
మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ తయారు చేసిన ఎయిర్ టాక్సీ
గుంటూరు నుంచి త్వరలో ఎయిర్ టాక్సీ సర్వీసులు!
ట్రాఫిక్ రుసరుసలు ఉండవు.. సకాలంలో చేరతామా లేదా అనే బెంగ ఉండదు. మనం అనుకున్న చోటికి పోయిన తర్వాత ఆ డ్రైవరు ఎంత అడుగుతాడో అనే గుంజాటన ఉండదు. అసలేమిటీ విషయమంటే..
ట్రాఫిక్ రుసరుసలు ఉండవు.. సకాలంలో చేరతామా లేదా అనే బెంగ ఉండదు. మనం అనుకున్న చోటికి పోయిన తర్వాత ఆ డ్రైవరు ఎంత అడుగుతాడో అనే గుంజాటన ఉండదు.
అబ్బా, ఏమిటీ.. ఇదంతా మన దేశంలోనే? అవును, నిస్సందేహంగా మన దేశంలోనే, అదీ ఆంధ్రప్రదేశ్ లోనే. గర్తపురిగా చెప్పుకునే గుంటూరు నుంచే..
అలా ఎగిరిపోయేవే ఎయిర్ టాక్సీలు. తక్కువ ఖర్చుతో గాల్లో ప్రయాణించే సదుపాయం. ఇదంతా నిజమేనా? అంటే నిజమే మరి. ప్రపంచం కుగ్రామమైన నేపథ్యంలో ఇలాంటి ఎయిర్ టాక్సీలను ఏ ఫ్రోన్సో, చైనానో, అమెరికానో తయారుచేయాలనేమీ రూల్ లేదు. అచ్చంగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులోని గుంటూరు ఈ ఎయిర్ టాక్సీలకు కేంద్రం కాబోతోంది. ఇప్పుడిదో టూరిస్ట్ ఎట్రాక్షన్ గా మారబోతోంది. ఒకప్పుడు గుంటూరు నగర శివారుగా చెప్పే నల్లచెరువు ఈ ఎయిర్ టాక్సీల తయారీకి కేంద్రమైంది.
ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. తయారు చేస్తున్నది చావా అభిరాం. ఈ యువకునిది గుంటూరే. లేటెస్ట్ టెక్నాలజీలో దిట్ట. అమెరికాలో రోబోటిక్స్ చదువుకుని వచ్చారు. ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు నడుంకట్టారు. తెలివితేటలు ఎవరి సోంతం కాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాగ్నమ్ వింగ్స్’ కంపెనీ పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు. మోటర్లు మినహా మిగతా పరికరాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసినవే.
భారత్ లో పుట్టిన వారిలో ఎక్కువ మంది అమెరికా వైపు చూస్తుంటే ఈ అభిరాం ఆంధ్రవైపు చూశారు. నాలుగైదేళ్లు అక్కడ ఉండి నాలుగు రాళ్లు వెనకేసుకునే దానికి ఎందుకొచ్చిన లాయలాసయ్యా ఇదంటే.. చిర్నవ్వే సమాధానంగా చెప్పే అభిరాం- మనం కూడా మన పుట్టిన దేశానికి ఏదైనా చేయాలి కదా అంటారు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు.
2019లో గుంటూరులోని నల్లచెరువులో ఈ ‘మ్యాగ్నమ్ వింగ్స్’ కంపెనీ ఏర్పాటైంది. చిన్న సైజులో ఎయిర్ ట్యాక్సీని తయారు చేసి గాల్లోకి వదిలి చూశారు. దాన్లో పైలట్ ఉండడు. ఇప్పుడందరూ చెబుతున్న డ్రోన్ తరహా. పైలట్ ఉండదు. భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించారు. పైలట్ లేని ఈ వాహనాలను డీజీసీఏ అనుమతించదు. అందుకని పైలట్ ఉండేలా మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నారు. రెండు సీట్లతో తయారుచేసిన దానికి వీ-2 అని, 3 సీట్లతో ఉండే దానికి ఎక్స్-4 అని పేర్లు పెట్టారు. సకాలంలో అనుమతులు వస్తే తొందర్లోనే ఓ వంద కిలోమీటర్ల లోపు రయ్ రయ్ న ఎగిరిపోవచ్చు.
వీ2 మోడల్ 40 కిలో మీటర్లు, ఎక్స్-4 మోడల్ 300 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అర్జంటు పనులు, ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి తప్పించుకోవానుకునే వారు వీటిల్లో ప్రయాణించవచ్చు. ఇప్పుడందరూ ఎంత సాధ్యమైతే అంత తొందరగా గమ్యం చేరుకునే స్పీడ్ యుగం వారే గనుక భవిష్యత్ లో వీటికి గిరాకీ పెరిగే అవకాశం ఉంది. మనం అద్దెకు పెట్టుకునే కారుకు ఎంత ఖర్చవుతుందో అంతే వ్యయంతో ఈ ఎయిర్ ట్యాక్సీని నడపాలన్నది అభిరాం అభిమతం. దీని సాధ్యాసాధ్యాలను ఆయన, ఆయన బృందం పరిశీలిస్తోంది. అన్నింటికీ మించి అనుమతులు రావడం ముఖ్యం. ప్రస్తుతానికి ఎయిర్ ట్యాక్సీ పాలసీ ఇంకా డ్రాఫ్టింగ్ దశలోనే ఉంది. విధి విధానాలు అందుబాటులోకి వస్తే అనుమతుల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ ఎయిర్ టాక్సీలు బ్యాటరీతోనే నడుస్తాయి. ఆకాశమార్గంలో దూరం తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చు పెద్దగా ఉండదని అభిరామ్ చెబుతున్నారు.
Next Story