెస్‌ క్లాస్‌కు ఈ ఛార్జీలు వర్తించవని చెప్పారు. ధరల స్థిరీకరణ జరిగేవరకు లేక తదుపరి సమీక్ష జరిగేవరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) హెచ్చరించారు. ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడంతో ఎప్పటికప్పుడు ధరలపై పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వెల్లడించారు. కరోనా సమయంలోనూ కేంద్రం ఇలా ధరల పరిమితిని విధించింది.
గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో ఇండిగో(Indigo) సర్వీసులు రద్దవుతున్నాయి. శనివారం కూడా పలు ఎయిర్‌పోర్టుల్లో వందలకు పైగా దేశీయ సర్వీసులు రద్దయ్యాయి.
Read More
Next Story