హైకోర్టుకు వెళ్లిన తిరుమల లడ్డూ వివాదం.. చంద్రబాబుకు షర్మిల ఛాలెంజ్
x

హైకోర్టుకు వెళ్లిన తిరుమల లడ్డూ వివాదం.. చంద్రబాబుకు షర్మిల ఛాలెంజ్

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అందించే లడ్డూ సహా ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వివాదం కాస్తా ఏపీ హైకోర్టుకు చేరింది.


కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అందించే లడ్డూ సహా ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వివాదం కాస్తా ఏపీ హైకోర్టుకు చేరింది. ఇదంతా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారమేనని, దీనిని అడ్డుకోవాలంటూ ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. హైకోర్టుకు ఆశ్రయించారు. తిరుమల ప్రసాదాలయ తయారీ కోసం జంతువుల కొవ్వు, చేప నూనె కలిసి నెయ్యిని వినియోగించారని జగనే టార్గెట్‌గా జరుగుతున్న విషప్రచారాన్ని ఆపేల ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. కాగా ఆయన పిటిషన్‌పై హైకోర్టు ఎవరూ ఊహించని రీతిలో స్పందించింది. ఈ అంశంపై ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని, వచ్చే బుధవారం రోజున విచారణ చేపడతామంటూ బదులిచ్చింది. దీంతో ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఈ వివాదంపై తీసుకున్న తొలి చర్యలోనే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్.. కేంద్ర హోంశాఖకు జగన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకున్న జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. తాజాగా ఈ వివాదంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఘాటుగానే స్పందించారు. చంద్రబాబుకు ఆమె ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

నిజాలు నిగ్గు తేల్చాలి: షర్మిల

‘‘తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే... తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా CBI తో విచారణ జరిపించండి. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’’ అని ఆమె తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట చేశారు. ఈ వివాదంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. టీటీడీ లడ్డూ ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ అని చెప్పారు.

ధర్మారెడ్డి దుర్మార్గుడు: నారాయణ

‘‘టీటీడీ లడ్డూ ప్రసాద కల్తీ వ్యవహారం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. ధర్మారెడ్డి అనే వ్యక్తి దుర్మార్గుడు. ధర్మారెడ్డి ఐడీఎస్ అధికారి అయినా వైసీపీకి అనుకూలంగానే పనిచేశారు. టీటీడీ ఈఓగా బాధ్యతల్లో ఉండి కూడా ఒక వైసీపీ కార్యకర్తలానే ఆయన పనిచేశారు. తిరుమల తిరుపతి లడ్డూ వివాదం కోట్ల మంది భక్తుల విశ్వాసానికి చెందిన అంశం. ఇందులో నిగ్గు తేల్చాలి. సుప్రీంకోర్టు విచారణ చేయాలి. కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని యుద్ధప్రాతిపదికన తేల్చాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజూ లక్షల మంది తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుని లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. దానిని వారు పరమపవిత్రంగా భావించి సేవిస్తారు. అటువంటి ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కాంట్రాక్ట్‌ను పబ్లిక్ సెక్టార్‌లో ఉండే డైరీకే ఇవ్వాలి. ఊరు, పేరు లేని కంపెనీలకు ఇవ్వకూడదు’’ అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More
Next Story