Araku Valley | 5 ఏళ్ల తర్వాత అడవిలో మళ్ళీ పండగ
అరకు ఉత్సవాలకు ఎగిరొస్తున్న విదేశీయులు. డిసెంబర్ ఆఖరులో జరగనున్న అరకు ఉత్సవం. శరవేగంగా జరుగుతున్న సన్నాహాలు.
అందాలకు మారు పేరు అరకు. ఆ అరకులో లోయలు హొయలొలుకుతాయి. జలపాతాలు జలజలా జాలువారతాయి. పచ్చని పర్వతాలు పరవశింపజేస్తాయి. ఈ శీతలంలో వణికించే చలి, తుంపర వర్షాన్ని తలపించేలా కురిసే మంచు అదనంగా మురిపిస్తాయి. పసుపు రంగు పూసుకున్న వలిశె పూలు మనసును దోచేస్తాయి. అందుకే అలాంటి అందాలను ఆస్వాదించడానికి ఈ శీతాకాల సీజనులో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఈ పర్యాటక ప్రియులను మరింతగా ఆకట్టుకోవడానికి ఈ సీజనులో ప్రభుత్వం అరకు ఉత్సవన్ను నిర్వహిస్తుంది. ఆ ఉత్సవ్లో బెలూన్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ అవుతుంది. అయితే 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మూడుసార్లు అరకు ఉత్సవ్లు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అరకు ఉత్సవ్లకు మంగళం పాడింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పవర్లోకి వచ్చింది. దీంతో మళ్లీ అరకు ఉత్సవ్ కోసం ఉవ్విళ్లూరుతోంది.
ఈ ఫెస్టివల్లో ఏముంటాయి?
తూర్పు కనుమల్లో.. సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉంది అరకు. అరకు ఫెస్టివల్లో హాట్ ఎయిర్ బెలూన్ల రైడ్, పారా మోటార్ రైడ్, ఆల్టైర్ వెహికల్ రైడ్, హెలి టూరిజం వంటివి ఉంటాయి. వీటితో పాటు గిరిజన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు, కార్యక్రమాలు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలు, సంగీత విభావరి నిర్వహిస్తారు. ఈ ఉత్సవ్ పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి హాట్ ఎయిర్ బెలూన్ రైడర్లు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి పారా మోటార్ రైడర్లు వస్తారు.
గతంలో 2019లో జరిగిన బెలూన్ ఫెస్టివల్లో 15 (భారత్, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, థాయ్లాండ్, బ్రిటన్, స్పెయిన్, మలేసియా, నెథర్లాండ్, జర్మనీ, బ్రెజిల్, జపాన్, స్లొక్లేవియా) దేశాల నుంచి 20కి పైగా విభిన్న ఆకారాలు, రంగుల హాట్ ఎయిర్ బెలూన్లు వచ్చాయి. ఈసారి 12 దేశాల నుంచి 30 వరకు బెలూన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదు పారా మోటార్ రైడింగ్ టీమ్లు పాల్గొనడానికి ముందుకొచ్చాయి.
బెలూన్ రైడ్లను అరకులోని పద్మాపురం గార్డెన్స్ నుంచి నిర్వహిస్తారు. నేల పైనుంచి 2,500 మీటర్ల ఎత్తు వరకు ప్రత్యేకంగా తయారు చేసిన బెలూన్ బాస్కెట్లలో (ట్రిప్పునకు నలుగురైదుగురు చొప్పున పర్యాటకులను తీసుకెళ్తారు. అలాగే హెలి టూరిజంలో భాగంగా అరకు నుంచి సమీపంలోని కొన్ని ప్రాంతాలకు హెలికాప్టర్లో తీసుకెళ్లి తీసుకొస్తారు. అలా మేఘాల నడుమ, పచ్చని గిరులకు పైన విహరించే వారు మధురానుభూతికి లోనవుతారు.
