
అవధూత్ సాథే.. మాటల గారడీ
ఎవరీ అవధూత్, అమాయకులకు రూ.546 కోట్లకు టోపీ ఎలా వేశారు?
అప్పుడెప్పుడో హర్షద్ మెహతా.. ఇప్పుడు అవధూత్ సాథే.. అమాయకుల సొమ్ము దోచేసి చట్టానికి దొరక్కుండా తప్పించుకోగలుగుతున్నారు
అప్పుడెప్పుడో హర్షద్ మెహతా.. ఇప్పుడు అవధూత్ సాథే.. సెబీకి చెమటలు పట్టించారు.. అమాయకుల సొమ్ము దోచేసి చట్టానికి దొరక్కుండా తప్పించుకోగలుగుతున్నారు. పెనాన్షియల్ ఇన్ఫులెన్సియర్ పేరిట ఇప్పుడు స్టాక్ మార్కెట్ తో పరిచయం ఉన్న వారందరి నోళ్లలో నానుతున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన సెబీ ఇప్పుడు ఆయనపైన, ఆయన సంస్థపైన కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పటికీ సుమారు 547 కోట్ల రూపాయల ప్రజల డబ్బు అన్యాక్రాంతం అయినట్టు తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్ ఇన్‌ఫ్లూయెన్సర్ అవధూత్ సాథే, ఆయన సంస్థ Avadhut Sathe Trading Academy (ASTAPL) పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. స్టాక్ మార్కెట్ విద్య పేరిట నమోదు లేని ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇచ్చి 3.37 లక్షల ఇన్వెస్టర్ల నుంచి రూ. 601.37 కోట్లు వసూలు చేసినట్లు సెబీ విచారణలో తేలింది. ఇందులో రూ. 546.16 కోట్లు “చట్టబద్ధంగాని లాభాలు” (unlawful gains)గా పరిగణించి తిరిగి వసూలు చేయాలని ఆదేశించినట్టు PTI వార్తా సంస్థ తెలిపింది.
అవధూత్ సాథే ఎవరు?
పూణేకు చెందిన అవధూత్ సాథే ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ శిక్షణ ఇచ్చే ఇన్‌ఫ్లూఎన్సర్‌గా గుర్తింపు పొందారు. ఆయన వయసు సుమారు 54 ఏళ్లు ఉండవచ్చు. Avadhut Sathe ముంబైలోని దాదర్ ప్రాంతంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ముంబై శివార్లలోని MULUND (ములుంద్) అనే ప్రాంతంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన ఇంజనీర్. హిందీ, మరాఠీ, ఇంగ్లీషులో దిట్ట. అనర్ఘళంగా మాట్లాడగలరు. 1991లో బిఇ (BE in Electronics) పట్టా పొందారని, తరువాత సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేశారని తెలుస్తోంది. మొదటగా Hexaware Technologies అనే కంపెనీలో పని చేశారు. అక్కడ జీతం చాలక పోవడంతో ఆ ఉద్యోగం మానేసి కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి రావాలనుకునే వారికి కోర్సుల కోసం ఓ అకాడమీని ప్రారంభించారు.
ఇతర ట్రైనర్ల కంటే తక్కువ ఫీజుతో కోర్సులు ఇవ్వడం వల్ల చిన్న పట్టణాల నుండి కూడా వేలాదిమంది ఆయన వద్ద శిక్షణ పొందారు. ఇంజనీర్‌గా చదివిన సాథే సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసి, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా పనిచేశారు. తల్లిదండ్రులతో కలిసి నయాగరా ఫాల్స్ వద్ద ఫోటో దిగాలన్న కలతో అమెరికా వెళ్లానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడే ఆయన స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరిగి, 2007లో IT ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా ట్రేడింగ్, శిక్షణ వైపు మళ్లారు.
ట్రేడింగ్ అకాడమీ ఎలా ఏర్పడింది?
