
ఏసీబీ కోర్టులో ఐపీఎస్ సంజయ్ కుమార్‌కు నిరాశ
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్, అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ కుమార్‌కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇవాళ తిరస్కరించింది.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలో, సంజయ్ డీజీగా, సీఐడీ ఏడీజీగా ఉన్న సమయంలో సుమారు ₹1.5 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు ఫిర్యాదు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో టెండర్ నిబంధనలు ఉల్లంఘించడం, అధిక ఖర్చు చేయడం, కొన్ని పనులు పూర్తిగా చేయకపోవడం వంటి అంశాలపై కూడా ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా అగ్నిమాపకశాఖలో అమలు చేసిన AGNI-NOC వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ప్రాజెక్ట్‌లో అసమానతలు ఉన్నాయని విచారణలో తేలినట్లు సమాచారం.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో, సంజయ్ స్వయంగా ఏసీబీ ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనను 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.
తదుపరి విచారణలో సంజయ్‌పై మరిన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. గత వారంలో ఏసీబీ బృందం ఆయనను మూడు రోజులపాటు విచారించింది.
సస్పెన్షన్ పొడిగింపు
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విచారణ కొనసాగుతున్నందున సంజయ్ సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగించింది. ఆయన ప్రస్తుతానికి విజయవాడ సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
సంజయ్ కుమార్ 1996 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. సీఐడీ, ఫైర్ సర్వీసెస్, హ్యూమన్ రైట్స్, ఎసిసి, ఎస్టి కమిషన్ వంటి కీలక విభాగాల్లో ఆయన సేవలందించారు. కానీ గత రెండేళ్లుగా ప్రభుత్వ నిధుల వినియోగంపై వచ్చిన ఫిర్యాదులు, పరిపాలనా అసమానతల కారణంగా ఆయనపై విచారణ కొనసాగుతోంది.
Next Story