రేవంత్ పనితీరుమీదే విచారణా ?
x

రేవంత్ పనితీరుమీదే విచారణా ?

ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రెండూ రేవంతే కాబట్టి గెలుపోటములకు తానే బాధ్యత తీసుకోవాలి.


ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పార్టీ పరంగా విశ్లేషించేందుకు ఏఐసీసీ కమిటి హైదరాబాద్ కు చేరుకుంది. ముగ్గురు సభ్యుల కమిటీలో కురియన్, రఖిబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ ఉన్నారు. వీరిలో కురియన్, రఖీబుల్ హైదరాబాద్ చేరుకున్నారు. పర్గత్ శుక్రవారం హైదరాబాద్ చేరుకుంటారు. ఈమధ్యనే జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించేందుకే కమిటి వచ్చినట్లు చెబుతున్నా నిజానికి రేవంత్ రెడ్డి పనితీరుపైన విశ్లేషణ లేదా విచారణ అని అర్ధమవుతోంది.

ఎందుకంటే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రెండూ రేవంతే కాబట్టి గెలుపోటములకు తానే బాధ్యత తీసుకోవాలి. రెండు హోదాల్లో అధిష్టానంతో మాట్లాడుకుని 17 పార్లమెంటు సీట్లలో అభ్యర్ధులను రేవంత్ ఫైనల్ చేయించుకున్నారు. పోటిచేసిన వారిలో అత్యధికులు రేవంత్ మద్దతుదారులే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారమైతే పార్టీ 12 సీట్లలో ఆధిక్యత ప్రదర్శించింది. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే సిక్స్ గ్యారెంటీస్ లో నాలుగు సంక్షేమపథకాలను రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక నరేంద్రమోడి మీద వ్యతిరేకత, బీజేపీ మీద వ్యతిరేకత తదితరాలను కలుపుకుంటే 14 సీట్లలో పార్టీ గెలుస్తుందని ఐఏసీసీ అంచనా వేసుకున్నది. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందునుండే రేవంత్ తో పాటు అందరికీ చెప్పి టార్గెట్ రీచయ్యేందుకు గట్టిగా పనిచేయాలని చాలాసార్లు చెప్పింది.

అయితే పార్టీకి వచ్చింది 8 సీట్లు మాత్రమే. బీజేపీ గెలిచింది కూడా 8 సీట్లే అయినా 2019లో నాలుగు సీట్ల బలాన్ని నూరుశాతం పెంచుకుని 8 సీట్లకు ఎదిగింది. అధికారంలో ఉండి, సంక్షేమపథకాలు అమలుచేస్తు, నేతలందరు ఏకతాటిపైకి వచ్చి పనిచేసినా 8 సీట్లలో మాత్రమే పార్టీ గెలవటాన్ని ఐఏసీసీ సీరియస్ గా తీసుకుంది. అందుకనే ఓడిపోయిన తొమ్మిది నియోజకవర్గాలపై విశ్లేషించేందుకు ముగ్గురు సభ్యుల కమిటిని నియమించింది. ఆ కమిటీనే బుధవారం రాత్రి హైదరాబాద్ కు వచ్చింది. పార్టీ ఓడిపోయిన సిద్ధిపేట, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ లో పోటీచేసిన అభ్యర్ధులతో కమిటి మాట్లాడుతుంది. ఓటమికి వాళ్ళకోణంలో కారణాలను నోట్ చేసుకుంటుంది.

అలాగే పార్లమెంటు పరిధిలో పనిచేసిన మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ద్వితీయశ్రేణి నేతలను కూడా కలిసి కారణాలను కమిటి తెలుసుకుంటుంది. అందరితో మాట్లాడిన తర్వాత చివరగా రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో కూడా కమిటి సభ్యులు భేటీ అవుతారు. చివరగా తమ రిపోర్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కమిటి అందిస్తుంది. అభ్యర్ధుల ఓటమికి రేవంత్ మాట్లాడుతు కొన్ని నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్ధులను దించటం, కాంగ్రెస్ ఓటమిని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు తమ ఓట్లను బీజేపీకి అనుకూలంగా మళ్ళించటమే కారణమని చెప్పారు. అయితే రేవంత్ చెప్పిన కారణాలతో ఐఏసీసీ ముఖ్యనేతలు ఏకీభవించినట్లు లేదు. పోటీలో బలహీనమైన అభ్యర్ధులను ఎవరు దింపారు ? ఎందుకు దింపారు అన్నది కీలకమైన పాయింట్.

సికింద్రాబాద్ లో ఓడిపోయిన దానం నాగేందర్, మల్కాజ్ గిరిలో సునీతా మహేందర్ రెడ్డి, మెదక్ లో నీలం మధు, చేవెళ్ళల్లో గడ్డం రాజీవ్ రెడ్డి, మహబూబ్ నగర్లో చల్లా వంశీచంద్ రెడ్డికి టికెట్లు ఇవ్వాలని రేవంతే పట్టుబట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే కరీంనగర్లో పోటీచేసిన వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ సీటులో పోటీచేసిన మహమ్మద్ వలీయుల్లా సమీర్ అభ్యర్ధిత్వాలు చివరినిముషం వరకు ఖరారు కాలేదు. ఒకవేళ ముందే ఫైనల్ చేసున్నా హైదరాబాద్ సీటులో కాంగ్రెస్ గెలుపు కష్టమే. నిజామాబాద్ లో పోటీచేసిన తాటిపర్తి జీవన్ రెడ్డి డైరెక్టుగా టికెట్ తెచ్చుకున్నారు. ఆదిలాబాద్ లో పోటీచేసిన ఆత్రంసుగుణ గట్టి పోటీనే ఇచ్చినా ఓడిపోయారు.

ఓడిపోయిన తొమ్మిది సీట్లలో డైరెక్టుగా రేవంత్ బాధ్యత తీసుకోవాల్సింది సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, సిద్ధిపేటలో. విచిత్రం ఏమిటంటే మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోనే రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సీటు కొడంగల్ కూడా ఉండటం. పైగా కొడంగల్ లో బీజేపీకి మెజారిటి వచ్చింది. ఐఏసీసీ కోణంలో చూస్తే రేవంత్ పనితీరుకు 50 శాతం మార్కులు మాత్రమే వస్తాయి. అందుకనే అంచనా మేరకు రాని సీట్ల విషయంలో ఏఐసీసీ బాగా సీరియస్ గా ఉంది. ఏఐసీసీ నాయకత్వం ఎప్పుడు ఎవరిని పైకి ఎత్తుతుందో ? ఎప్పుడు ఎవరిని పక్కన పెట్టేస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఓడిపోయిన నియోజకవర్గాలపై విశ్లేషణ అని చెబుతున్నా నిజానికి జరుగుతున్నది రేవంత్ పనితీరుపై విశ్లేషణ అనే చెప్పాలి.

ఓడిపోయిన అభ్యర్ధులు తొమ్మిది మందితో కమిటి ముందు మాట్లాడటంలో ఉద్దేశ్యం క్షేత్రస్ధాయిలో జరిగిన పరిణామాలను తెలుసుకోవటమే. వీళ్ళనుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో మిగిలిన వాళ్ళతో మాట్లాడేటపుడు క్రాస్ చెక్ చేసుకుంటుంది కమిటి. ఏదేమైనా కమిటి ఏఐసీసీకి ఇచ్చే రిపోర్టు మీదే రేవంత్ భవిష్యత్తు ఆధారపడుటుందనటంలో సందేహంలేదు.

Read More
Next Story