బిగ్ బ్రేకింగ్:కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు
x

బిగ్ బ్రేకింగ్:కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు

ఫార్ములా కారు రేసు నిర్వహణ పేరుతో 45 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి జరిగిందని ఏసీబీ ఏ1గా కేసు నమోదుచేసింది. కేటీఆర్(KTR) తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి మీద కూడా కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటు చాలామంది ఎప్పుడెప్పుడా అని కేసు విషయంలో ఎదురు చూస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్ రేసులో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి(Revanth Reddy0 చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో విచారణ చేయించారు. ఫార్ములా కారు రేసు(Formula E Car Race) వ్యవహారంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీగా పనిచేసిన అర్వింద్ కుమార్ ను చీఫ్ సెక్రటరీ విచారించింది.

ఆ విచారణలో విదేశీకంపెనీకి రు. 45 కోట్లు బదిలీ చేసినట్లు అర్వింద్ అంగీకరించారు. అందుకు సంబంధించిన ఆదేశాలను చూపించమని అడిగినపుడు అర్వింద్ చూపించలేకపోయారు. కారణం ఏమిటంటే అప్పట్లో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నోటిమాటగా ఇచ్చిన ఆదేశాలతోనే తాను రు. 45 కోట్లు బదిలీచేసినట్లు చెప్పారు. అదేవిషయాన్ని చీఫ్ సెక్రటరీకి అర్వింద్ రాతమూలకంగా రాసిచ్చారు. దాంతో ఫార్ములా కారు రేసు నిర్వహణ పేరుతో 45 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అందుకనే కేటీఆర్ పైన కేసుపెట్టి విచారించాలని అనుకున్నది. అందుకు అనుమతించాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)కు ప్రభుత్వం లేఖ రాసింది. దాదాపు నెలన్నరరోజులు తర్వాత గవర్నర్ కేటీఆర్ మీద కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో చర్చించిన రేవంత్ మంత్రుల అంగీకారం తీసుకుని కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. కేటీఆర్ మీద కేసు నమోదుచేసి విచారించాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్(ACB Director General) కు మూడురోజుల క్రితం చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. చీఫ్ సెక్రటరీ నుండి వచ్చిన ఆదేశాల ఆధారంగా ఏసీబీ గురువారం సాయంత్రం కేటీఆర్ మీద ఏ1గా కేసు నమోదుచేసింది. కేటీఆర్ మీద నాలుగు సెక్షన్లు 13(1)ఏ, 13(2) సీపీ యాక్ట్ 409, 120బీ రూపంలో నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేసింది. ఆర్ధికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీకంపెనీకి రు. 45 కోట్లు హెచ్ఎండీఏ నుండి బదిలీచేశారని కేటీఆర్, అర్వింద్ మీద కేసులు నమోదయ్యాయి. ఇదే విషయమై కేటీఆర్ మాట్లాడుతు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అంటున్నారు. ఫార్ములా కార్ రేసు అన్నది అసలు కేసే కాదని కొట్టిపారేశారు. కేసు నమోదుచేసిన ఏసీబీ ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి)ను ఏర్పాటుచేసింది కాబట్టి విచారణకు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

Read More
Next Story