2008లో సాథే మొదటి స్టాక్ మార్కెట్ సెమినార్‌ను కేవలం 12 మందితో నిర్వహించారు. అక్కడినుంచి Avadhut Sathe Trading Academy (ASTA) దేశవ్యాప్తంగా వేగంగా పెరిగింది. నాలుగు నెలలపాటు కొనసాగే ముఖ్య కోర్సు అది. నాలుగు మాడ్యూల్స్ లో చెబుతారు. ఒక్కో క్యాండిడేట్ నుంచి రూ.18వేల ఫీజు వసూలు చేస్తారు. ఆన్‌లైన్ వీడియోలకే పరిమితమైపోయిన చాలామంది ట్రైనర్లతో పోలిస్తే, సాథే లైవ్ ట్రేడింగ్ సెషన్లు ఇస్తారు. "hands-on coach"గా పేరు తెచ్చుకున్నారు. 1991 నుంచి ఆయన ట్రేడింగ్ చేస్తున్నారు. పెట్టుబడులు పెడుతున్నారు. 2007లో భారత్ తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా ట్రేడింగ్ పైనే దృష్టిపెట్టారు. 2008లో అవధూత్ సాఠే ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించారు. సాంకేతిక విశ్లేషణ, సైకాలజీ, యోగా, మోటివేషనల్ సెషన్లు కలగలిపి ఆయన ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు దేశంలో, విదేశంలో ఆదరణ తీసుకువచ్చాయి.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్
మాటలో నాటకీయత మెండు. భావోద్వేగ స్పీచ్‌లు ఇస్తారు. క్రమశిక్షణ, నిగ్రహశక్తి, దేశభక్తి కలగలిపి పాఠాలు చెప్తారు. దీంతో సాథే సోషల్ మీడియాలో చాలా స్పీడుగా ఫేమస్ అయ్యారు. యూట్యూబ్‌లో ఆయన ఛానల్ కి పదిలక్షల మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
సెబీ విచారణలో ఏమి తేలింది?
ఇంతటి మేధావి అయిన సాథే రెండు మూడేళ్లలో తన అభిమానుల నుంచి 601 కోట్ల రూపాయల డిపాజిట్లు లేదా పెట్టుబడులు సంపాయించారు. వాటన్నింటినీ షేర్ మార్కెట్ లో పెడుతున్నట్టు చెప్పి మోసం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సెబీ 2023–24 నుంచి ఇప్పటి వరకు ఆయన జరిపిన లావాదేవీలపై విచారణకు ఆదేశించింది. కోర్సుల్లో పాల్గొన్న వారినే పెట్టుబడి మార్గంగా మార్చుకుని లాభాలు పొందారనేది ఆయనపై ఆరోపణ. కోర్సు నేర్చుకుంటే “ఎప్పటికప్పుడు అధిక లాభాలు వస్తాయి” అని చెప్పి భ్రమపెట్టేవాడు "కోర్సు" పేరిట buy–sell రికమెండేషన్లు ఇచ్చారు.
అన్ని వందల కోట్లు ఎలా వసూలు చేశారు?
సెబీ ప్రకారం సాథే అకాడమీ, సాథే కలిసి రూ. 601.37 కోట్లు వసూలు చేశారు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ , రీసెర్చ్ అనలిస్ట్ సర్వీసులు ఇచ్చి కొల్లగొట్టిన డబ్బుగా చెబుతున్నారు. సెబీ పూర్తి కాలపు సభ్యుడు కమ్లేష్ చంద్ర వర్శ్నే ఈ వ్యవహారంపై విచారణ జరిపారు. “రూ. 5,46,16,65,367/- మొత్తాన్ని ఆయన కంపెనీ నుంచి, ఆయన నుంచి వసూలు చేయాలని ” ఆయన పేర్కొన్నారు. “ASTAPL, AS — ఇద్దరూ సెబీ వద్ద IA (ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్), RA (రిసెర్చ్ అనలిస్ట్)గా నమోదు కాలేదు. అయినప్పటికీ, 'ట్రైనింగ్ ప్రోగ్రామ్' పేరుతో ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇస్తున్నారు” అని తన నివేదికలో స్పష్టం చేశారు.
మార్కెట్ నుంచి బ్యాన్, కఠిన ఆంక్షలు
సాథే ను షేర్ మార్కెట్ నుంచి నిషేధించారు. ఫిన్‌ఫ్లూయెన్సర్లపై తీసుకున్న అత్యంత కీలక చర్యల్లో ఇది ఒకటి. దీంతో పాటు సాథే సలహాలివ్వడం వెంటనే ఆపాలి. సెక్యూరిటీస్ మార్కెట్‌లో కార్యకలాపాలు నిలిపివేయాలి. లైవ్ మార్కెట్ డేటాను వినియోగించరాదు. కోర్సు పాల్గొన్న వారి పేర్లు, తమ పనితీరును ప్రకటనల రూపంలో చూపించరాదు.
“పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడం, రిజిస్ట్రేషన్ లేకుండా సలహాలు ఇవ్వడం నివారించేందుకు తక్షణ చర్య అవసరం” అని సెబీ ప్రకటించింది. సాథే నుంచి రూ.546.16 కోట్లు తిరిగి వసూలు ఆదేశించిది.
2021లో ఫీజుల ద్వారా అవధూత్‌కు వచ్చిన ఆదాయం రూ.17 కోట్లు కాగా.. 2023లో అది రూ.86 కోట్లకు పెరిగింది. 2025లో ఆ మొత్తం రూ.200 కోట్లు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నమోదు కాని ఆయన సంస్థపై సెబీ చర్యలు చేపట్టింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవరకు రూ.546 కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది.
Next Story

