
ట్యాపింగ్ కేసులో సిట్ కు సహకరించని శ్రవణ్ రావు
ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు నిందితుడు ఏమాత్రం సహకరించటంలేదని సమాచారం
టెలిఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు విచారణలో సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాడు. ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు నిందితుడు ఏమాత్రం సహకరించటంలేదని సమాచారం. ట్యాపింగ్ కేసులో మొదటి అరెస్టు జరిగిన మరుసటిరోజే అమెరికాకు నిందితుడు పారిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన టీ ప్రభాకరరావు, మీడియా యజమాని శ్రవణ్ రావు ఇద్దరు ట్యాపింగ్ కేసులో కీలక పాత్రదారులు. 2024 మార్చి 11వ తేదీన ట్యాపింగ్(Telephone Tapping) కేసులో డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు అరెస్టు చేసిన మరుసటి రోజే ఇద్దరు కీలక పాత్రదారులు అమెరికా(America)కు పారిపోయారు. అప్పటినుండి సిట్ విచారణకు సహకరించకుండా నానా అవస్తలు పెడుతున్నారు.
రకరకాల ప్రయత్నాల తర్వాత సుప్రింకోర్టు(Supreme court) రక్షణ, ఆదేశాలతో శ్రవణ్ సిట్ విచారణకు హాజరవుతున్నారు. గడచిన 15 రోజుల్లో నిందితుడు మూడుసార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఒక్కసారికూడా అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాదానాలు చెప్పలేదని తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో నిందితుడు రెండు ఫోన్లను ఉపయోగించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ రెండుఫోన్లను తీసుకుని విచారణకు రమ్మని చెప్పారు. అయితే నిందితుడు మాత్రం పాత ఫోన్ను తీసుకొచ్చి అందించాడు. నిందితుడు అందించిన ఫోన్ను చూసిన సిట్ అధికారులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే శ్రవణ్ ఇచ్చిన పాతఫోన్ తుప్పుపట్టిపోయుంది. అంత తుప్పుపట్టిపోయిన ఫోన్ శ్రవణ్ ఎక్కడినుండి సంపాదించాడనే విషయంలో అధికారులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
విచారణలో నిందితుడు ఇచ్చిన తుప్పుపట్టిన ఫోన్ కు 2023 ఎన్నికల సందర్భంలో వాడిన రెండు ఫోన్లకు ఏమాత్రం సంబంధంలేదని అధికారులు గుర్తించారు. అందుకనే అధికారులేమో ఆ రెండు ఫోన్లకోసం గట్టిగా అడుగుతుంటే నిందితుడేమో తాను వాడిన ఫోన్నే ఇచ్చేనట్లు సమాధానం ఇస్తున్నాడు. దాంతో ఏమిచేయాలో అధికారులకు అర్ధంకావటంలేదు. విచారణలో భాగంగా నిందితుడిని గట్టిగా హ్యండిల్ చేసేందుకు లేదు. ఎందుకంటే సుప్రింకోర్టు ఆదేశాలతో శ్రవణ్ విచారణకు హాజరవుతున్నాడు. విచారణలో ఏమన్నా తేడా జరిగితే వెంటనే నిందితుడు మళ్ళీ సుప్రింకోర్టుకు వెళతాడనటంలో సందేహంలేదు. అదే జరిగితే విచారణ జరిపేందుకు లేదని సుప్రింకోర్టు నిలిపేసినా ఆశ్చర్యంలేదు.
అందుకనే విచారణలో అధికారులు చాలా మెత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే నిందితుడు దీన్ని సాకుగా తీసుకుని విచారణకు ఏమాత్రం సహకరించటంలేదని సిట్ వర్గాల సమాచారం. మంగళవారం నిందితుడు మళ్ళీ సిట్ విచారణకు హాజరుకావాల్సుంది. ఈరోజు విచారణ ఎలాగ జరగబోతోందనే విషయం అందరిలోను ఆసక్తిని పెంచేస్తోంది. ఏమి జరుగుతుందో చూడాలి.