
చిక్కుల్లో ఆంధ్ర, అదానీ పవర్ డీల్?
చంద్రబాబు లేఖతో సోలార్ పవర్ ఒప్పందంపై గందరగోళం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ అదానీ గ్రీన్ కంపెనీకి మధ్య కుదిరిన సోలార్ పవర్ ఒప్పందం చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది. 2021లో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 7,000 మెగావాట్ల సోలార్ పవర్ సరఫరా ఒప్పందం ఇది.
చంద్రబాబు నాయకత్వంలోని ప్రస్తుత ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మెలిక పెట్టడంతో ఇప్పుడది మరోసారి తెరపైకి వచ్చింది. సుమారు 40 శాతం మేర ఇంటర్-స్టేట్ ట్రాన్స్మిషన్ ఫీజు తగ్గించాలని కోరడమే ఇందుకు కారణమైంది.
2021లో కేంద్రప్రభుత్వానికి చెందిన Solar Energy Corporation of India (SECI) మధ్యవర్తిత్వంతో ఆంధ్రప్రదేశ్, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి మధ్య భారీ సోలార్ పవర్ కాంట్రాక్ట్ కుదిరింది. 7 వేల మెగావాట్ల ఒప్పందం కుదిరే సమయంలో వినియోగదారులకు “క్లీన్ ఎనర్జీ” అందిస్తుందని, నాణ్యమైన విద్యుత్ అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ ఒప్పందం కుదుర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆనాటి పెద్దలు కొందరికి ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అదానీ గ్రూప్ షేర్ హోల్డర్లు కొందరు అమెరికాలో కేసులు కూడా పెట్టారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువులు, కంపెనీ అధికారులపై $265 మిలియన్ల లంచం ఆరోపణలు నమోదయ్యాయి. అదానీ గ్రూప్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఆ వివాదం అలా ఉంచితే ఇప్పుడు తాజాగా పవర్ ట్రాన్స్మిషన్ ఫీజు తగ్గించాలని చంద్రబాబు ప్రభుత్వం కోరుతోంది.
ఈ ప్రాజెక్టు కింద అదానీ సంస్థ వచ్చే 25 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కి విద్యుత్ సరఫరా చేయడానికి అంగీకరించింది. కానీ ఇతర రాష్ట్రాల గుండా విద్యుత్‌ను రవాణా చేసే సమయంలో చెల్లించాల్సిన ట్రాన్స్మిషన్ రుసుమును మాఫీ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పట్టుబడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల అదానీ గ్రూపుకు, సెకీకి ఈమేరకు లేఖ రాసింది.
ఈ మినహాయింపు లేకపోతే ఒక్కో యూనిట్ విద్యుత్ ధర ₹2.49 నుంచి ₹3.49కి పెరిగే ప్రమాదం ఉందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అంటే, సుమారు 40% అధిక ఖర్చు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాపై భారీ భారమో, లేదా వినియోగదారులపై అధిక బిల్లుల రూపంలో చార్జీల మోతో పడే అవకాశం ఉంది.
2021లో అదానీ గ్రీన్, ఏపీ ప్రభుత్వం, Solar Energy Corporation of India (SECI) మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
అప్పట్లో ట్రాన్స్మిషన్ ఫీజు మినహాయింపు లభించింది. కానీ 2023లో నియంత్రణ మార్పుల కారణంగా ఆ మినహాయింపు రద్దైంది.
సెప్టెంబర్ 2న ఏపీ ప్రభుత్వం SECIకి లేఖ రాసి, “ఫీజు మినహాయింపు హామీ ఇస్తేనే విద్యుత్ తీసుకుంటాం” అని స్పష్టంగా తెలిపింది.
ఇప్పటికీ అదానీ సంస్థ 4,312 మెగావాట్ల సోలార్ పవర్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని రాయిటర్ వార్తా సంస్థ తెలిపింది.
అయితే, SECIకి మినహాయింపు ఇచ్చే అధికారమే లేదని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఒప్పందం నిలిచిపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభావం ఎవరిపై పడుతుంది?
ట్రాన్స్మిషన్ ఫీజు మినహాయింపు ఇవ్వకపోతే విద్యుత్ ఖర్చు పెరిగి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కుదేలయ్యే ప్రమాదం ఉంది.
దీనివల్ల ప్రజలపై భారం పడుతుంది. విద్యుత్ బిల్లులు పెరగవచ్చు. వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు ఇది భారంగా మారుతుంది.
వివాదం ముదిరితే ఒప్పందం వాయిదా పడే లేదా పూర్తిగా రద్దు కావచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒప్పందంలో రాజకీయ కోణం..
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగం ఎప్పుడూ రాజకీయ వాదోపవాదాలకు కేంద్రబిందువే. జగన్ ప్రభుత్వంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇప్పుడు తీవ్ర వివాదమయ్యాయి. ఆ జాబితాలో తాజాగా అదానీ విద్యుత్ ఒప్పందం చేరింది. చంద్రబాబు ప్రభుత్వం ట్రాన్స్ మిషన్ ఫీజు రాయితీ కోరుతోంది.
“సోలార్ పవర్ ప్రాజెక్టులు పర్యావరణానికి మంచివే. భవిష్యత్తు తరాలకు అవసరమే. కానీ ఆర్థికంగా రాష్ట్రానికి భారం కాకుండా ఉండాలి. ట్రాన్స్మిషన్ ఫీజు మినహాయింపు రాకపోతే, ఈ ఒప్పందాన్ని పునరాలోచించక తప్పదేమో” అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక ఒప్పందం – అనేక ప్రశ్నలు
ట్రాన్స్మిషన్ ఫీజు మినహాయింపు సాధ్యమా?
ధరలు పెరిగితే ప్రజలపై ప్రభావం ఎంత?
25 ఏళ్లపాటు ఈ ఒప్పందం కొనసాగితే రాష్ట్ర ఖజానా భరించగలదా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రానంతవరకు అదానీతో 7,000 మెగావాట్ సోలార్ పవర్ ఒప్పందం గందరగోళంలోనే పడినట్టే భావించాలి
Next Story