ఏసీబీకి రిజిస్ట్రేషన్ శాఖలోనే అవినీతి కనపడిందా?
x

ఏసీబీకి రిజిస్ట్రేషన్ శాఖలోనే అవినీతి కనపడిందా?

మిగతా శాఖలు శుద్ధపూసలా అని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు


అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు ఉద్యోగ వర్గాలను విస్మయపరుస్తున్నాయి. 'ఏకకాలంలో దాడులు జరపడానికి ఒక్క రిజిస్ట్రేషన్ శాఖే కనిపించిందా, మిగతా శాఖలన్నీ పవిత్రంగా ఉన్నాయా' అని రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగి ఒకరు మీడియా ఎదుట వాపోయిన తీరు అందర్నీ ఆలోచనలో పడేసింది. నిజమే కదా అని ముక్కున వేలేసుకునేలా చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం చెబుతోంది.. ఏసీబీ అధికారులు దాడులతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఏసీబీ అధికారుల కన్ను కేవలం ఒకే ఒక్క శాఖపై పడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. అయితే, ఈ దాడులన్నీ కేవలం రిజిస్ట్రేషన్ శాఖ చుట్టూనే తిరగడంపై సదరు శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు.
అవినీతి అంటే రిజిస్ట్రేషన్ల శాఖేనా?
రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. భోగాపురం నుంచి చిలమత్తూరు వరకు సబ్‌రిజిస్ట్రార్ల ఇళ్లు, కార్యాలయాలను జల్లెడ పట్టారు.
"అవినీతిని అంతం చేయడం మంచిదే.. కానీ ప్రభుత్వం దృష్టిలో అవినీతి అంటే కేవలం రిజిస్ట్రేషన్ల శాఖేనా?" అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మైనింగ్ వంటి కీలక శాఖల్లో అక్రమాలకు ఆస్కారం లేదా? అక్కడ అంతా పారదర్శకంగా జరుగుతోందా? అని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి.
పాత కేసుల పేరుతో పదే పదే వేధింపులా?
గత నెల 5, 6 తేదీల్లో అప్పటికే సోదాలు నిర్వహించి, 4 క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఏసీబీ.. మళ్ళీ అదే కేసుల సాకుతో ఇప్పుడు 14 నివాస ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

విశాఖలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు, భోగాపురంలో రామకృష్ణ, చిలమత్తూరులో ప్రసాద్ బాబు, ఇబ్రహీంపట్నంలో మహమూద్‌లను టార్గెట్ చేస్తూ సాగిన ఈ సోదాలు శాఖా పరమైన కక్షసాధింపు చర్యలని కొందరు ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.
సిబ్బంది ఆవేదన ఇదే..
"భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని రైడ్స్ చేస్తున్నారు. కానీ, ఇతర శాఖల్లో ఫైళ్లు కదలాలంటే జరిగే లావాదేవీలు ఏసీబీకి కనిపించడం లేదా?" అన్నది ఇప్పుడు సచివాలయం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వరకు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న.
అవినీతిపై యుద్ధం చేయాల్సిందే.. కానీ అది అన్ని శాఖల్లోనూ నిష్పాక్షికంగా జరగాలని, కేవలం ఒక శాఖపైనే స్పెషల్ ఫోకస్ పెట్టి మిగతా శాఖలను 'శుద్ధపూస'ల్లా వదిలేయడం ఏంటని ఉద్యోగులు సెటైర్లు వేస్తున్నారు.
ఏసీబీ అధికారులు మంగళవారం ఏపీలోని పలువురు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు సిబ్బందికి సంబంధించిన 14 నివాస ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. అవినీతి జరుగుతుందనే సమాచారంతో గత నెల 5, 6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 4 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి మంగళవారం పలుచోట్ల అధికారులు సోదాలు చేపట్టారు.
భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ల నమోదు విషయంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ రైడ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారుల్లో భయం నెలకొంది.
ఫిర్యాదుల ఆధారంగానే దాడులు చేస్తున్నాం: ఏసీబీ స్పష్టీకరణ
తమ సోదాలపై వస్తున్న విమర్శలను ఏసీబీ అధికారులు కొట్టిపారేశారు. ఈ దాడులు ఏకపక్షంగా జరుగుతున్నవి కావని, బాధితుల నుంచి వచ్చిన నిర్దిష్టమైన ఫిర్యాదులు, క్షేత్రస్థాయి పరిశీలన (Surprise Checks) ఆధారంగానే తాము స్పందిస్తున్నామని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ల నమోదు, భూముల విలువ నిర్ధారణ వంటి అంశాల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉందని, అందుకే ఆ శాఖపై దృష్టి పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో నమోదైన కేసులకు సంబంధించి కీలక ఆధారాల సేకరణలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి ఏ శాఖలో ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
Read More
Next Story