శతబ్దాలుగా ఆదివాసీలకు అన్యాయం : జస్టిస్ సుదర్శన్ రెడ్డి
"ఆదివాసీలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ, బయట ప్రపంచం వారు వారిని హననం చేస్తూ, వారి సంస్కృతిని ధ్వంస చేస్తున్నారు."
‘‘ఆదివాసీలది ఒక భిన్నమైన సంస్కృతి. చాలా దేశాల్లో వారిని, వారి సంస్కృతిని నిర్మూలించారు. మన దేశంలో కూడా ఒక క్రమ పద్దతిలో ఆదివాసీల సంస్కృతిని తుడిచిపెట్టాలని చూస్తున్నారు.’’ అని సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సుదర్శన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం ఈనాటిది కాదు. ఈ అన్యాయం మౌర్యుల కాలంలోనే ప్రారంభమైంది. ఆదివాసీలకు, మిగతా సమాజానికి మధ్య నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంది.’’ అని ఆయన గుర్తు చేశారు.
హక్కులు-కార్పొరేటీకరణ-సంఘీభావ ఉద్యమాలు’ అన్న అంశం పైన శుక్రవారం ఉదయం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.
ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించినందున, ఈ నెల 15వ తేదీ వరకు ఆదివాసీ హక్కుల వారోత్సవంగా నిర్వహించాలని రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికలు నిర్ణయించాయి. ఈ వేదికల ఆధ్వర్యంలో రెండు రోజుల ఈ జాతీయ సదస్సులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘స్వరాజ్యంలో ఆదివాసీలకు ప్రత్యేక స్థానం లేకుంటే స్వతంత్ర దేశం నిర్మించలేము’’ అని గాంధీజీ అన్న మాటలను గుర్తు చేశారు.
‘‘ఆదివాసీలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ, బయట ప్రపంచం వారు వారిని హననం చేస్తూ, వారి సంస్కృతిని ధ్వంస చేస్తున్నారు. కార్పొరేట్ అభివృద్ధి కి, ఆదివాసీల మనుగడకు మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది. ఏ చర్చ జరిగినా విలువల చట్రంలోనే జరగాలి. విలువల చట్రంలో లేకపోతే ఉపయోగం లేదు. 2004లో అభివృద్ధి నమూనా విశ్వరూపం వల్ల అటవీ భూములను బదిలీ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. ఈ చర్చను బైట సమాజంలోకి తీసుకెళ్లాలి’’ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పిలుపిచ్చారు.
ఏ హక్కుల గురించి మాట్లాడుకుందా? : మాఢభూషి శ్రీధర్
‘‘హక్కుల దినోత్సవం నాడు రాజ్యాంగం గురించి, చట్టాలను గురించి మాట్లాడుకుంటాం. ఎక్కడ హక్కులు ఉండవో అక్కడ హక్కుల గురించి మాట్లాడుకుంటాం’’ అని కేంద్ర సమాచార హక్కుల మాజీ కమిషనర్ మాఢభూషి శ్రీధర్ తన ఆహ్వాన సంఘ అధ్యక్షోపన్యాసంలో అన్నారు. ‘‘ఆదివాసీ హక్కులను రాజ్యాంగంలో 5.6 షెడ్యూల్డులలో పేర్కొన్నారు. రాష్ట్రపతి పేరుతో పాలన సాగుతుంది. కానీ పాలించేది జిల్లా కలెక్టర్. ఆర్టికల్ 21,22 ప్రకారం ఎవరినైనా అరెస్టు చేస్తే 24 గంటల లోగా కోర్టు ముందు హాజరుపరచాలని ఉంది. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం అరెస్టు చేస్తే 15 రోజులు నిర్బంధించవచ్చు. 60 రోజు lలు, 90 రోజుల వరకు కూడా నిర్బంధిచవచ్చు. ఆ తరువాత పరిపాలకుడి ఇష్టం. డ్రోన్లకు బాంబులను అమరుస్తున్నారు. వాటిని అడవుల్లో వదులుతున్నారు. మనుషులను చంపేసే డ్రోన్లు వస్తున్నాయి. ఈ స్థితిలో ఏ హక్కుల గురించి మాట్లాడుకుందాం?’’ అని ప్రశ్నించారు.
