బట్రస్ డ్యామ్ డిజైన్లలో మళ్లీ మార్పులు
x

బట్రస్ డ్యామ్ డిజైన్లలో మళ్లీ మార్పులు

పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. సీపేజీని ఆపేందుకు మరింత పటిష్టత కోసం బట్రస్ డ్యాం లో మార్పులు చేశారట.


పోలవరం ఆనకట్ట నిర్మాణంపై ఇంజనీరింగ్ నిపుణుల ఆలోచనలు ఇంకా పూర్తి కాలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇంకా బాలారిష్టాలు తొలగలేదు. డయా ఫ్రం వాల్ నిర్మానానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్న ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆలోచనలు త్వరగా పూర్తి చేసి డయాఫ్రం వాల్ నిర్మాణం వేసవి ముగిసేలోపు పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వర్షాకాలంలో మళ్లీ వరదలు మొదలైతే ప్రాజెక్టు నిర్మాణం తిరిగి మొదటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం వరద నీరు వల్లే పదేళ్లుగా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. నిర్మాణ పనులను ఇంజనీర్ల సొంత ఆలోచనలకు వదిలేయకుండా పాలకుల ఆలోచనలు కూడా మధ్య మధ్యలో జోడించడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆందోళన ఇంజనీర్లలో ఉంది.

గోదావరి ప్రవాహ వేగమూ ఎక్కవే..

డయా ఫ్రం వాల్ నిర్మాణానికి పైభాగం, కింది భాగాన నిర్మించే కాపర్ డ్యామ్ లు తాత్కాలికమైనవి. ఈ ఆనకట్టలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుని డ్యామ్ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినవే. డ్యామ్ నిర్మాణం పూర్తయిన తరువాత కాపర్ డ్యామ్ లను తొలగిస్తారు. గోదావరి నది కృష్ణా నదికంటే వెడల్పు ఎక్కువ. ప్రవాహ వేగం కూడా ఎక్కువ. రాళ్లు, గుట్టులు నది గర్భంలో తక్కువగా ఉంటాయి. వరదలు వచ్చాయంటే నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాపర్ డ్యామ్ లు కాస్త శక్తివంతంగా నిర్మించాల్సి ఉంటుంది. దీని లైఫ్ టైమ్ సుమారు మూడేళ్లకు మించి ఉండే అవకాశం లేదు. ఈ మూడేళ్లలోపు డయా ఫ్రం వాల్ పూర్తయి ప్రాజెక్టు టేట్లు నిర్మించేందుకు పూనుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే పూర్తి కావచ్చింది అనుకున్న పోలవరం తిరిగి మొదటికి రావడం బాధను కలిగించే అంశంగానే భావించాల్సి ఉంటుంది.

పటిష్టతకే బట్రస్ డిజైన్లలో మార్పులు

కాపర్ డ్యామ్ కు సమాంతరంగా నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్ డిజైన్లు పూర్తి చేసి సోమవారం ఇంజనీర్లు చర్చకు పెట్టారు. అయితే కొన్ని మార్పులు డిజైన్లలో బట్రస్ డ్యామ్ కు సంబంధించి చేయాలనే ఆలోచనకు అంతర్జాతీయ ఇంజనీర్ల బృందం వచ్చింది. వారి ఆలోచనల ప్రకారం డిజైన్లలో మార్పులు చేసేందుకు ఏపీ ఇంజనీరింగ్ విభాగం వారు నిర్ణయించారు. మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో విదేశీ ఇంజనర్ల సూచనలు మేరకు మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందున నేటి సాయంత్రానికి ఈ మార్పులు పూర్తి చేసి కేంద్రం ఆమోదానికి పంపించేందుకు నిర్ణయించారు. సీపేజీని ఆపేందుకు బట్రస్ డ్యామ్ నిర్మాణమే శరణ్యమనే అభిప్రాయానికి ఇంజనీర్లు రావడం వల్ల మరింత పటిష్టత కోసం డిజైన్లలో మార్పులు చేసినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.

ఆగని లీకులతో ఇంజనీర్లలో భయం

కాపర్ డ్యామ్ నుంచి వస్తున్నసీపేజీ వాటర్ ఆగటం లేదు. ప్రస్తుతం డయా ఫ్రం వాల్ వద్ద పైభాగాన ఏర్పాటు చేసిన గడ్డను దాటి చీపేజీ వాటర్ వస్తోంది. దీనికి ప్రత్యేకించి మోటార్లు ఏర్పాటు చేశారు. సీపేజీ నీటిని తోడేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. డయా ఫ్రం వాల్ నిర్మాణ సమయంలో నీరు గడ్డర్ పైకి రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీని బాధ్యత కాంట్రాక్టర్లపైనే ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. నిర్మాణ కంపెనీలైన మేఘా, బావర్ వారు ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఎటువంటి రాజీలకు పోకుండా ముందు తరాలు గర్వపడేలా నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి వచ్చే సీపేజీ వాటర్ ను ఎత్తిపోసే విషయంలో నిర్మాణ కంపెనీలు తీసుకునే చర్యలపైనే డయా ఫ్రం వాల్ నిర్మాణం ఆధారపడి ఉంటుందని ఇంజనీర్లు అంటున్నారు.

అనుభవ ఇంజనీర్లు అన్నీ ఆలోచించే నిర్ణయిస్తారు

విదేశీ ఇంజనీర్లు ఏడు నెలలుగా ఏపీలో ఉంటూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పలు సూచనలు, సలహాలు ఇవ్వడం ఎంతో అవసరం. వారి అనుభవం, అధ్యయనాలు, నిర్ణయాలు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎంతో ఉపయోగ పడతాయని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మినారాయణ అన్నారు. ఆయన ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఒక పెను సవాల్, అన్నింటినీ అధిగమించి కట్టినప్పుడే నాణ్యతలో రాజీలేకుండా ఉంటుంది. ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు ఖర్చు గురించి, చిన్న చిన్న సమ్యల గురించి ఆలోచించ కూడదు. ఇప్పటికే ఆలస్యమైంది. అయితే నిర్మాణంలో తగిన సమయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల నిర్మాణం ఎంతో పటిష్టంగా భావి తరాలు మెచ్చుకునేలా చేపట్టేందుకు ఇంజనీర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదన్నారు. కాపర్ డ్యామ్ కు సమాంతరంగా డట్రస్ వాల్ నిర్మించాలనే ఆలోచన ఇంజనీర్ల నుంచి వచ్చిందంటే సీపేజీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎత్తిపోతల ద్వారా కొంత ప్రజాధనం నిరుపయోగం అయిందనేది వాస్తవమన్నారు. ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నప్పుడు ఎత్తి పోతల పథకాల వల్ల వరిగేది ఏమీ ఉండదని చెప్పారు.

Read More
Next Story