ఏపీలో మారనున్న పరిపాలనా కేంద్రాలు
x
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీలో మారనున్న పరిపాలనా కేంద్రాలు

ఏపీలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, నియోజకవర్గాలు, మండలాల పునర్విభజన జరిగింది. ఈ మేరకు 2026 జనవరి నుంచి అమలులోకి రానుంది.


రాష్ట్ర పరిపాలనా పటంలో భారీ కదలిక చోటు చేసుకుంది. మూడు కొత్త జిల్లాలతోపాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఒక కొత్త మండలం దాదాపు డజనుకు పైగా జిల్లాల్లో మండలాల బదిలీలు, సరిహద్దు మార్పులు ఒకేసారి జరగనున్నాయి. ఇదంతా ఎన్నికల హామీల అమలు మాత్రమే కాదు, స్థానిక రాజకీయ ఒత్తిళ్లు ఎమ్మెల్యేల డిమాండ్లు జనాభా సాంద్రత భౌగోళిక సౌలభ్యం కలిసి వచ్చిన ఫలితంగా కనిపిస్తోంది.

పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాలతో ఏర్పడనుండగా గిరిజన ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు దీర్ఘకాల డిమాండ్ తీరనుంది. మార్కాపురం జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద కొత్త జిల్లాగా 11.42 లక్షల జనాభాతో మార్కాపురం, కనిగిరి డివిజన్లలోని 20కి పైగా మండలాలతో ఆవిర్భవిస్తుంది. మదనపల్లి జిల్లా 11.05 లక్షల జనాభాతో మదనపల్లి, పీలేరు డివిజన్లలోని 19 మండలాలతో హార్టికల్చర్ హబ్‌గా మారనుంది.

మండలాల స్థానభ్రంశం ఆసక్తికరంగా ఉంది

అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట యలమంచిలి నియోజకవర్గాల మండలాలతో కొత్త నక్కపల్లి డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, దర్శి మండలాలతో కొత్త అద్దంకి డివిజన్, మర్రిపూడి పొన్నలూరు మండలాలు కందుకూరుకు, కనిగిరి నియోజకవర్గం పూర్తిగా మార్కాపురం జిల్లాలోకి వెళ్లాయి.

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం మొత్తం ప్రకాశం జిల్లాలోకి వెళ్తుండగా, కందుకూరు నియోజకవర్గం కూడా ప్రకాశం జిల్లాలోనే కొనసాగనుంది. కాకినాడ డివిజన్‌లోని సామర్లకోట మండలం పెద్దాపురం డివిజన్‌కు, కోనసీమలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రాజమహేంద్రవరం డివిజన్‌లోకి వెళతాయి.

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లోకి ఉంటాయి.

చిత్తూరు జిల్లాలో పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యం చిత్తూరు డివిజన్‌కు, చౌడేపల్లి, పుంగనూరు మండలాలు మదనపల్లి డివిజన్‌కు వెళతాయి.

కడప జిల్లాలో ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు రాజంపేట డివిజన్‌లోకి వెళతాయి.

శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర కొత్త డివిజన్‌గా ఏర్పడగా ఆమడగూరు మండలం పుట్టపర్తికి, గోరంట్ల మండలం పెనుకొండకు వెళుతుంది.

నంద్యాల జిల్లాలో బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్త బనగానపల్లె డివిజన్ ఏర్పాటవుతోంది.

కర్నూలు జిల్లా ఆదోని మండలం విభజనతో పెద్దహరివనం అనే కొత్త మండలం ఏర్పాటు కానుంది.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పిలువబడనుంది. ఇది శ్రీ సత్యసాయిబాబా భక్తులకు ఆనందాన్నిచ్చే మార్పు.

ఈ మార్పులతో 17 జిల్లాల్లో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల మధ్య గంగమ్మ తల్లిలా స్థానభ్రంశం చెందగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాలు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి.

రాబోయే కేబినెట్ ఆమోదంతో ఈ మార్పులు అధికారిక నోటిఫికేషన్‌గా మారనున్నాయి. దీంతో రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం పెరిగినా కొన్ని ప్రాంతాల్లో గుర్తింపు కోసం జరిగిన ఈ తిరోగమనం రాజకీయంగా చర్చనీయాంశం కానుంది. ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరి రాజకీయ లబ్ధి, ఎవరి నిరాశ అన్నది రానున్న రోజుల్లోనే తేలనుంది.

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ నివేదికను సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. విజయవాడ అర్బన్ లో భాగమైన పెనమలూరు 2022లో జరిగిన జిల్లా విభజనలో కృష్ణా జిల్లాకు చెందినప్పటికీ మచిలీపట్నం జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేసిన సీఎం, ఎన్టీఆర్ జిల్లాకు చేర్చాలనే డిమాండ్‌పై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఈ నియోజకవర్గ ప్రజలు రోజువారీ పరిపాలనా పనులకు మచిలీపట్నంకు వెళ్లాలంటే 500 రూపాయలు ఖర్చు చేసి రెండు వైపులా ప్రయాణించాల్సి వస్తోందని ప్రస్తావించి, ఇది పరిపాలనా సౌలభ్యానికి అడ్డంకిగా మారిందని అన్నారు. ముఖ్యంగా నూజివీడు, గన్నవరం వంటి నియోజకవర్గాలు జిల్లా కేంద్రాలకు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు రోజువారీ పనుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేలా పునర్విభజన చేపట్టామని ఈ మార్పులు ప్రజలకు మేలు చేస్తాయని హామీ ఇచ్చారు.

గిరిజన ప్రాంతాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం జిల్లా..

రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటును సీఎం చంద్రబాబు ప్రజల సౌకర్యం ఆధారంగా తీసుకున్నారు. చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు సమీప మండలాలతో కలిపి 3.49 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పడటంతో గిరిజన ప్రాంతాల్లో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు చింతూరు నుంచి 215 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉండటం వల్ల ప్రజలు రోజుకూ ఒక్క రోజు మాత్రమే జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారని ఈ జిల్లా ఏర్పాటు ద్వారా ఆ ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.

రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లోని రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు చింతూరు డివిజన్‌లోని యేటపాక, చింతూరు కూనవరం, వరరామచంద్రాపురం మండలాలతో కలిపి ఈ జిల్లా రూపొందనుంది. ఈ మార్పు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధికి కీలకం అవుతుందని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో రెండు డివిజన్లతో చిన్న జిల్లా ఏర్పాటు చేయకుండా బలమైన అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు.

సీఎం చంద్రబాబు ఈ సమీక్షలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగటంతో పరిపాలనా సౌలభ్యం మెరుగుపడుతుందని హుషారుగా చెప్పారు. మార్కాపురం 11.42 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే అతిపెద్ద కొత్త జిల్లాగా మార్కాపురం, కనిగిరి డివిజన్లు, 20కి పైగా మండలాలతో ఏర్పడనుంది. మదనపల్లి 11.05 లక్షల జనాభాతో మదనపల్లి, పీలేరు డివిజన్లు 19 మండలాలతో హార్టీకల్చర్ హబ్‌గా మారనుంది. ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు ఒక కొత్త మండలం కూడా ఏర్పాటుతో ప్రజలకు మరింత సౌకర్యం అందుతుందని, మంత్రుల కమిటీ సిఫార్సులకు పూర్తి ఆమోదం తెలపడంతో కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వెళ్తాయని తెలిపారు. ఈ మార్పులు 2026 జనవరి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు నిర్దేశించారు.

Read More
Next Story