ఆదివాసీ హక్కులంటే అందరి హక్కులు : ఫ్రొఫెసర్ జి.ఎన్
ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడడమంటే ప్రజలందరి హక్కుల గురించి మాట్లాడడమని ప్రొఫెసర్ జి.ఎన్ అన్నారు. ’’ఆదివాసీలు 200 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఈస్టిండియా కంపెనీ వచ్చినప్పటి నుంచి ఆదివాసీలు పోరాడ వలసి వచ్చింది. హక్కులు ప్రమాదంలో పడిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తం మానవ సమాజం ప్రమాదంలో పడిపోతుంది.’’ అని ప్రొఫెసర్ జి.ఎన్ హెచ్చరించారు.
ఆదివాసీల గురించి మాట్లాడుతున్నామంటే చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, అందరి హక్కుల గురించి మాట్లాడుతున్నట్టు భావించాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ సమన్వయ కర్త ప్రొఫెసర్ లక్ష్మణ్ తన స్వాగతోపన్యాసంలో అన్నారు. మనం ఆదివాసీ హక్కులకు మాత్రమే పరిమితం కాలేదని, కార్పొరేట్ దోపిడీ ఎలా జరుగుతోందో వివరించదలుచుకున్నామని పేర్కొన్నారు. అడవిని, ఆదివాసీలను పరిరక్షించకపోతే ఆక్సీజన్ ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు.
ప్రతి జాతి లోనూ నాగరికత ఉంటుందని, నాగరికతలో ఎక్కువ తక్కువలని మాట్లాడకూడదని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మహంతి మాట్లాడుతూ అన్నారు. ఒకప్పుడు గిరిజనులనే వారు కానీ, ఇప్పుడు ఆదివాసీ అంటున్నారని, ఆదివాసీలంటే స్వయం పోషక ప్రజలన్న అర్థం వస్తుందని పేర్కొన్నారు. ఆదివాసీ అనేది ఒక బలమైన రాజకీయ పదమైందని, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆదివాసీలపై అధ్యయనం చేస్తున్నారని గుర్తు చేశారు. జార్ఖండ్ ఉద్యమంలో ఆదివాసీలు ఎక్కువగా పాల్గొనడం వల్ల ఆ పదం ముందుకు వచ్చిందని అన్నారు.
సంపదను కొల్లగొట్టడానికే వలసలు : ప్రొఫెసర్ నరసింహారెడ్డి
ఆదివాసీ సంస్కృతిని మన సంస్కృతిగా గౌరవించే సంస్కారం రావాలని ప్రొఫెసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ అన్నారు. ఆదివాసీ సంస్కృతిని సమాజం అర్థం చేసుకునే విధంగా అవతరించాలని ఆయన ఆకాంక్షించారు. సంపదను దోచుకోడానికే వలస వాదం వచ్చిందని, తమ దోపిడీకి సహకరించకపోతే స్థానిక పాలనను కూడా వలసవాదులు కూలదోస్తారని గుర్తు చేశారు.
పనిచేయని వాడి దగ్గర డబ్బులెక్కువ : హిమాంశు
‘‘అయిదేళ్ల పిల్లవాడు చాలా కష్టపడతాడు. చాలా మంది అసలు కష్టపడరు. ఎక్కువ కష్టపడే వారి దగ్గర డబ్బులు ఉండవు కానీ, అసలు కష్టపడని వారి దగ్గర డబ్బులు ఎక్కవగా ఉంటాయి. పనిచేసే వారికి ఎక్కువ గౌరవం ఉండాలి కానీ, పనిచేయని వాడి దగ్గరే ఎక్కవ డబ్బులుంటాయి.’’ అని ఛత్తీస్ ఘడ్ కు చెందిన గాంధేయ వాది హిమాంశు పేర్కొన్నారు. ఆదివాసీలపై భద్రతాదళాల వారు అత్యాచారం చేశారని నేను సుప్రీం కోర్టులో కేసు పెడితే, ఆ కేసును కొట్టేయడమే కాకుండా తన పై జరిమానా విధించారని గుర్తు చేశారు. జరిమానా కట్టను కాక కట్టనని, జైలులో పెట్టండని కోరినట్టు వెల్లడించారు. మనం ఈ నేలకు చెందిన వాళ్లమే కానీ, ఈ నేల మనకు చెందింది కాదు అని చమత్కరించారు.
సదస్సులో పాటలు
చివరగా చిలకా చంద్ర శేఖర్ అధ్యక్షతన సౌహార్ద్ర ప్రతినిధుల సందేశాలను పలువురు వినిపించారు. మధ్య మధ్యలో ఆదివాసీ హక్కుల పరిరక్షణకు మద్దతుగా కళాకారులు పాటలు పాడారు.
Next Story