బిగ్ బి మనవడు ఇక్కిస్తో హిట్ కొట్టాడా ?
x

బిగ్ బి మనవడు 'ఇక్కిస్'తో హిట్ కొట్టాడా ?

'ఇక్కిస్' మొదటిరోజు బాక్సాఫీస్ రిపోర్ట్


బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ కిడ్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఎంతో ప్రతిష్టాత్మకంగా వెండితెరకు పరిచయమైన యుద్ధ చిత్రం 'ఇక్కిస్'. ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోపిక్, కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1, 2026న థియేటర్లలో విడుదలైంది. . అగస్త్య గతంలో 'ది ఆర్చీస్' ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, వెండితెరపై నటుడిగా ఇది అతనికి తోలి సినిమా అనే చెప్పొచ్చు.

తొలి రోజు బాక్సాఫీస్ రిపోర్ట్:

శాక్నిల్క్ నివేదికల ప్రకారం, 'ఇక్కిస్' మొదటి రోజున భారత బాక్సాఫీస్ దగ్గర 7 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. అయితే ఇదే సమయంలో విడుదలైన ఇతర చిత్రాల నుండి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురైంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన రోమ్-కామ్ చిత్రం 'తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ' తొలి రోజున రూ. 7.75 కోట్లు రాబట్టి అగస్త్య సినిమా కంటే స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

మరోవైపు, అప్పటికే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్' హవా ఏమాత్రం తగ్గలేదు. విడుదలైన 28వ రోజున (నాల్గవ గురువారం) కూడా ఈ చిత్రం రూ. 15.75 కోట్లు వసూలు చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం మన దేశంలో ఈ చిత్రం మొత్తం వసూళ్లు రూ. 739 కోట్లకు చేరుకున్నాయి.

ధర్మేంద్ర ఆఖరి జ్ఞాపకం.. భారీ ఆక్యుపెన్సీ:

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర వెండితెరపై కనిపించిన చివరి చిత్రం ఇదే. ఆయన మరణం తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో జనవరి 1, 2026 (గురువారం) నాడు హిందీ బెల్ట్‌లో ఈ చిత్రం ఏకంగా 31.94% ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం.

అరుణ్ ఖేతర్‌పాల్ వీరగాథ:

నేపథ్యం: ఈ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధంలో అమరుడైన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది.

టైటిల్ వెనుక కారణం: అరుణ్ ఖేతర్‌పాల్ దేశం కోసం తన 21వ ఏటనే పరమవీర చక్ర పొంది వీరమరణం పొందారు, అందుకే ఈ చిత్రానికి 'ఇక్కిస్' (21) అనే పేరు పెట్టారు.

వాస్తవానికి ఈ సినిమాను 2025 డిసెంబర్ 25నే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ నిర్మాత దినేష్ విజన్, బాక్సాఫీస్ వద్ద ఉన్న 'ధురంధర్' ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రానికి సోలో విడుదల దక్కాలని జనవరి 1కి వాయిదా వేశారు.

మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, అగస్త్య నంద నటన , దేశభక్తిని చాటిచెప్పే కథ కావడంతో రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

* * *

Read More
Next Story