అరకు ఉత్సవ్ ఎప్పట్నుంచి?
అరకు ఉత్సవ్ను అల్లూరి సీతారామరాజు జిల్లా పాలనా యంత్రాంగం, పాడేరు ఐటీడీఏ, పర్యాటక శాఖలు సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్నాయి. ఈ అరకు ఉత్సవ్ నిర్వహణ ఖరారైనప్పటికీ వాటి తేదీలు ఖరారు కాలేదు. డిసెంబరు 25 నుంచి జనవరి 10వ తేదీల మధ్య ఈ ఫెస్టివల్ జరపడానికి అనువుగా ఉంటుందని జిల్లా జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఫెస్టివల్కు రూ.5 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించింది. ఇప్పటికే కొన్నాళ్ల క్రితం అరకులోని పద్మాపురం గార్డెన్ నుంచి బెలూన్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
రూ.వేలల్లో టిక్కెట్టు ధరలు..
అరకు ఫెస్టివల్లో హాట్ ఎయిర్ బెలూన్, పారా మోటార్ రైడింగ్, హెలి టూరిజంల్లో విహరించడానికి టిక్కెట్ల ధరలు రూ.వేలల్లో ఉండనున్నాయి. బెలూన్ రైడింగ్ రూ.2-5 వేలు, పారా మోటార్ రైడింగ్ రూ.1,500- 2,500, హెలి టూరిజం టిక్కెట్టు రూ.4000-5000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రైడ్లు నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. అలా టెండర్లను దక్కించుకున్న వారు వీటికి టిక్కెట్టు ధరను నిర్ణయిస్తారు. గత (2019) అరకు ఉత్సవ్లో టిక్కెట్ల ధర అధికంగానే ఉన్నప్పటికీ ఈ రైడ్లకు మంచి డిమాండ్ వచ్చింది. ఆన్లైన్లోనే పెద్ద ఎత్తున టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అప్పట్లో వీటిపై రైడ్లు చేయడానికి స్థోమతు ఉన్న పర్యాటకులు ముందుకొచ్చారు. ఈసారి కూడా ఈ రైడ్లకు గిరాకీ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. 2019లో జరిగిన అరకు ఉత్సవ్లో నాలుగు వేల మంది బెలూన్ రైడ్ చేశారు. త్వరలో జరగబోయే అరకు ఉత్సవక్కు రెండు లక్షలకు పైగా పర్యాటకులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్థానిక గిరిజనులకు కోటా..
ఇక ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో అరకు ఫెస్టివల్కు రెక్కలు కట్టుకుని వచ్చే వారికి స్థానిక గిరిజనులు తమ గడ్డపై ఆశ్రయం ఇస్తున్నారు. తమ నేలపై ఉత్సవ్‌ను జరిపిస్తున్నందుకు తమకూ ఆకాశంలో ఎగిరే అవకాశం కల్పించాలని గతంలో ఈ గిరిజనులు అధికార యంత్రాంగాన్ని అభ్యర్థించారు. దీంతో మొత్తం రైడ్లలో 10 శాతం మందికి ఉచితంగా రైడ్ చేసేందుకు వీలు కల్పించారు. ఈసారి ఆ పర్సంటేజి మరింత పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ఉత్సవ్ ఏర్పాట్లకు సన్నద్ధం..
'ఐదేళ్ల తరువాత జరగనున్న అరకు ఫెస్టివల్కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ ఆఖరు వారం, జనవరి మొదటి వారంల మధ్య మూడు రోజుల పాటు జరుపతలపెట్టిన ఈ ఫెస్టివల్ తేదీలు ఖరారు కోసం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. ఈసారి ఫెస్టివల్ కు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి రానున్నారు. అందుకు తగిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ, పర్యాటక శాఖలు సమన్వయంతో చేస్తున్నాయి' అని అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక అధికారి (డీటీవో) గరికిన దాస్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.