టీడీపీ స్వాధీనంలోకి ఏసీఏ?
x

టీడీపీ స్వాధీనంలోకి ఏసీఏ?

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ టీడీపీ స్వాధీనంలోకి రానుంది. విజయవాడ ఎంపీ కేశినేని వివనాథ్‌ అధ్యక్షుడు కానున్నారు. వచ్చేనెల 8న ఎన్నికలు జరుగుతాయి.


ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఇక నుంచి తెలుగుదేశం పార్టీ అధీనంలోకి రానుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్‌ అందుకు సంబంధించి అపెక్స్‌ కౌన్సిల్‌కు ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. అధ్యక్షునిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ను నిర్ణయించారు. ఆయనకు కర్నూలు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి ఓటు హక్కు కూడా వచ్చింది. మొత్తం ఆరు పోస్టులకు ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌ పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టంబరు 8న ఎన్నికల తేదీని ఎన్నికల అధికారి ప్రకటించారు.

ఓటర్లు ఎంత మంది..
ఏసీఏలో ఓటర్లు ఎంత మందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు అందరూ క్రికెట్‌ క్లబ్, క్రికెట్‌ అసోసియేషన్‌లోని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులకు ఓటు హక్కు ఉంటుందని భావించారు. అయితే ఒక్కో అసోసియేషన్‌ నుంచి ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. ఎవరిని రాష్ట్ర కమిటీని ఎన్నిక చేసుకునేందుకు ఓటరుగా ఉండాలో జిల్లా అసోసియేషన్‌లు, క్లబ్‌లు నిర్ణయిస్తాయి. క్రికెట్‌ అసోసియేషన్‌ల నుంచి 13 మందికి, క్రికెట్‌ క్లబ్స్‌ నుంచి 18 మందికి, ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారులకు ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం 34 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లు రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటారు. ఓటర్లకు డిమాండ్‌ పెరిగే అవకాశం కూడా ఉంది. సమావేశాలు, సభలు వంటివి పెట్టేందుకు వీలు లేదని ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు.
నోటిఫికేషన్‌ జారీ
ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పూర్వపు కమిటీ నియమించింది. అనంతరం వారు రాజీనామా చేశారు. ఓటర్లకు సంబంధించిన వివరాలు, ఓటర్ల జాబితాను ఈనెల 11లోపు క్లబ్‌లు, అసోసియేషన్‌లు ఎన్నికల అధికారికి ఇవ్వాలి. ఓటర్లకు సంబంధించిన రెండు ఫొటోలు ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 14లోపు ఓటర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారికి తెలియజేయవచ్చు. ఒక్కో క్యాండిడేట్‌ ఒక్క పోస్టుకు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా హాజరై పోటీ దారులు నామినేషన్‌లు దాఖలు చేయాలి. స్కూట్నీ తరువాత పోటీదారుల వివరాలు ప్రకటిస్తారు. 70 సంవత్సరాల లోపు వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు అసోసియేషన్‌లో ఉండకూడదు. శిక్షలు పడిన వారు కూడా పోటీ చేసేందుకు అన ర్హులు. సెస్టెంబరు 8న గుంటూరులో ఎన్నికలు జరుగుతాయి.
అంతర్జాతీయ క్రీడాకారులైన ఎంఎస్‌కె ప్రసాద్, వై వేణుగోపాలరావు, ఆర్‌ కల్పనలు ప్రత్యేక ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇప్పటి వరకు పెత్తనం చేసిన వైఎస్సార్‌సీపీ వారు నిష్క్రమించడంతో తెలుగుదేశం వారికి అవకాశం దక్కింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రికెట్‌ అసోసియేషన్‌లో రాజకీయాలు చోటు చేసుకున్నాయి.
Read More
Next Story