
లంచాలపై ఏసీబీ కొరడా
రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టిన ఏసీబీ తనఖీలు ఆ శాఖ అధికారుల్లో కలకలం రేపుతోంది.
రిజిస్ట్రార్ కార్యాలయపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు ముమ్మరం చేసింది. అందులో భాగాంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం రెండో రోజు విస్తృత తనిఖీలు చేపట్టారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు జరిగిన నేపథ్యంలో ఇక్కడి కార్యాలయంలో అనధికారిక రిజిస్ట్రేషన్లు, లంచాలు, అక్రమాలపై లోతుగా విచారణ జరుగుతోంది. ఈ సోదాలపై ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని, పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఉదయం నుంచే ప్రారంభమైన తనిఖీల్లో అధికారులు రిజిస్ట్రేషన్ పత్రాలు, ల్యాప్‌టాప్‌లలో ఉన్న డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనధికారికంగా పని చేస్తున్న ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లను గుర్తించి, వారి పాత్రపై దృష్టి సారించారు. వీఆర్వోపై వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ చేస్తున్నామని, అన్ని కోణాల్లో దృష్టి పెట్టి నిజాలు తెలుసుకుంటామని డీఎస్పీ సుబ్బారావు అన్నారు. ఇబ్రహీంపట్నం కార్యాలయం ఎన్‌టీఆర్ జిల్లాలో ప్రధాన రిజిస్ట్రేషన్ కేంద్రం కావడంతో, ఈ తనిఖీలు ప్రాంతీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
బుధవారం మొదలైన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.74,600 నగదును సీజ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు వెల్లడించారు. ఇది లంచాలు, అక్రమ లావాదేవీలకు సంబంధించినదిగా అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్త సోదాల్లో ఇబ్రహీంపట్నం వంటి ప్రదేశాల్లో రూ.10,000 నుంచి రూ.75,000 వరకు అకౌంటెడ్ నగదు సీజ్ అయిందని, మొత్తం 120 కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ చర్యలు భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మోసాలను నిర్మూలించడానికి భాగమని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం కార్యాలయంలో సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని, రికార్డులు, డాక్యుమెంట్లు సీజ్ చేసి లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరో వైపు ఈ ఏసీబీ తనిఖీలు రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందిలో కలకలం రేపుతున్నాయి.

